దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాప్తి తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. కేంద్రం ప్రభుత్వం అన్‌లాక్ 5.0 నిబంధనలనే నవంబర్ 30వరకు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఇప్పటికే దాదాపు అన్ని కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
ఇదే సమయంలో సినిమా థియేటర్లు, మల్టీప్లెక్సులు, ఎగ్జిబిషన్ హాల్స్, ఎంటర్టైన్మెంట్ పార్కులకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. 50 శాతం సీటింగ్ కెపాసిటీతో వీటిని నిర్వహించాలని తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో తప్పనిసరిగా తగినన్ని శానిటైజర్లు అందుబాటులో ఉంచడంతోపాటు ఇతర జాగ్రత్తలను కూడా తీసుకోవాల్సి ఉంటుంది.
మాస్క్ లేకుంటే ఎవర్ని అనుమతించరాదని ప్రార్థనా మందిరాల్లో కూడా కోవిడ్ నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమశాఖ సూచించింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు కూడా కోవిడ్ ముప్పు తప్పిందన్న భావనలో ఉండకుండా బయటకు వెళ్లినపుడు తప్పనిసరిగా మాస్కు ధరించడం, భౌతిక పాటించడంతోపాటు వెంట శానిటైజర్ ను కూడా తీసుకుని వెళ్లాలి.
ఇందుకోసం మన పాటించాల్సిన ముఖ్యమైన విధానం ఎస్.ఎం.ఎస్ ( సబ్బు/శానిటైజర్, మాస్కు, సోషల్ డిస్టెన్స్). కోవిడ్-19 ను ఎదుర్కొనడానికి ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న ఆయుధాల్లో ఈ ఎస్.ఎం.ఎస్ విధానం అతి ముఖ్యమైనది.
సబ్సు లేదా శానిటైజర్
మనం పనిచేసుకుంటున్న ప్రదేశంలోగానీ, ఇంట్లో గానీ, బయట కూరగాయలకు వెళ్లినపుడు, మెడికల్ షాపులకు వెళ్లినపుడు ఇలా అనేక సార్లు మనం చేతులతో ఎన్నో వస్తువులను తాకుతూ ఉంటాం. అవే వస్తువలను మనకు తెలియకుండా ఎంతోమంది తాకి ఉంటారు. అందువల్ల కోవిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఇంటికి రాగానే సబ్బు అయితే కనీసం 20 సెకన్ల నుంచి 40 సెకన్లపాటు మన చేతులను శుభ్రంగా కడుక్కోవాలి.
వంట వండే ముందూ, వండిన తర్వాత, ఆహారం తీసుకునేటప్పుడు, తీసుకున్న తర్వాత, మాంసం, చేపలూ మొదలయిన నాన్ వెజ్ పదార్థాలు శుభ్రం చేసేటప్పుడు, పిల్లలకు ఆహారం పెట్టే ముందు ఇలా ప్రతిసారి సబ్బుతోనూ, నీళ్లతోనూ చేతులు శుభ్ర పరుచుకోవాలి. ఒకవేళ బయటకు వెళ్లినట్టయితే తప్పనిసరిగా శానిటైజర్ దగ్గర ఉంచుకోవడం అవసరం.
మాస్కు ధరించడం
కోవిడ్ ను మన నుంచి ఇతరులకు, ఇతరుల నుంచి మనకు వ్యాప్తి చెందకుండా ఉంచే మార్గాల్లో మాస్కు ధరించడం కీలకమైనది. ప్రతిఒక్కరూ మాస్కు పెట్టుకోవడం ద్వారా కోవిడ్ వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గుతుందని నిపుణులు కూడా సూచిస్తున్నారు. అందుకే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు మాస్కులు ధరించడం తప్పనిసరి చేశాయి.
మాస్కులు పెట్టుకోకపోతే ఫైన్లు కూడా విధిస్తున్నారు. అందుకే ఇళ్ల నుంచి బయటకు వచ్చేవారు తప్పనిసరిగా మూడు లేయర్ల మాస్క్ కానీ, ఇంట్లో తయారు చేసిన మాస్క్ కానీ తప్పనిసరిగా ధరించాలి. మాస్కును ప్రతిరోజూ మారుస్తూ ఉండాలి. మాస్కును ఉతికిన తర్వాత ఎండలో ఆరబెట్టాలి.
భౌతిక దూరం
కోవిడ్ ను ఎదుర్కోనేందుకు మన దగ్గరున్న మరో ఆయుధం భౌతిక దూరం. ఇంటి నుంచి బయటకు అడుగుపెడితే తప్పనిసరిగా ఎదుటి వ్యక్తికి కనీసం ఆరు అడుగులు లేదా 2 మీటర్ల దూరం ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా కూరగాయల మార్కెట్‌లోను, కిరాణా షాపులకు వెళ్లినపుడు, మెడికల్ షాపులకు వెళ్లినపుడు, ఆఫీసులో పనిచేసే సమయంలో, ప్రయాణ సమయంలో, ప్రజలు ఎక్కువగా గుమికూడే ప్రాంతాల్లో తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి.
పైన సూచించిన విధంగా ప్రతిఒక్కరూ ఎస్.ఎం.ఎస్ (సబ్బు/శానిటైజర్, మాస్కు, సోషల్ డిస్టెన్స్) విధానాన్ని పాటించడం ద్వారా కోవిడ్ మహమ్మారి వ్యాప్తిని అరికట్టే అవకాశాలు ఉంటాయి. ఈ మూడింటిని తప్పనిసరిగా పాటిస్తూ ముందుకు సాగుదాం. కోవిడ్ మహమ్మారిని జయిద్దాం.