రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతోందని, రైతులను ఆదుకుంటున్నా మని చెప్పే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, రాష్ట్ర స్వయం ప్రతిపత్తికోసం తమకు ప్రాణసమానమైన భూములను త్యాగంచేసిన రైతులకు బేడీలు వేయడం పాలకుల సిగ్గుమాలిన చర్య అని మాజీమంత్రి కే.ఎస్.జవహర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆయన తననివాసం నుంచి విలేకరులతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి కేవలం తన శునకానందం కోసమే రైతులను ఈ విధంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడని జవహర్ మండిపడ్డారు. పక్క గ్రామాలనుంచి జగన్ ప్రభుత్వం పంపిన ఏటీఎమ్ బ్యాచ్ ని, రాజధానిప్రాంతరైతుల నిలదీశారని, అలా అడగమని రాజధాని రైతులకు చెప్పింది చెప్పింది కూడా డీఎస్పీనేన్నారు.
డబ్బులకోసం ఉద్యమం చేయడానికి వచ్చేవారిని నిలదీసినందుకు, పోలీసులు రైతులపై కేసులు పెట్టడమేంటన్నారు. అదికూడా ఎస్సీ , ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం చూస్తే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంతటి దుర్భరస్థితికి దిగజారిందో అర్థమవుతోందన్నారు. డీజీపీ తన హోదానుమర్చిపోయి, వైసీపీ చెప్పిందల్లా చేస్తున్నాడని, సుప్రీంకోర్టుఆదేశాలను కూడా తుంగలోతొక్కి, రైతులకు బేడీలు వేయడమేంటో ఆయన సమాధానం చెప్పాలన్నారు.
బేడీలు వేయాల్సింది రైతులకు కాదు, ప్రభుత్వంలోని వారికనే విషయాన్ని పోలీసులు మర్చిపోతే ఎలాగని జవహర్ ఎద్దేవాచేశారు. రైతులకు బేడీలు వేసిన విషయాన్నిసుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని, ఈ ఉదంతంపై మానవహక్కుల సంఘాలవారు కూడా స్పందించాలని మాజీమంత్రి విజ్ఞప్తిచేశారు.
జగన్మోహన్ రెడ్డి పైశాచిక చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని, వరదలకారణంగా విలపిస్తున్న అన్నదాతలను ఆదుకోవడం చేతగాని ప్రభుత్వం, రైతులను నేరస్తుల్లా చూస్తోందన్నారు. వరద బాధితప్రాంతాల్లో పర్యటించడం చేతగాని మంత్రులంతా, లోకేశ్ పర్యటనపై విమర్శలు చేస్తున్నారన్నారు. లోకేశ్ కొల్లేరుకు వెళ్లింది, నానీ లాంటి మంత్రులను ఆ సరస్సులో కలపడానికేనని జవహర్ స్పష్టంచేశారు.
సన్నబియ్యానికి, లావుబియ్యానికి తేడాతెలియని, నానీ, లోకేశ్ సమర్థతగురించి ప్రశ్నించడం ఏమిటన్నారు. తన నియోజకవర్గాన్ని చక్కబెట్టుకోవడం చేతగాని కొడాలినాని, ఏముఖం పెట్టుకొని లోకేశ్, చంద్రబాబులపై విమర్శలు చేస్తున్నాడని జవహర్ నిలదీశారు. రైతులకు బేడీలు వేసిన ఘటనలో, చర్యలు తీసుకోవాల్సింది డీజీపీపై అని, ముఖ్యమంత్రిని సంతోషపరచడంకోసం పోలీసులే అన్నదాతలకు బేడీలు వేశారన్నారు.
ఈ రోజు రైతులకు వేసిన బేడీలే, రేపు వైసీపీప్రభుత్వానికి ప్రజలు వేస్తారని మాజీమంత్రి హెచ్చరించారు. వరదలకారణంగా పంటలు కోల్పోయిన ప్రతిరైతుని ప్రభుత్వం ఆదుకోవాలని, ఆ దిశగా పిచ్చిపిచ్చి నిబంధనలు లేకుండా ప్రభుత్వం పనిచేయాలన్నారు.
ఏ వర్గానికి చెందిన వారో తెలుసుకోకుండా అమరావతి రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసులుపెట్టిన ప్రభుత్వం, ఇప్పటికైనా తప్పు తెలుసుకొని, మితిమీరి ప్రవర్తించిన పోలీసులకు బేడీలు వేయిస్తే మంచిదని జవహర్ హితవుపలికారు.