Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'కోవిడ్-19'లో వాస్తవాలు

'కోవిడ్-19'లో వాస్తవాలు
, బుధవారం, 21 అక్టోబరు 2020 (09:36 IST)
ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19 మహమ్మారి అన్ని వయస్సుల వారిపై ప్రభావం చూపిస్తోంది. ఈ మహమ్మారిపై చేసే యుద్ధంలో ప్రజలు గెలవాలి అంటే ముఖ్యంగా వారికి వ్యాధి పట్ల పూర్తి అవగాహన ఉండాలి. వ్యాధిపై అవగాహన పెంచుకోవడం ద్వారా వైరస్ ప్రమాద తీవ్రతను తగ్గించుకోవచ్చు.

ఇందులో భాగంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్-19పై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించడానికి ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో కోవిడ్-19 పై ఉన్న వదంతులు, వాస్తవాలను ఇప్పుడు తెలుసుకుందాం. కోవిడ్ పై అవగాహన, పెంచుకుని అప్రమత్తంగా ఉందాం. 
 
హైడ్రాక్సీక్లోరోక్విన్‌ వల్ల కోవిడ్-19ను నిరోధించలేమన్న డబ్ల్యూహెచ్ఓ
ప్రపంచ ఆరోగ్యసంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మరోసారి సంచలన ప్రకటన చేసింది. ఇప్పటి వరకు కోవిడ్-19 చికిత్సలో ఉపయోగిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌, క్లోరోక్విన్‌లు పెద్దగా ప్రభావం చూపడం లేదని ప్రకటించింది. అంతేకాకుండా కోవిడ్ మరణాల ముప్పును తగ్గించడం గానీ, తక్కువ అనారోగ్యంతో ఉన్నవారికి కూడా పెద్దగా ఉపయోగడడం లేదని స్పష్టం చేసింది.

హైడ్రాక్సీక్లోరోక్విన్‌, క్లోరోక్విన్‌లు మలేరియా జ్వరానికి మరియు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి వినియోగిస్తున్నారు. వీటిని వైద్య పర్యవేక్షణ లేకుండా కోవిడ్ చికిత్సకు వినియోగించడం ద్వారా తీవ్రమైన దుష్ప్రభావాలు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని చికిత్సకు వినియోగించకపోవడం మంచిదని తెలిపింది.
 
వృద్ధులతోపాటు అన్ని వయసుల వారిపైనా కోవిడ్-19 ప్రభావం:
కోవిడ్-19 కేవలం వృద్ధులపై మాత్రమే కాకుండా అన్ని వయసుల వారిపై ప్రభావం చూపుతుంది. అయితే 60ఏళ్లకు పైబడి ఆస్తమా, డయాబెటీస్, గుండెజబ్బులు ఉన్నవారిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. అయితే ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాప్తి చెందకుండా మాస్కు తప్పనిసరిగా ధరించడం, తరచూ చేతులను శుభ్రం చేసుకోవడం, ఇతరులకు కనీసం 6 అడుగుల దూరం పాటించాలి. 
 
థర్మల్ స్కానర్లు జ్వరాన్ని మాత్రమే గుర్తిస్తాయి.. కోవిడ్-19ను కాదు:
థర్మల్ స్కానర్ కోవిడ్ ఉందో లేదో చెబుతుందన్నది నిజం కాదు. థర్మల్ స్కానర్ అనేది కేవలం మనిషిలో ఉష్ణోగ్రత మాత్రమే చెబుతుంది. తద్వారా జ్వరం ఉన్నదీ లేనిదీ తెలుస్తుంది. మనుషుల్లో కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయా లేదా అన్నది గుర్తించడానికి 2 నుంచి 10 రోజుల సమయం పడుతుంది. 
 
న్యుమోనియా టీకాలు కోవిడ్ నుంచి రక్షించలేవు:
న్యుమోనియా టీకాలు తీసుకోవడం ద్వారా కోవిడ్ నుంచి రక్షణ ఉంటుందన్నది వాస్తవం కాదు. న్యుమోనియా నుంచి రక్షించుకోవడానికి మాత్రమే ఈ వ్యాక్సిన్ లను ఉపయోగిస్తారు. కోవిడ్ వ్యాక్సిన్ వస్తే తప్ప మునుపటి ఏ టీకాలు వైరస్ నుండి రక్షణ ఇవ్వలేవు. 
 
ముక్కును తరచూ సెలైన్‌తో శుభ్రం చేసుకున్నంత మాత్రాన కోవిడ్ నుంచి రక్షణ పొందలేము: 
ముక్కును నిరంతరం సెలైన్‌తో శుభ్రం చేసుకుంటే కోవిడ్ రాదన్న దాంట్లో నిజం లేదు. ఇలా సెలైన్‌తో ముక్కును శుభ్రం చేసుకుంటే కోవిడ్ రాదన్న దానికి ఎలాంటి ఆధారాలు లేవు. అయితే జలుబు వచ్చినప్పుడు ముక్కును క్రమం తప్పకుండా శుభ్రం చేసుకుంటే ఉపశమనం పొందవచ్చని మాత్రమే చెప్పవచ్చు.
 
ఈగల ద్వారా కోవిడ్ వ్యాపించదు:
ఈగల ద్వారా కోవిడ్  వ్యాపిస్తుందని నిర్థారించేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. కోవిడ్ సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు వెలువడే తుంపర్లు, అతను తాకిన వస్తువులను తాకడం ద్వారా మాత్రమే వ్యాధి సంక్రమిస్తుంది.
 
5జీ టెక్నాలజీతో కోవిడ్-19 వ్యాపించదు:
కోవిడ్-19 వైరస్‍ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించడంలో 5జీ సాంకేతిక పరిజ్ఞానం సాయం చేస్తోందంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 5జీ సాంకేతిక పరిజ్ఞానం వాడకం, దీనికి సంబంధించిన తరంగాలతో మానవ వ్యాధి నిరోధక శక్తి బలహీనపడుతోందంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వైరల్‍ అవుతున్నాయి.

వైరస్‍ వ్యాప్తికి, 5జీ సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధం లేదు. కోవిడ్-19 వైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమించడంలో 5జీ సాంకేతిక పరిజ్ఞానం సాయం చేస్తోందంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం నిజం కాదు.
 
వేడినీటితో స్నానం చేయడం ద్వారా కోవిడ్ ను నియంత్రించలేము:
ఎక్కువ వేడి ఉన్న నీటితో స్నానం చేస్తే కోవిడ్ రాదని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు. మనం ఏ ఉష్ణోగ్రత కలిగిన నీటితో స్నానం చేసిన సరే కరోనా వైరస్‌ చావదు. మనం ఏ ఉష్ణోగ్రత ఉన్న నీటితో స్నానం చేసినా మన శరీరం కొంత సేపటికి తన ఉష్ణోగ్రత క్రమబద్దీకరిస్తుంది.

మరీ ఎక్కువ వేడి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంకాలి ఎర్రగా మారే అవకాశం ఉంటుంది. అయితే  అందువల్ల కరోనాకు, నీటి ఉష్ణోగ్రతకు, స్నానానికి సంబంధం లేదు. కాకపోతే బయటకు వెళ్లి రాగానే స్నానం చేసి ఇంట్లోకి వస్తే కోవిడ్ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించకుండా చూసుకోవచ్చు. అంతేకాని కోవిడ్ ను మాత్రం అంతం చేయలేం.
 
యాంటీబయాటిక్స్ కోవిడ్ వైరస్ కు పనిచేయవు:
కోవిడ్ వైరస్ ను నివారించడంలో మరియు చికిత్స చేయడంలో యాంటీబయాటిక్స్ మరీ అంత ప్రభావవంతంగా లేవు. యాంటీబయాటిక్స్ వైరస్ లకు వ్యతిరేకంగా పనిచేయవు. అవి బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా మాత్రమే పనిచేస్తాయి. 
 
వేడి మరియు తేమ వాతావరణాలు కోవిడ్ వ్యాప్తిని నిరోధించలేవు:
వేడి మరియు తేమగా ఉండే వాతావరణంతో సంబంధం లేకుండా అన్ని ప్రాంతాలలోనూ కోవిడ్ వైరస్ వ్యాపిస్తుంది. కోవిడ్ వైరస్ ఉన్న ప్రాంతాల్లో మీరు నివసిస్తుంటే వాతావరణంతో సంబంధం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. 
 
యువకులు కూడా కోవిడ్ బారిన పడవచ్చు:
కోవిడ్ వైరస్ కు వయసుతో సంబంధంలేదు. వృద్ధులు, యువకులు అన్న తేడా లేకుండా అన్ని వయసుల వారికి వ్యాపిస్తుంది. అయితే ఉబ్బసం, మధుమేహం, గుండెజబ్బులు ఉన్నవారిపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. కాబట్టి ముందుజాగ్రత్తగా చేతులతో కళ్లు, నోరు, ముక్కును తాకవద్దు. తరచూ సబ్సు లేదా శానిటైజర్ తో చేతులను శుభ్రం చేసుకోండి. ఇతరులతో భౌతిక దూరం పాటించండి. 
 
వెల్లుల్లి తినడం ద్వారా కోవిడ్ నుంచి కాపాడుకోలేము:
వెల్లుల్లి అనేది ఆరోగ్యకరమైన ఆహారమే. ఇది కొన్ని యాంటీమైక్రోబయల్ లక్షణాలు కలిగి ఉంటుంది. కాబట్టి వెల్లుల్లి తింటే కోవిడ్ వైరస్ రాదు అనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. 
 
మద్యం తాగడంవల్ల కోవిడ్ నుంచి బయటపడలేము: 
మద్యం తాగడం వల్ల కోవిడ్ నుంచి రక్షణ పొందవచ్చు అన్నది వాస్తవం కాదు. అతిగా మద్యం సేవించడం వల్ల అరోగ్యం పాడయ్యే అవకాశం మరింత ఎక్కువ అవుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బడుగు, బలహీన వర్గాల వారిపై దాడిని సహించం: జగన్