పర్యాటకులకు థాయిలాండ్ శుభవార్త చెప్పింది. కరోనా కారణంగా టూరిజం దారుణంగా దెబ్బతిని ఆర్థిక పరిస్థితి దిగజారుతుండడంతో కరోనా నిబంధనలు సడలించింది. 45 దేశాల ప్రజలు క్వారంటైన్ ఆంక్షలు లేకుండానే దేశానికి రావొచ్చని తెలిపింది.
టూరిస్ట్ డెస్టినేషన్ అయిన థాయిలాండ్ కరోనాకు ముందు నిత్యం పర్యాటకులతో కళకళలాడుతూ ఉండేది. అయితే, ఆ తర్వాత నుంచి అంటే గత 18 నెలలుగా కఠిన ఆంక్షలు విధించింది. దీంతో పర్యాటక రంగం దారుణంగా దెబ్బతింది. ఫలితంగా విమర్శలు వెల్లువెత్తాయి. కొవిడ్ ప్రభావం థాయిలాండ్‌పై బాగానే పడింది.
టూరిజంపై ఆధారపడిన దాదాపు 3 మిలియన్ల మంది ఉద్యోగాలపై ప్రభావం చూపింది. అలాగే, ఏడాదికి 50 బిలియన్ల వరకు ఆదాయాన్ని కోల్పోయింది. దీంతో నష్టనివారణ చర్యలు ప్రారంభించిన ఆ దేశం జులైలో పైలట్ ప్రాజెక్టు కింద ఫుకెట్, సముయి ద్వీపాలను తిరిగి తెరిచింది.
నవంబరు 1 నుంచి రాజధాని బ్యాంకాక్‌తోపాటు ఇతర పర్యాటక ప్రదేశాలైన పట్టాయ, హౌ హిన్, క్రబి, చియాంగ్ మై వంటి ప్రాంతాలను తిరిగి తెరుస్తోంది. టీకాలు వేయించుకున్న 45 దేశాల ప్రజలు ఎలాంటి క్వారంటైన్ ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా దేశంలోకి రావొచ్చని తెలిపింది.
అయితే, దేశంలోకి రావడానికి ముందు, ఆ తర్వాత తప్పకుండా కొవిడ్ నెగటివ్ సర్టిఫికెట్ తప్పనిసరిగా అందించాలని, అలాగే కనీసం 50 వేల డాలర్ల కొవిడ్-19 ఇన్సూరెన్స్ ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. థాయిలాండ్ ప్రకటించిన 45 దేశాల్లో బ్రిటన్, అమెరికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జపాన్, మలేషియా, కాంబోడియా వంటివి ఉన్నాయి.