తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దసరా పండుగ, కోసం నడిపే ప్రత్యేక బస్సుల్లో కూడా అదనపు చార్జీలు వసూలు చేయబోమని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పష్టం చేశారు. దసరా పండుగకు వివిధ ప్రాంతాలకు నడుపుతున్న ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీల వసూలు చేయరాదని నిర్ణయం తీసుకుంది.
ఇదే అశంపై ఆయన మాట్లాడుతూ, ఈ బస్సుల్లో సాధారణ ఛార్జీలే వసూలు చేస్తామని, ఈ నిర్ణయం ఆదివారం నుంచే అమలవుతుందన్నారు. కొన్నేళ్లుగా పండగల ప్రత్యేక బస్సుల్లో ఆర్టీసీ 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల దసరా ప్రత్యేక బస్సుల ఏర్పాటు సమయంలోనూ 50 శాతం అదనంగా వసూలు చేయనున్నట్లు ప్రకటించారు.
అయితే కరోనా సమయంలో ప్రజలపై అదనపు భారం మోపకూడదని ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు సజ్జనార్ తెలిపారు. గత అయిదు రోజుల్లో కోటి 30 లక్షల మందిని వారి గమ్యస్థానాలకు చేర్చాం. ఆర్టీసీని ప్రజలు ఆదరిస్తున్నారనేందుకు ఇదే ఉదాహరణ. రానున్న పండగల రోజుల్లోనూ సాధారణ ఛార్జీలే వసూలు చేస్తాం. సురక్షిత ప్రయాణానికి ప్రజలు ఆర్టీసీనే ఎంచుకోవాలి అని సజ్జనార్ కోరారు.