స్నేహంతో ఉద్యోగమిస్తే మిత్రుడిని అత్యంత కిరాతకంగా చంపేసిన వ్యక్తికి నాంపల్లి కోర్టు జీవిత జైలుశిక్ష విధించింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, బాపట్ల జిల్లా మార్టూర్‌కు చెందిన మైల సతీష్‌బాబు (31) అమీర్‌పేటలోని ఐటీ స్లాట్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పనిచేస్తూ కేపీహెచ్‌బీ కాలనీ ఏడోఫేజ్ ఎంఐజీలో స్లాట్ సొల్యూషన్స్ పేరుతో శిక్షణ, మై సాఫ్ట్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేశాడు.
విజయనగరం కోరుకొండ సైనిక్ స్కూల్‌లో చదువుకున్న చిన్ననాటి స్నేహితుడు సికింద్రాబాద్‌లో ఉంటున్న ప.గో. జిల్లా భీమవరం బ్యాంకుకాలనీకి చెందిన ఎం.హేమంత్ అలియాస్ కన్నా (35) తనకు ఉద్యోగం కావాలని 2017లో సతీష్‌బాబును అడగడంతో ఇచ్చాడు. అంతేకాకుండా 2018లో తన కంపెనీలో భాగస్వామ్యం ఇచ్చాడు. వారి కంపెనీలో శిక్షణ పొందిన ఓ యువతి అక్కడే ఉద్యోగంలో చేరింది.
అప్పటికే పెళ్లయిన హేమంత్ ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కంపెనీ పక్కనే ఇల్లు అద్దెకు తీసుకొని సహజీవనం చేశాడు. గమనించిన సతీష్‌బాబు.. ఆమెను తిరిగి వసతి గృహానికి పంపాలని 2019 ఆగస్టు 27న స్నేహితుడిని హెచ్చరించాడు. తాను 28న ఫ్లాట్‌కు వస్తానని చెప్పడంతో హేమంత్ పగ పెంచుకున్నాడు.
ఎలాగైనా సతీష్‌బాబును హతమార్చాలని పథకం వేసిన నిందితుడు ముందుగానే పెద్ద సైజు పాలిథిన్ బ్యాగులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఆగస్టు 28న సతీష్‌బాబు స్నేహితుడి వద్దకు బీర్లు తీసుకొని వెళ్లాడు. సరదాగా మిత్రుడితో సతీష్‌బాబు మద్యం తాగారు. అతను మత్తులో ఉండగా.. అతని హేమంత్ సుత్తితో తలపై గట్టిగా కొట్టి హత్య చేశాడు.
మృతదేహాన్ని ముక్కలుగా చేసేందుకు ప్రయత్నించగా అది సాధ్యం కాక హేమంత్ మరుసటి రోజు బయటి నుంచి రంపం తీసుకొచ్చి ముక్కలు చేసేందుకు ప్రయత్నించాడు. కాలు కోసినా.. అప్పటికే మృతదేహం ఉబ్బడంతో తెగ లేదు. ఈ క్రమంలో ఏమీ తెలియనట్లు మృతుడి స్నేహితులు, భార్యతో కలిసి సతీష్‌బాబు ఆచూకీకి వెతకసాగాడు.
వారికి హేమంత్‌పై అనుమానం వచ్చి ఆగస్టు 30న ఉదయం హేమంత్ ఉన్న కేపీహెచ్‌బీకాలనీ ఏడోఫేజ్‌లోని ఫ్లాట్‌కు వెళ్లి కిటికీలో నుంచి చూడగా మృతదేహం కనిపించింది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అదే ఏడాది సెప్టెంబరు 5న లింగంపల్లి తారానగర్ రైల్వేస్టేషన్ సమీపంలో పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా.. అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు.