దేశీయ విమానయాన సంస్థ ఇండిగోలో సంక్షోభం తారాస్థాయికి చేరింది. ఈ విమాన సర్వీసులు రద్దు కావడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో కేంద్రం స్పందించింది. ప్రయాణికుల నుంచి వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో రంగంలోకి దిగిన కేంద్రం పౌర విమానయాన శాఖ, విమాన చార్జీలపై గరిష్ట ధరల పరిమితి విధిస్తూ శనివారం కీలక ఆదేశాలు జారీచేసింది. అదేసమయంలో విమాన చార్జీలను కూడా నిర్ణయించింది.
ఇండిగో సంక్షోభం నేపథ్యంలో ఇతర విమాన సంస్థలు ఇష్టారాజ్యంగా విమాన చార్జీలను పెంచేశాయి. సాధారణంగా రూ.5 వేలు నుంచి రూ.7 వేలు మధ్య ఉండే చార్జీని ఏకంగా రూ.లక్ష వరకు పెంచేశాయి. ఈ సంక్షోభ సమయంలో విమానయాన సంస్థలు అవకాశవాదంగా వ్యవహరించకుండా నిరోధించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది.
ఇందులోభాగంగా కొత్త నిబంధనల మేరకు ఎకానమీ క్లాస్ టిక్కెట్లకు దూరాన్ని బట్టి గరిష్ట ధరలను ప్రభుత్వం నిర్ణయించింది. 500 కిలోమీటర్ల వరకు ప్రయాణానికి గరిష్ట చార్జీ రూ.7500, 500 నుంచి 1000 కిలోమీటర్ల మధ్య రూ.12 వేలు, 1000 నుంచి 1500 కిలోమీటర్ల మధ్య రూ.15 వేలు, 15 వేల కిలోమీటర్లు దాటిన ప్రయాణికులకు గరిష్టంగా 18 వేలగా నిర్ణయించింది.