అక్రమంగా ఆస్తులు కూడబెట్టుకుని స్విట్జర్లాండ్ వంటి విదేశాల్లో దాచిపెట్టిన కోటీశ్వరులకు ఆదాయపన్ను శాఖ అధికారులు ఇకపై చక్కలు చూపించనున్నారు. వివిధ దేశాలతో భారత్ కుదుర్చుకున్న సమాచార మార్పిడి ఒప్పందం మేరకు ఆస్తులు కూడబెట్టుకుని విదేశాల్లో దాచుకున్న వారి జాబితాను తయారు చేస్తోంది.
ఇప్పటికే ఈ సమాచార మార్పిడి ఒప్పందం ఆధారంగా విదేశాల్లో లెక్కచూపని ఆస్తులు కలిగిన 24,678 మందితో కూడిన జాబితాను ఐటీ శాఖ సిద్ధం చేసింది. వీరికి విదేశాల్లో సుమారు రూ.29,208 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ ఆస్తులతో పాటు వీరు దాదాపు రూ.1,089.88 కోట్ల విదేశీ ఆదాయాన్ని కూడా తమ ఐటీ రిటర్న్‌లో చూపలేదని అధికారులు గుర్తించారు. విదేశాల నుంచి అందిన సమాచారాన్ని, 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫైల్ చేసిన రిటర్న్స్‌తో పోల్చి చూడటం ద్వారా ఈ బడాబాబుల గుట్టు రట్టయింది. ఈ జాబితాలో పలు ప్రముఖ కంపెనీలకు చెందిన ఉన్నతోద్యోగులు సైతం ఉండటం గమనార్హం.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబరు నెలాఖరులోగా సవరించిన ఐటీ రిటర్న్ దాఖలు చేయాలంటూ త్వరలోనే వీరందరికీ ఎస్ఎంఎస్‌లు, ఈమెయిళ్ల ద్వారా ఐటీ శాఖ హెచ్చరికలు జారీ చేయనుంది. గడువులోగా స్పందించని వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అప్పటికీ స్పందించకపోతే భారీ అపరాధంతో విధించే అవకాశం ఉంది.