దేశ వ్యాప్తంగా ఇండిగో విమానయాన సంస్థకు చెందిన సర్వీసుల్లో అంతరాయం ఏర్పడుతోంది. ఇప్పటికే వందల సంఖ్యలో విమానాలు రద్దు అయ్యాయి. అయితే, ఈ పరిస్థితిని సాధారణ స్థితికి తెచ్చేందుకు ముమ్మరంగా చర్యలు సాగుతున్నాయి.
ఈ నేపథ్యంలో శనివారం రద్దయిన సర్వీసుల సంఖ్య 850 కంటే దిగువకు చేరినట్లు ఇండిగో సంస్థ తెలిపింది. శుక్రవారంతో పోలిస్తే ఈ సంఖ్య గణనీయంగా తగ్గినట్లు పేర్కొంది. వచ్చే కొన్ని రోజుల్లో దీన్ని మరింత తగ్గిస్తామని తెలిపింది. దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టుల్లో ఇంకా గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో శనివారం ఇండిగో ఓ ప్రకటన విడుదల చేసింది.
కస్టమర్లకు వేగంగా రీఫండ్‌లు అందించడంపై దృష్టి సారించినట్లు ఇండిగో తెలిపింది. ప్రయాణికులకు ఫ్లైట్ షెడ్యూల్ వివరాలను తెలియజేసేందుకు ఎయిర్‌పోర్టులు, భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నట్లు పేర్కొంది. వెబ్‌సైట్లు, డైరెక్ట్ నోటిఫికేషన్ల ద్వారా కూడా సమాచారం ఇస్తున్నట్లు వెల్లడించింది.
అయితే, ఎయిర్‌పోర్టుకు వచ్చే ముందు ఫ్లైట్ స్టేటస్, టైమింగ్స్ తెలుసుకోవడానికి సంస్థ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. అలాగే రీఫండ్ కోసమూ ప్రత్యేక వెబ్‌సైట్ ఉన్నట్లు గుర్తు చేసింది. కస్టమర్ సపోర్ట్‌ను కూడా సంప్రదించొచ్చని సూచించింది.
అసౌకర్యానికి గురవుతున్న కస్టమర్లందరికీ ఇండిగో మరోసారి క్షమాపణలు చెప్పింది. వీలైనంత వేగంగా సాధారణ కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నామని తెలిపింది. అందుకోసం కృషి చేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేసింది.