ప్రస్తుతం ఆరోగ్య బీమా, వాహనాల బీమా, ప్రాపర్టీ బీమా, జీవిత బీమా వంటి ఇన్సూరెన్స్‌ల పేర్లు వినివుంటాం. ఇపుడు కొత్తగా మ్యారేజ్ ఇన్సూరెన్స్ కూడా అందుబాటులోకి వచ్చింది. దీనికి కారణం ఇపుడు పెళ్లి ఖర్చులు విపరీతంగా పెరిగిపోవడంతో పాటు ఇది ఒక స్టేటస్ సింబల్‌గా మారిపోయిది. గతంలో వివాహం అంటే రెండు వేర్వేరు జీవితాలు, కుటుంబాలు ఒక్కటయ్యే సంప్రదాయం. కానీ, ఇపుడు ఆ పెళ్లి నిర్వచనమే మారిపోయింది. పెళ్లి అనే సంప్రదాయాన్ని ఘనంగా గొప్పగా చేయాలనే ముసుగులో దాన్ని ఓ స్టేటస్ సింబల్‌గా మార్చేశారు.
మధ్య కుటుంబాల నుంచి ధనవంతుల కుటుంబాల వరకు పెళ్లిని ఎంత గ్రాండ్‌గా వీలైతే అంత అట్టహాసంగా చేయాలని భావిస్తున్నారు. అందుకోసం డబ్బును మంచినీళ్ల ప్రాయంలా ఖర్చు చేస్తున్నారు. కొందరు అప్పు చేసైనా సరే గొప్పగా చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. కేవలం ఒక్క పెళ్లి మాత్రమే కాదు.. హల్దీ వేడుక, సంగీత్, మెహందీ, పెళ్లి రిసెప్షన్ ఇలా ప్రతిదీ గ్రాండ్‌గా చేసేందుకు ఉవ్విళ్ళూరుతున్నారు.
ఇంత చేసినా కొన్ని వివాహాలు అనుకోకుండా, అకారణంగా, చిన్నపాటి మనస్పర్థలకే ఆగిపోతున్నాయి. ఫలితంగా కోట్ల రూపాయలు బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అందుకే ఇపుడు వెడ్డింగ్ ఇన్సూరెన్స్ అందుబాటులోకి వచ్చింది. పెళ్లికి ఖర్చు చేస్తున్న బడ్జెట్‌ను బట్టి బీమా తీసుకుంటున్నారు. ఏదేని కారణంతో పెళ్ళి వాయిదాపడినా, రద్దు అయినా అంతవరకు ఖర్చు చేసిన మొత్తం బీమా కంపెనీ తిరిగి ఇస్తుందన్నమాట.
అలాగే, కుటుంబంలో ఎవరైన మరణించినా వివాహం వాయిదా పడొచ్చు. లేదా ప్రకృతి వైపరీత్యాలు సంభవించి పెళ్లి ఆగిపోవచ్చు. ఇలా కారణం ఏదైనా పెళ్లి ఖర్చులో ఇంకాస్త ఇన్సూరెన్స్ కోసం వెచ్చిస్తే అనుకోని పరిస్థితుల్లో అటుఇటూ అయినా డబ్బు సేఫ్ అని చాలా మంది ఆలోచిస్తున్నారు. సమీప భవిష్యత్‌లో ఈ వెడ్డింగ్ ఇన్సూరెన్స్ మరింత పాపులర్ అయ్యేలా కనిపిస్తోంది.