Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరంగల్: ట్రాన్స్‌జెండర్ల కోసం ప్రత్యేక క్లినిక్ ఎందుకు తెరిచారు, ఇది ఎలా నడుస్తోంది?

Webdunia
శనివారం, 3 సెప్టెంబరు 2022 (09:02 IST)
‘‘మా శరీర నిర్మాణంతోపాటు మేం ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలపై చాలామంది డాక్టర్లకు అవగాహన ఉండటం లేదు. దీంతో సరైన చికిత్సలు మాకు అందటం లేదు. మాగురించి వైద్య శాస్త్రంలో ప్రత్యేక సబ్జెక్ట్ ఉండాలని కోరుకుంటున్నాం’’ ఇవి వరంగల్‌కు చెందిన రిమిషా మాటలు. రిమిషా ఒక ట్రాన్స్‌వుమన్. పాలిటెక్నిక్ మెకానికల్ ఇంజినీరింగ్ డిప్లమాను కొన్ని కారణాలతో ఆమె మధ్యలోనే ఆపేశారు. దేశ వ్యాప్తంగా ట్రాన్స్‌జెండర్లు, హిజ్రాలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సేవల సమస్యకు రిమిషా మాటలు అద్దంపడుతున్నాయి.

 
ఇటీవల ట్రాన్స్‌జెండర్లకు ప్రత్యేక వైద్యం అందించేందుకు వరంగల్ మహాత్మాగాంధీ మెమోరియల్ హాస్పిటల్(ఎంజీఎం)లో ప్రత్యేక క్లినిక్ ప్రారంభించారు. ప్రతి మంగళవారం ఈ క్లినిక్‌లో వారికి అవుట్ పేషెంట్(ఓపీ) సేవలు అందిస్తున్నారు. ఎండోక్రైనాలజీ, చర్మవ్యాధులు, మానసిక సమస్యలు, యూరాలజీ, జనరల్ సర్జరీ లాంటి కొన్ని విభాగాల్లో ప్రస్తుతం ఇక్కడ అవుట్ పేషెంట్ వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. తమ శరీరంలో వేరే జెండర్ లక్షణాలతో ఇమడలేక ట్రాన్స్‌జెండర్లు ఇబ్బంది పడుతుంటారు. వీరిలో కొందరు మాత్రం మరో అడుగు ముందుకువేసి లింగ మార్పిడి చికిత్సలు చేయించుకుంటారు. దీన్ని ఒక ఆరోగ్య సమస్యగా చూడాలని వైద్య నిపుణులు అంటున్నారు.

 
మన దేశంలో సెక్స్ రీఅసైన్మెంట్ సర్జరీ (లింగ మార్పిడి చికిత్స)కు సంబంధించిన మార్గదర్శకాలు స్పష్టంగా లేవు. ఈ తరహా వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రుల సంఖ్య తక్కువ. ముంబయి, పూణే లాంటి కొన్ని నగరాల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ చికిత్సలు ఎక్కువగా నిర్వహిస్తుంటారు. అయితే, మార్గదర్శకాల్లో మాత్రం ఏకరూపకత లేదు. ‘‘ట్రాన్స్‌జెండర్ల ఆరోగ్యానికి ప్రత్యేక విభాగం అంటూ మనకు ఎక్కడా కనిపించదు. అయితే మేం వారి కోసం ఎంజీఎంలో మల్టీ స్పెషాలిటీ సేవలతో క్లినిక్‌ను ప్రారంభించాం. భవిష్యత్తులో ఇది ఓ ప్రత్యేక విభాగంగా మారే అవకాశం ఉంది’’అని ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ బీబీసీతో అన్నారు.

 
ఎంత మంది ఉన్నారు?
దశాబ్దం క్రితం వరకు మన దేశంలో థర్డ్‌ జెండర్ జనాభాపై అధికారిక సమాచారం, శాస్త్రీయ లెక్కలు ఏవీ లేవు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా వీరి సంఖ్య సుమారు 4.88 లక్షలుగా తేలింది. వీరిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 43,769 మంది ఉన్నారు. సమగ్ర కుటుంబ సర్వే-2014 ప్రకారం తెలంగాణలో వీరి సంఖ్య దాదాపు 60 వేలు. గతంలో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ చేపట్టిన సర్వేలో తెలంగాణలో వీరి జనాభా సుమారు 90 వేలు ఉందని అంచనా వేశారు. వాస్తవానికి ఈ సంఖ్య ఇంకా ఎక్కువగా ఉండొచ్చని సామాజిక నిపుణులు అంటున్నారు. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక కారణాలతోపాటు వివక్ష ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతో చాలా మంది బయటకు రాలేకపోతున్నారని ట్రాన్స్‌జెండర్ సంఘాలు చెబుతున్నాయి.

 
ప్రత్యేకమైన ఆరోగ్య పరిస్థితులు ఉండేవారిగా తమను గుర్తించాలని ఎప్పటినుంచో ట్రాన్స్‌జెండర్లు కోరుతున్నారు. విద్య, వైద్యం, సంక్షేమం, ఉద్యోగ రంగాల్లో వివిక్ష లేకుండా చూడాలని వారు అభ్యర్థిస్తున్నారు. ట్రాన్స్‌జెండర్ల సమస్యల పరిష్కారం దిశగా తమిళనాడు ఎప్పటినుంచో దృష్టి పెడుతోంది. 2008లో ‘‘తమిళనాడు ఆర్వానిగల్ (ట్రాన్స్‌జెండర్) వెల్ఫేర్ బోర్డును ఏర్పాటుచేశారు. సామాజిక భద్రత, ఉపాధి, విద్య, వైద్యం, ఉద్యోగ రంగాల్లో వీరి కోసం ప్రత్యేక పథకాలను తీసుకొచ్చారు. రాష్ట్రంలో కొన్ని ఆసుపత్రుల్లో లింగ మార్పిడి శస్త్ర చికిత్సలు కూడా నిర్వహిస్తున్నారు. 40 ఏళ్లు పైబడ్డ వారికి పింఛను సౌకర్యం, స్వయం ఉపాధికి అవసరమయ్యే ఆర్థిక సాయం కూడా అందిస్తున్నారు. దేశంలో తొలిసారి పోలీస్ శాఖలో ట్రాన్స్‌జెండర్‌కు ఎస్సైగా తమిళనాడు అవకాశమిచ్చింది.

 
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోను ట్రాన్స్‌జెండర్ల సంక్షేమం కోసం ప్రయత్నాలు జరిగాయి. ప్రస్తుతం వారికి పింఛన్లు ఇస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ట్రాన్స్‌జెండర్స్ వెల్ఫేర్ బోర్డ్ కూడా ఏర్పాటుచేశారు. గృహకల్పన, వైద్య సేవలు, భద్రత, స్కాలర్‌షిప్‌లు, నైపుణ్యాలపై శిక్షణ తదితర సదుపాయాల కల్పన కోసం స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు వికలాంగ, ట్రాన్స్‌జెండర్స్, సీనియర్ సిటిజన్స్ విభాగం నుంచి కొన్ని ప్రతిపాదలు కూడా వెళ్లాయి.

 
నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ(నాల్సా)తో పాటు కొంతమంది ఉద్యమకారులు, ట్రాన్స్‌జెండర్లు వేసిన రిట్ పిటిషన్‌పై 2014లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ట్రాన్స్‌జెండర్ల హక్కుల గుర్తింపులో ఒక మైలురాయిగా భావిస్తారు. రాజ్యాంగం కల్పించిన అన్ని ప్రాథమిక హక్కులు ట్రాన్స్‌జెండర్లకు వర్తిస్తాయని కోర్టు స్పష్టంచేసింది. వివిక్షను రూపుమాపే అన్ని చర్యలను తీసుకోవాలని ప్రభుత్వాలకు కోర్టు సూచించింది. ట్రాన్స్‌జెండర్ల కోసం ‘థర్డ్ జెండర్’ పేరుతో కొత్త కేటగిరీని చేర్చాలని కోర్టు తెలిపింది.

 
ఆ తర్వాత ‘ట్రాన్స్‌జెండర్ పర్సన్స్(ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్) యాక్ట్-2019ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ ట్రాన్స్‌జెండర్ పర్సన్స్’ చైర్మన్‌గా కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి కొనసాగుతారు. ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు సర్టిఫికేట్లు జారీ, స్వయం ఉపాధి కల్పన, లింగ మార్పిడి శస్త్ర చికిత్సల నిర్వహణ, వారి ఆరోగ్య సమస్యలపై పరిశోధనలు, వైద్య విద్య పాఠ్యాంశాల సమీక్షల కోసం చర్యలు తీసుకోవాలని ఈ చట్టంలో నిబంధనలు ఉన్నాయి. వీటికి అనుగుణంగా ఆయా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని చట్టం సూచించింది.

 
‘‘ప్రాణాలు పోతున్నాయి..’’
అనుభవం, అర్హత లేని వైద్యుల చేతుల్లో లింగ మార్పిడి సర్జరీలు చేయించుకొని ట్రాన్స్‌జెండర్లు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇలాంటి కేసులు అంతగా బయటకు రావు. ప్రస్తుతం వరంగల్ ఎంజీఎం ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌లో సాధారణ సేవలతోపాటు హార్మోన్ థెరపీ, బ్రెస్ట్ ఆగ్యుమెంటేషన్, లేజర్ ట్రీట్మెంట్‌లను కూడా అందించాలని ట్రాన్స్‌జెండర్లు కోరుతున్నారు. 

 
“లింగ మార్పిడి చికిత్సలకు ఇక్కడ అవకాశం లేకపోవడంతో ముంబయి, దిల్లీ, పూణేలకు చాలా మంది వెళ్తున్నారు. ఈ చికిత్సల కోసం లక్షల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. ఈ డబ్బు కోసం చాలా మంది భిక్షాటన, సెక్స్ వర్క్ చేస్తున్నారు. అర్హత, నైపుణ్యంలేని డాక్టర్లతో ఆపరేషన్లు చేసుకోవడంతో కొంతమందికి సైడ్‌ఎఫెక్ట్‌లు కూడా వస్తున్నాయి. మరికొంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రభుత్వమే ఈ సర్జరీలు ఉచితంగా చేస్తే భిక్షాటన చేయాల్సిన అవసరం ఉండదు’’అని తెలంగాణ ట్రాన్స్‌జెండర్ల సంఘానికి చెందిన ట్రాన్స్‌వుమెన్ ‘ఓరుగంటి లైలా’ బీబీసీతో అన్నారు. మరోవైపు సర్జరీల్లో తప్పులు జరిగినా అడిగేవారే లేకుండా పోతున్నారని హైదరాబాద్‌కు చెందిన తెలంగాణ హిజ్రా, ఇంటర్‌సెక్స్ ట్రాన్స్‌జెండర్ సమితి ఉద్యమకారిణి వైజయంతి వాసంతి మొగిలి అన్నారు.

 
క్రమంగా సేవలు విస్తరిస్తాం..
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ట్రాన్స్‌జెండర్ క్లినిక్‌లో సేవలను క్రమంగా విస్తరిస్తామని సూపరింటెంటెండ్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ‘‘ప్రస్తుతం నిర్వహిస్తున్న సేవల ఆధారంగా డేటా సేకరిస్తున్నాం. ఈ సమాచారం ఆధారంగా భవిష్యత్‌లో మరిన్ని సేవలను అందించేందుకు ప్రయత్నిస్తాం. మరోవైపు మరిన్ని ఆపరేషన్ థియేటర్లు, పరికరాల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యర్థనలు పంపుతాం’’అని ఆయన వివరించారు. ‘‘లింగ మార్పిడి, బ్రెస్ట్ ఆగ్యుమెంటేషన్ సర్జరీలను కాస్మెటిక్ సర్జరీల కోణంలో చూడడం దురదృష్టకరం. ఇవి ట్రాన్స్‌జెండర్ల ఆరోగ్యంపై చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. అందుకే ఈ చికిత్సలు వారి ఆరోగ్యానికి అత్యవసరంగా భావించాలి. వీటిని ఆరోగ్య సమస్యలుగా గుర్తించాలి’’అని ఆయన వివరించారు.

 
ట్రాన్స్‌జెండర్లకు అవసరమయ్యే వైద్య సేవల కోసం జాతీయ ఆరోగ్య అథారిటీతో ఇటీవల కేంద్ర సామాజిక న్యాయ శాఖ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు ట్రాన్స్‌జెండర్ గుర్తింపు సర్టిఫికేట్ ఉన్న వారికి జన్ ఆరోగ్య యోజన కింద లింగ మార్పిడి చికిత్సతోపాటు ఉచిత ఆరోగ్య సేవలను అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ‘రాష్ట్ర ట్రాన్స్‌జెండర్ వెల్ఫేర్ బోర్డ్’ను ఏర్పాటు చేస్తూ.. ఆగస్టు 19న జీవో 21ను విడుదల చేసింది. ఇటీవల ఆ బోర్డ్ సభ్యులు తెలంగాణ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా టీ-హబ్ మాదిరిగా ట్రాన్స్‌జెండర్స్ హబ్(టీజీ-హబ్) ఏర్పాటు చేయాలని కోరారు. షెల్టర్ హోమ్స్, ఉచిత లింగ మార్పిడి చికిత్సలు లాంటి అంశాలను ట్రాన్స్‌జెండర్లు ప్రస్తావించారు.

 
“ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్ల సంక్షేమంపై దృష్టి సారించింది. గతంలో అనేక ట్రాన్స్‌జెండర్ సంఘాలు ఉన్నా.. వాటి మధ్య సమన్వయం లేదు. అందుకే ప్రత్యేక సంక్షేమ బోర్డ్ ఏర్పాటు చేసి రూ.2 కోట్లు కేటాయించాం. రాబోయే రోజుల్లో కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచిత లింగ మార్పిడి చికిత్సలు అందిస్తాం. పునరావాస కేంద్రాలను ఏర్పాటుచేసే ఆలోచనలో ఉన్నాం. స్వయం ఉపాధి కోసం ఆర్థిక సహాయం, వృత్తి నైపుణ్య శిక్షణ అందిస్తాం’’ అని తెలంగాణ ట్రాన్స్‌జెండర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ కొప్పుల ఈశ్వర్ బీబీసీతో అన్నారు.

 
సమాన అవకాశాలు కల్పించండి
గతంతో పోలిస్తే హిజ్రాలు, ట్రాన్స్‌జెండర్ల పట్ల కొంతమార్పు వచ్చిందని తెలంగాణ ట్రాన్స్‌జెండర్ వెల్ఫేర్ బోర్డ్ సభ్యురాలు ఓరుగంటి లైలా అన్నారు. “అయితే ఆ మార్పును సానుభూతి కిందే చూడాలి. కానీ, మాకు సమానత్వం కావాలి. ట్రాన్స్‌జెండర్ అని తెలియగానే సొంత కుటుంబాలే దూరం పెడుతున్నాయి. తల్లిదండ్రులు దీన్ని ఒక హార్మోన్ సమస్యగా అర్థంచేసుకునని మమ్మల్ని ఆదరించాలి. అప్పుడే మాలో చాలా మందికి మంచి చదువు దొరుకుతుంది. పోటీ పరీక్షల్లో కూడా మాకు సమాన అవకాశాలు కల్పించాలి. దరఖాస్తు ఫామ్‌లలో అసలు థర్డ్ జెండర్ కేటగిరీనే ఉండటం లేదు’’ అని ఆమె అన్నారు.

 
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై నియామక పరీక్షల్లో థర్డ్ జెండర్ కేటగిరీ లేదు. దీంతో పదుల సంఖ్యలో ట్రాన్స్‌జెండర్లు పురుషుల కేటగిరీలో పోటీ పడ్డారు. తెలంగాణలో ట్రాన్స్‌జెండర్స్ వెల్ఫేర్ బోర్డ్ ఏర్పాటును వారు స్వాగతిస్తున్నారు. గతంలో తమ హక్కుల కోసం ప్రభుత్వం, అధికారులతో పోరాడాల్సి వచ్చిందని, బోర్డ్ ఏర్పాటుతో నేరుగా తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి వెళ్తాయని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏఆర్ రెహ్మాన్ ప్రపంచంలోనే అత్యుత్తమైన వ్యక్తి : సైరా బాను

'పుష్ప-2' మేకర్స్ నిర్ణయంపై దేవిశ్రీ ప్రసాద్ అసహనం.. !! (Video)

ట్రెండింగ్‌లో కిస్సిక్ - డిసెంబరు 5న "పుష్ప-2" రిలీజ్

వాస్తవ సంఘటనలకు అద్దం పట్టే మిస్టర్ మాణిక్యం గా సముద్రఖని

సింగర్ మంగ్లీకి ఉస్తాద్‌ బిస్మిల్లా ఖాన్‌ పురస్కారం ప్రదానం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం