Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

క్యాన్సర్ చిన్న వయసులో కూడా ఎందుకు వస్తోంది? యువతలో సాధారణంగా కనిపిస్తున్న క్యాన్సర్లు ఏవి?

Breast cancer symptoms
, గురువారం, 25 ఆగస్టు 2022 (20:46 IST)
ఈ మధ్యకాలంలో 40 ఏళ్ల లోపువారికి క్యాన్సర్ సోకిన కథలు ఎన్నో వింటున్నాం. క్యాన్సరుకు చికిత్స చాలా కఠినంగా ఉంటుంది. సర్జరీకి ముందు, తరువాత కూడా చాలా నొప్పులు భరించాల్సి ఉంటుంది.

 
ఎందుకు చిన్నవయసులోనే క్యాన్సర్ వస్తోంది?
సాధారణంగా 60 ఏళ్లు పైబడిన వారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. కానీ, 15 నుంచి 39 ఏళ్ల వారికి కూడా క్యాన్సర్ కణాలు అభివృద్ధి చెందే ప్రమాదం అధికంగానే ఉందంటున్నారు నిపుణులు. నిజానికి, ఇది "వృద్ధులకు వచ్చే రోగం" అనుకోవడం వల్ల, క్యాన్సర్‌ను గుర్తించడంలో ఆలస్యం జరగవచ్చు. తరువాతి పరిణామాలు చాలా బాధాకరంగా ఉంటాయి. "యువతలో క్యాన్సర్ పట్ల అవగాహన చాలా తక్కువ" అని బ్రిటన్‌లోని అడాల్సెంట్ అండ్ యంగ్ అడల్ట్ ఆంకాలజీ యూనిట్ హెడ్ డేనియల్ స్టార్క్ హెచ్చరించారు. ఇంతకీ, యువతకు వచ్చే కామన్ క్యాన్సర్ రకాలేంటి? వాటిని ఎలా నివారించవచ్చు?

 
యువతలో అత్యంత సాధారణంగా కనిపించే క్యాన్సర్ రకాలు
సాధారణంగా, 15 నుంచి 39 ఏళ్ల లోపు వారికి ఈ కింది క్యాన్సర్ రకాలు సోకే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
 
బ్రెయిన్ ట్యూమర్
రొమ్ము క్యాన్సర్
గర్భాశయ (సర్వైకల్) క్యాన్సర్
కార్సినోమా: ముఖ్యంగా జీర్ణవ్యవస్థలో
జననేంద్రియాలలో క్యాన్సర్ (వృషణాలు, అండాశయాలు)
థైరాయిడ్ క్యాన్సర్
లింఫోమా

 
సాధారణంగా 15 నుంచి 39 వయసు మధ్య శరీరంలో అనేక ముఖ్యమైన మార్పులు చోటుచేసుకుంటాయి. కాబట్టి, క్యాన్సర్ సోకే ప్రమాదమూ ఎక్కువేనని నిపుణులు అంటున్నారు. అయితే వయసు బట్టి క్యాన్సర్ వచ్చే అవకాశాలు భిన్నంగా ఉంటాయి. "ఉదాహరణకు, 20 నుంచి 29 లోపు వారికి కార్సినోమా ఎక్కువగా వస్తుంది. యుక్తవయస్కుల్లో లుకేమియా, లింఫోమా, నాడీ వ్యవస్థలో క్యాన్సర్లు, సార్కోమా, జననేంద్రియాల్లో కణితులు సర్వసాధారణం" అని ఇటలీలోని నేషనల్ ట్యూమర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిలాన్‌లో స్పెషలిస్ట్ డాక్టర్ అనాలిసా ట్రామా చెప్పారు. అలాగే, జెండర్ బట్టి క్యాన్సర్ రకాలు, అవి సోకే అవకాశాలు మారుతూ ఉంటాయి. మహిళలకు ఎక్కువగా రొమ్ము, థైరాయిడ్, గర్భాశయ, అండాశయ క్యాన్సర్లు సోకుతాయి. "పురుషుల్లో సర్వసధారణమైన క్యాన్సర్లు.. లింఫోమా, టెస్టిక్యులర్ క్యాన్సర్, లుకేమియా, థైరాయిడ్" అని డాక్టర్ ట్రామా చెప్పారు. యువతల్లో ఎక్కువగా కనిపించే క్యాన్సర్ లుకేమియా. "8-10 ఏళ్లు దాటిన తరువాత లుకేమియా వచ్చే అవకాశాలు పెరుగుతుంటాయి" అని స్టార్క్ చెప్పారు.

 
అత్యంత ప్రమాదకరమైన క్యాన్సర్లు ఏవి?
బ్రెయిన్ ట్యూమర్, కార్సినోమా ముఖ్యంగా జీర్ణవ్యవస్థలో వచ్చేవి అత్యంత ప్రమాదకరమని ప్రొఫెసర్ స్టార్క్ వివరించారు. "బ్రెయిన్ ట్యూమర్ వస్తే చాలా కష్టం. దానికి చికిత్స, తరువాత కోలుకునే అవకాశాలు చాలా తక్కువ" అని ఆయన చెప్పారు. మైకం కమ్మడం, కడుపులో వికారం, జ్ఞాపకశక్తి సమస్యలు, ప్రవర్తనలో మార్పులు, బలహీనత, శరీరంలో కొన్ని భాగాలకు పక్షవాతం, దృష్టి లోపం.. ఇవన్నీ ఈ క్యాన్సర్ లక్షణాలు. జీర్ణవ్యవస్థలో కణితుల విషయంలో ఎదురయ్యే సవాలు ఏమిటంటే, ఇది వైద్యరంగంలో ఇంకా అభివృద్ధి చెందుతున్న అంశం. "గత 10-15 సంవత్సరాలలో యువతలో కార్సినోమా కేసులు పెరగడం గమనిస్తున్నాం. ఇది చాలా అరుదుగా సోకే వ్యాధి. కానీ, ఇప్పుడు సాధారణమైపోతోంది" అని ప్రొఫెసర్ స్టార్క్ అన్నారు.

 
అమెరికన్ క్యాన్సర్ సొసైటీ ప్రకారం, జీర్ణవ్యవస్థలో క్యాన్సర్‌ సోకితే.. ఆకలి లేకపోవడం, అనూహ్యంగా బరువు తగ్గడం, కడుపు నొప్పి, అసౌకర్యం, తేలికపాటి ఆహారం తీసుకున్నా కడుపు ఉబ్బినట్టు అనిపించడం, గుండెల్లో మంట, వికారం, వాంతులు, పొత్తికడుపు వాపు, మలంలో రక్తం, రక్తహీనత వంటి లక్షణాలు కనిపించవచ్చు. అయితే, ఇతర క్యాన్సర్లలో కూడా ఈ లక్షణాలు కనిపిస్తాయని, ఎలాంటి క్యాన్సర్ సోకిందన్నది డాక్టర్లు పరీక్ష చేసి నిర్థారిస్తారని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ తెలిపింది.

 
యౌవనంలో క్యాన్సర్ ఎందుకు సవాలుగా మారుతోంది?
యువతలో రోగాన్ని గుర్తించడంలో, చికిత్స అందించడంలో సవాళ్లు ఎదురవుతాయని నిపుణులు చెబుతున్నారు. "యువతలో ట్యూమర్ బయోలజీ ప్రత్యేకంగా ఉంటుంది. ఇది చిన్నపిల్లలు, వృద్ధుల కన్నా వేరుగా ఉంటుంది. అలాగే, ఫార్మకాలజీ కూడా భిన్నంగా ఉంటుంది. అందుకే చికిత్స ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో చెప్పలేం" అని డాక్టర్ ట్రామా వివరించారు. దీనికి తోడు యువతలో క్యాన్సర్‌పై సరైన అవగాహన లేకపోవడం సమస్యను మరింత జటిలం చేస్తుంది.

 
ఇటీవల కాలం వరకు, క్యాన్సర్ రిసెర్చ్ చిన్నపిల్లలో ట్యూమర్ లేదా వృద్ధుల్లో ట్యూమర్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టిందని, అందుకే ఇలాంటి వ్యాధుల క్లినికల్ ట్రయిల్స్‌లో యువత పాల్గొన్నది తక్కువ కాబట్టి, వాళ్లకు అవగాహన కూడా తక్కువగా ఉన్నదని హామిల్టన్‌లోని మెక్‌మాస్టర్ యూనివర్సిటీలో పీడియాట్రిక్స్ ఎమెరిటస్ రోనాల్డ్ బార్ అన్నారు. "సాధారణంగా 65 ఏళ్లు దాటినవారికే క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. 40 కన్నా తక్కువవారికి క్యాన్సర్ సోకితే అంకలజిస్టులకు చికిత్స విషయంలో సవాళ్లు ఎదురవుతాయి. వారు పిల్లలూ కాదు, వృద్ధులూ కాదు. మధ్య వయస్కులకు చికిత్స చేయడం అంటే సవాలే" అంటున్నారు ప్రొఫెసర్ బార్.
అయితే, ఈ మధ్యకాలంలో ఈ సమస్యను పరిష్కరించడంపై దృష్టి పెడుతున్నప్పటికీ, ఇంకా చేయవల్సినది చాలా ఉందని నిపుణులు అంటున్నారు.

 
సరైన చికిత్స కనుగొనడం అతిపెద్ద సవాలు
యువతలో క్యాన్సర్‌కు ఓవర్‌డయాగ్నోసిస్, అండర్‌డయాగ్నోసిస్ కాకుండా సరైన చికిత్స అందించడం వైద్యపరంగా అతిపెద్ద సవాలు. మరోవైపు, అసలు ఏ రకమైన డయాగ్నోసిస్ జరగని యువత సంఖ్య కూడా తక్కువేం కాదు. "వారిలో చాలామంది తక్కువ లేదా మధ్య ఆదాయ దేశాలకు చెందినవారు. సౌత్ అమెరికా, ఆఫ్రికా, ఆగ్నేయ ఆసియా మొదలైన ప్రాంతాలకు చెందినవారు. దురదృష్టవశాత్తు ఈ ప్రాంతాల్లోనే జనాభా ఎక్కువ. ఇక్కడ నివసించేవారిలో చాలామంది రోగులు అసలు ఆస్పత్రికే వెళ్లరు. లేదా రోగం బాగా ముదిరిపోయాక వెళతారు" అని బార్ అన్నారు. ఇలాంటి కారణాల వల్లే యువతలో క్యాన్సర్‌కు సంబంధించిన డాటాను పటిష్టపరచడం కష్టమవుతోందని నిపుణులు అంటున్నారు.

 
అయితే, ఓవర్‌డయాగ్నోసిస్ చేయడం మరో రకమైన సవాలుగా నిలుస్తోంది. ముఖ్యంగా థైరాయిడ్ క్యాన్సర్‌తో ఈ సమస్య వస్తోంది. అమెరికా లాంటి దేశాల్లో థైరాయిడ్ క్యాన్సర్‌ను అల్ట్రా సౌండ్ టెస్టులతో నిర్థారిస్తున్నారు. చాలా కేసుల్లో ఈ టెస్టులను అంతగా అనుభవం లేని డాక్టర్లు నిర్వహిస్తున్నారని, వాటి అవసరం లేకపోయినా పరీక్షలు చేస్తున్నారని ప్రొఫెసర్ స్టార్క్ అన్నారు. అలాంటప్పుడు, నిజంగా రోగం లేకపోయినా, ఉన్నట్టు ఈ పరీక్షల్లో బయటపడవచ్చు. దానివల్ల మరో రకమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆయన అన్నారు. "కొన్నిసార్లు క్యాన్సర్ కణితులు పెరిగినా, వాటి వల్ల ప్రమాదం ఉండకపోవచ్చు. ఓవర్‌డయాగ్నోసిస్ వల్ల వీటికి అనవసరంగా చికిత్స అందిస్తారు" అని స్టార్క్ వివరించారు. దీనివల్ల వారి శరీరం అనవసరమైన రేడియేషన్‌కు గురవుతుంది. పెద్ద ఆపరేషన్ లేదా భారీ మోతాదులో మందులు వాడుతారు.

 
యువతలో క్యాన్సర్‌ను నివారించవచ్చా?
అనారోగ్యకరమైన జీవనశైలి, ఊబకాయం వలన కొన్ని రకాల క్యాన్సర్లు వస్తున్నాయని డాక్టర్ ట్రామా తెలిపారు. జీర్ణవ్యవస్థలో కార్సినోమా, థైరాయిడ్, గర్భాశయ క్యాన్సర్లు అందుకు ఉదాహరణ. వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫోరమ్ (డబ్ల్యూసీఆర్ఎఫ్) సిఫార్సులను పాటిస్తే ఈ క్యాన్సర్లను నివారించవచ్చు.

 
అవేంటంటే..
సరైన బరువు కలిగి ఉండడం
శారీరకంగా చురుకుగా ఉండడం
ఆహారంలో సమతుల్యం.. వివిధ రకాల తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు, గింజలు చిక్కుళ్ళు సమృద్ధిగా తీసుకోవడం
అధిక కేలరీల ఆహారాన్ని మానేయడం
రెడ్ మీట్ లేదా ప్రాసెస్ చేసిన మాంసాలను తక్కువగా తీసుకోవడం
ఆల్కాహాల్, చక్కెర అధికంగా ఉండే పానీయాలు తగ్గించడం
వీటితో పాటు, క్యాన్సర్ గురించి మరింత అవగాహన పెంచుకోవడం అవసరమని ప్రొఫెసర్ స్టార్క్ అన్నారు.
 
"క్యాన్సర్ లక్షణాలేమిటో యువత తెలుసుకోవాలి. ముందు, యువతకు కూడా క్యాన్సర్ వస్తుందన్న విషయాన్ని గ్రహించాలి. అలాగే, ఈ వయసు వారిలో క్యాన్సర్‌కు చికిత్స అందించే డాక్టర్లు పెరగాలి" అని స్టార్క్ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విమానంలో మహిళకు పురిటినొప్పులు.. నవజాత శిశువు..?