Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

‘రెచ్చగొట్టే' దుస్తులు ధరించే మహిళలకు 'లైంగిక వేధింపుల' సెక్షన్ వర్తించదు: కేరళ కోర్టు

court
, గురువారం, 18 ఆగస్టు 2022 (20:39 IST)
కేరళకు చెందిన సామాజిక కార్యకర్త, రచయిత ‘సివిక్ చంద్రన్’(సీవీ కుట్టన్) తనను లైంగిక వేధించారంటూ ఓ మహిళ కేసు పెట్టారు. ఈ కేసులో సమర్పించిన ప్రాథమిక ఆధారాలు చంద్రన్‌కు వ్యతిరేకంగా లేవని కేరళ సెషన్స్ కోర్టు పేర్కొంది. బాధితురాలు ధరించిన దుస్తులు లైంగికంగా రెచ్చగొట్టేలా ఉన్నాయని.. నిందితుడు బెయిల్ పిటిషన్‌తో పాటు సమర్పించిన ఫోటోలు ఆ విషయం తెలియజేస్తున్నాయని కోర్టు పేర్కొంది. ఈ కేసులో కోర్టు.. బాధితురాలి వస్త్రధారణను తప్పు పడుతూ నిందితునికి బెయిల్ మంజూరు చేసింది. అయితే, కేరళ సెషన్స్ కోర్టు చేసిన వ్యాఖ్యలపై పలువురు న్యాయనిపుణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

 
జడ్జ్ ఏం చెప్పారు
ఒక మహిళ 'లైంగికంగా రెచ్చగొట్టే' దుస్తులు ధరిస్తే భారత శిక్షా స్మృతిలోని సెక్షన్ 354ఎ (లైంగిక వేధింపులు) ప్రాథమికంగా వర్తించదని కేరళ‌లోని కోజికోడ్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న రచయిత సివిక్ చంద్రన్ బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కోజికోడ్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎస్.కృష్ణకుమార్ ఈ వ్యాఖ్యలు చేశారు. "ఎవరి సాయం లేకుండా నిలబడలేని 74 ఏళ్ల వృద్ధుడు ఆ మహిళను ఒడిలో కూర్చోబెట్టుకుని రొమ్ములను తాకారని చెప్పడం నమ్మశక్యంగా లేదు" అని కోర్టు పేర్కొంది.

 
జడ్జి కృష్ణ కుమార్ మరో కేసులో ఇదే వ్యక్తికి 10 రోజుల క్రితమే బెయిల్ ఇచ్చారు. 42 ఏళ్ల మహిళ బాధితురాలిగా ఉన్న ఆ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ ఆయన.. "ఒక షెడ్యూల్డ్ కులానికి చెందిన మహిళ అని తెలిసి ఆమెను తాకారని చెప్పడం నమ్మశక్యంగా లేదు" అని వ్యాఖ్యానించారు. "బాధితురాలికి వ్యతిరేకంగా న్యాయమూర్తి అవమానకరమైన వ్యాఖ్యలు చేశారు. ఇది పూర్తిగా పురుషాహంకారాన్ని ప్రతిబింబిస్తోంది. బాధితురాలు ధరించిన దుస్తులు లైంగికంగా రెచ్చగొట్టేవిగా ఉన్నాయని జడ్జ్ ఎలా అంటారు" అని మాజీ కేరళ హై కోర్టు జడ్జ్ కమల్ పాషా ప్రశ్నించారు.

 
ఏమిటీ రెండు కేసులు?
చంద్రన్ 2020, ఫిబ్రవరి 08న నంది బీచ్‌లో ఒక క్యాంపు నిర్వహించారు. అయితే, ఈ క్యాంపులో పాల్గొన్న వారంతా తిరిగి వస్తుండగా ఆయన 30 ఏళ్ల ఓ మహిళ చేతిని పట్టుకుని ఎవరూ లేని ప్రదేశంలోకి తీసుకుని వెళ్లి తన ఒడిలో కూర్చోమని అడిగారు. ఆ తర్వాత ఆయన ఆమె మర్యాదకు భంగం కలిగించేలా ప్రవర్తిస్తూ ఆమె రొమ్ములను తాకారని ఆరోపించారు. అయితే, ఇవన్నీ అబద్ధాలని నిందితుడి తరఫు న్యాయవాదులు వాదిస్తున్నారు. ఇవి ఆయన శత్రువులు చేస్తున్న ఆరోపణలని అంటున్నారు. 2022 జులై 29న దీనిపై కేసు నమోదు చేశారు.

 
నిందితుని పెద్ద కూతురు ప్రభుత్వంలో ముఖ్యమైన పదవిలో ఉండగా, రెండో కూతురు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నట్లు ఆయన న్యాయవాదులు చెప్పారు. ‘సమాజంలో పేరు ప్రతిష్టలున్న వ్యక్తిపై 30 ఏళ్ల మహిళ ఈ తప్పుడు ఫిర్యాదు చేయడం దురదృష్టకరం అని" ఆయన న్యాయవాదులు అన్నారు. మరోవైపు బాధితురాలి తరఫు న్యాయవాదులు మాట్లాడుతూ .. "మహిళా రచయితల గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించడం నిందితుడికి అలవాటు. ఇది నిందితునిపై నమోదైన రెండో కేసు. ఆయనకు వ్యతిరేకంగా కేసు పెట్టడానికి మరింత మంది బాధితులు సిద్ధంగా ఉన్నారు" అన్నారు. నిందితునిపై అంతకుముందు 2022, ఏప్రిల్ 17న ఓ కేసు నమోదైంది. ఈ కేసులో నిందితుడు ఒక దళిత మహిళపై వీపుపై అకస్మాత్తుగా ముద్దు పెట్టుకున్నారని ఆరోపించారు.

 
ఆమె ఏప్రిల్ 16న ఫిర్యాదు చేయగా 17న కేసు నమోదైంది. "ఇది సాధ్యం కాని పని. నిందితునికి 74 ఏళ్లు. బాధితురాలికి 42 ఏళ్లు. వివిధ సమావేశాల్లో కనిపించిన ఫొటోల్లో నిందితుడు కనీసం సొంతంగా నిలబడలేని స్థితిలో ఉన్నారు. ఆయన నిలబడేందుకు కూడా ఎవరైనా సహాయం కానీ, ఏదైనా వస్తువు సాయం కానీ అవసరమవుతుంది. నిందితుని కంటే బాధితురాలు పొడవుగా ఉన్నారు. ఆయన వయసు, ఆరోగ్యం దృష్ట్యా ఆమె అంగీకారం లేకుండా ఆమె వీపుపై ముద్దు పెట్టుకున్నారని అనడం నమ్మశక్యంగా లేదు" అని నిందితుడి తరఫు న్యాయవాదులు వాదించారు.

 
‘నిందితుడికి, ఆ మహిళకు మధ్య సత్సంబంధాలు ఉన్నట్లు ఫోటోలలో కనిపిస్తోంది. ఆమె రచనలు ప్రచురించే విషయంలో ఏదో వివాదం వచ్చింద’ని లాయర్లు అన్నారు. కాగా లైంగిక వేధింపుల వల్ల తాను ఎంతో మానసిక వేదన ఎదుర్కొన్నట్లు ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అయితే, ఈ కేసులో కోర్టు.... "బాధితురాలి కులం తెలుసుకుని తాకడం, కౌగిలించుకోవడం చేశారని బాధితురాలు చెబుతున్న మాటలను నమ్మలేం. నిందితుడు అనేక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్న వ్యక్తి. కుల వ్యవస్థకు వ్యతిరేకం. ఆయన కుల రహిత సమాజం కోసం పని చేస్తున్నారు" అని పేర్కొంది. "సమాజంలో నిందితుని ప్రతిష్టను దెబ్బ తీసేందుకు చేస్తున్న ప్రయత్నం అని కనిపిస్తున్న ఆధారాలు తెలియచేస్తున్నాయి. ఆయన కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ చట్టం ఈ కేసులో వర్తించదు" అని కోర్టు చెప్పింది.

 
సామాజిక వైఖరి
కాగా కోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో జస్టిస్ పాషా.... "బాధితులు తమ బాధను చెప్పుకునేందుకు హై కోర్టుకు వెళ్ళవచ్చు. బెయిల్ పెద్ద విషయం కాదు. ఇలాంటి ఆధారాల ఆధారంగా కోర్టు ఆదేశాలు జారీ చేయలేదు. ఒక మహిళ నగ్నంగా ఉందని ఆమెపై అత్యాచారం చేయండి అని ఎవరైనా చెబుతారా?" అని ప్రశ్నించారు. "మహిళ ఎటువంటి దుస్తులు ధరించాలనేది ఆమె ఇష్టం. ఆమె ఎలాంటి దుస్తులు ధరించాలో నిర్ణయించే అధికారం పురుషుడికి లేదు" అని జస్టిస్ పాషా అన్నారు. బిషప్ ఫ్రాంకో ములక్కల్ కేసులో న్యాయవాదిగా ఉన్న సంధ్య రాజు బీబీసీతో మాట్లాడుతూ "అత్యున్నత న్యాయస్థానాలు వ్యవస్థను సరి చేస్తూ మహిళలకు అనుకూలంగా ఉండే తీర్పులు వెలువరిస్తుండగా, అదే వైఖరిని కింది కోర్టులు చూపించడం లేదు" అని అన్నారు.

 
"కేరళలో ఉన్న అధిక అక్షరాస్యత, ఆరోగ్య సూచికల వల్ల మహిళలను గౌరవంగా చూస్తారనే అభిప్రాయం ఉంది. జెండర్ సెన్సిటైజేషన్ అనే పదం నామమాత్రంగా మారిపోయింది. మహిళల హక్కులను ఒక జోక్ లా చూస్తున్నారు. ఈ విధమైన ఆలోచనా ధోరణి పితృస్వామ్య వ్యవస్థలో భాగం" అని సంధ్యా రాజు అన్నారు. కోజికోడ్ సెషన్స్ కోర్టు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా కేరళహై కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు ఫెమినిస్ట్ లాయర్స్ కలెక్టివ్ కు చెందిన కేవీ భద్ర కుమారి చెప్పారు. కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా కూడా పిటిషన్ దాఖలు చేస్తామని చెప్పారు.

Share this Story:

వెబ్దునియా పై చదవండి

తెలుగు వార్తలు ఆరోగ్యం వినోదం పంచాంగం ట్రెండింగ్..

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎల్ఐసీ పాలసీదారులకి గుడ్ న్యూస్.. ఏంటో తెలుసా?