Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంజినీరింగ్ చదివి రూ.160 కోసం పొలం పనులకు.. కాబూల్‌లో పరిస్థితి ఇదీ..

Kabul Farmer
, గురువారం, 18 ఆగస్టు 2022 (11:45 IST)
కాబూల్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టిన వెంటనే బుర్ఖాలు వేసుకొని పాస్‌పోర్టులపై స్టాంప్‌లు వేస్తున్న మహిళలు కనిపించారు. ఇక్కడి నుంచి ప్రాణాలతో బయటపడాలనే భయాందోళనలతో ఏడాది క్రితం పరిస్థితులు భయానకంగా ఉండేవి. కానీ, ఇప్పుడు అంతా ప్రశాంతంగా, పరిశుభ్రంగా కనిపిస్తున్నాయి. రోడ్లపై తాలిబాన్ తెల్ల జెండాలు ఎగురుతున్నాయి. ఇదివరకటి బిల్‌బోర్డులపై పెయింట్లు వేశారు. తాలిబాన్లు అధికారంలోకి రావడంతో ఒక్కసారిగా పరిస్థితులు తారుమారైన ఈ దేశం ఇప్పుడు ఎలా ఉంది?

 
మగవారికి ఉద్యోగాలు ఇచ్చేయాలని మహిళలకు చెబుతున్నారు
‘‘ఈ ఉద్యోగాన్ని నా సోదరుడికి ఇచ్చేయాలని వారు ఒత్తిడి తెస్తున్నారు’’ అని ఒక మహిళ ఇటీవల ఆన్‌లైన్ వేదికగా ఆవేదన వ్యక్తంచేశారు. ఇలాంటి మెసేజ్‌లు ఇటీవల కాలంలో వైరల్ అవుతున్నాయి. ‘‘కష్టపడి చదువుకొని, అనుభవంతో ఈ ఉద్యోగాలను మేం సంపాదించాం. ఇప్పుడు ఈ ఒత్తిడికి తలొగ్గితే, మాకు మేమే అన్యాయం చేసుకున్నట్లు అవుతుంది’’అని మరో మహిళ వ్యాఖ్యానించారు. ఇదివరకటి ప్రభుత్వ హయాంలో సీనియర్ అధికారులుగా పనిచేసిన కొందరిని నేను కలిశారు. వారు కూడా ఇంచుమించు ఇలాంటి అభిప్రాయాలనే వ్యక్తంచేశారు.

 
వీరంతా అఫ్గాన్ రెవెన్యూ డైరెక్టరేట్‌లో పనిచేసేవారు. గత ఆగస్టులో తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పుడు వీరందరినీ ఉద్యోగాలు వదిలేసి ఇంటికి వెళ్లిపోవాలని సూచించారు. తమ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు తమ ఇంట్లోని మగవారి సీవీలు పంపాలని తాలిబాన్ అధికారులు తమకు సూచించారని ఆ మహిళా అధికారులు ఆవేదన వ్యక్తంచేశారు.

 
‘‘ఇది నా ఉద్యోగం’’
‘‘ఇది నా ఉద్యోగం’’అని ఒక మహిళ నొక్కిచెప్పారు. అయితే, ఆమె తన పేరును వెల్లడించడానికి ఇష్టపడలేదు. ‘‘ఈ ఉద్యోగం కోసం నేను 17ఏళ్లు కష్టపడ్డాను. మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాక ఈ ఉద్యోగం వచ్చింది. ఇప్పుడేమో మళ్లీ జీరోను చేశారు’’అని ఆమె అన్నారు. అఫ్గానిస్తాన్ వెలుపల నుంచి టెలిఫోన్ కాల్‌ద్వారా అమీనా అహ్మదీ కూడా మాతో కలిశారు. ఆమె డైరెక్టర్ జనరల్ ఆఫ్ రెవెన్యూ డైరెక్టరేట్‌గా పనిచేశారు. ఆమె ఎలాగోలా ఇక్కడి నుంచి బయటపడగలిగారు. అయితే, ఇది మంచిపని కాదని ఆమె భావిస్తున్నారు. ‘‘మేం మా గుర్తింపును కోల్పోతున్నాం. మా దేశాన్ని అక్కడే ఉండి కాపాడుకోవాలి’’అని ఆమె అన్నారు. ఈ మహిళలంతా కలిసి తమ బృందానికి ‘‘విమెన్ లీడర్స్ ఆఫ్ అఫ్గానిస్తాన్’’ అనే పేరును పెట్టారు. తమ ఉద్యోగాలు మళ్లీ తమకు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

 
‘‘మహిళలు పనిచేస్తున్నారు’’
ఈ మహిళలంతా అఫ్గానిస్తాన్‌లో అంతర్జాతీయ మద్దతుతో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు విద్య, ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకున్నారు. అయితే, తాలిబాన్ తిరుగుబాటుతో ఆ ప్రభుత్వం కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటికీ మహిళలు పనిచేస్తున్నారని తాలిబాన్లు చెబుతున్నారు. ఆరోగ్య, విద్య, ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ రంగాల్లో పనిచేస్తున్న కొద్దిమంది మహిళలను వారు చూపిస్తున్నారు. ఒకప్పుడు ప్రభుత్వంలో నాలుగో వంతు వరకు ఉండే మహిళా ఉద్యోగులకు ఇప్పటికీ జీతాలు ఇస్తున్నామని తాలిబాన్లు నొక్కిచెబుతున్నారు. అయితే, ఇదివరకటితో పోలిస్తే, ఈ జీతాలు చాలా తక్కువ. తను ముఖాన్ని పూర్తిగా కప్పుకున్నప్పటికీ, హిజాబ్ సరిగాలేదంటూ ఓ తాలిబాన్ గార్డు తను ఎలా విమర్శించారో ఒక మాజీ మహిళా ఉద్యోగి గుర్తుచేసుకున్నారు. ‘‘హిజాబ్ కంటే ముఖ్యమైన సమస్యలు చాలా ఉన్నాయి. ముందు వాటిపై దృష్టిపెట్టండి’’అని ఆమె గార్డుతో చెప్పారు. ఆమెలానే ఇక్కడ చాలా మంది మహిళలు తమ హక్కుల కోసం పోరాడుతున్నారు.

 
గ్రామాల్లో కరవు..
అఫ్గాన్ మారుమూల ప్రాంతాల్లో పరిస్థితులు ఇలానే కనిపిస్తున్నాయి. వేసవి నడుమ ఇక్కడ చాలా ప్రాంతాల్లో గోదుమ పంట చేతికి వచ్చింది. ఆవుల అరుపులు కూడా వినిపిస్తున్నాయి. పంటను కోసేందుకు 18ఏళ్ల నూర్ మహమ్మద్, 25ఏళ్ల అహ్మద్ కొడవళ్లతో పొలంలో పనిచేస్తున్నారు. ‘‘కరవు వల్ల పంట దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది’’అని నూర్ చెప్పారు. ఎక్కువసేపు అవిరామంగా పనిచేయడంతో ఆయన ముఖంపై చెమట, మట్టి కనిపిస్తున్నాయి. ‘‘ఇప్పుడు ఈ ఉద్యోగం మాత్రమే నాకు అన్నం పెడుతోంది’’అని ఆయన అన్నారు. మా వెనుక ఇప్పటికే కొడవళ్లతో కోసిన పంట కనిపిస్తోంది. దీని కోసం పది రోజులుగా నూర్, అహ్మద్ తీవ్రంగా కష్టపడుతున్నారు. వీరు రోజుకు రెండు డాలర్లు (రూ.160) కోసం పనిచేస్తున్నారు. ‘‘నేను ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదువుకునేవాణ్ని. కానీ, కుటుంబాన్ని పోషించేందుకు చదువు మధ్యలోనే ఆపేశాను’’అని నూర్ చెప్పారు. చదువును ఆపేసినందుకు ఆయన చాలా బాధపడుతున్నారు.

 
అహ్మద్ కథ కూడా ఇలా విచారకరమైనదే. ‘‘నేను ఇరాన్ వెళ్లేందుకు మోటార్‌బైక్‌ను అమ్మేశాను. కానీ, అక్కడ కూడా నాకు పని దొరకలేదు’’అని ఆయన చెప్పారు. అఫ్గానిస్తాన్‌లోని పేద ప్రావిన్సుల నుంచి వచ్చేవారికి పొరుగునున్న ఇరాన్‌లో కొన్ని కాలాల్లో పని దొరుకుతుంది. కానీ, ఇప్పుడు అక్కడ కూడా పనేమీ ఉండటం లేదు. ‘‘మేం మా తాలిబాన్ సోదరులకు ఆహ్వానం పలుకుతున్నాం. కానీ, అవకాశాలు కల్పించే ప్రభుత్వమే మాకు కావాలి’’అని నూర్ అన్నారు. ఘోర్ ప్రావిన్స్ క్యాబినెట్‌తోపాటు తాలిబాన్ గవర్నర్ అహ్మద్ షా దిన్ దోస్త్‌ను కూడా మేం కలిశాం. యుద్ధం సమయంలో షాడో డిప్యూటీ గవర్నర్‌గా దోస్త్ పనిచేశారు. ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను ఆయన వివరించారు. ‘‘ఈ సమస్యలు చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తోంది’’అని ఆయన చెప్పారు. పేదరికం, సరైన రోడ్లు లేకపోవడం, ఆస్పత్రుల లేమి, స్కూళ్లు తెరచుకోకపోవడం ఇవన్నీ సమస్యలేనని ఆయన అన్నారు.

 
ఇక్కడ యుద్ధం ముగియడంతో సహాయక సంస్థలు పనిచేయడానికి వస్తున్నాయి. ప్రస్తుతం ఘోర్‌ ప్రావిన్స్‌లోని చాలా ప్రాంతాల్లో కరవు పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అయితే, తన విషయంలో ఇప్పటికీ యుద్ధం ముగిసిపోలేదని దోస్త్ అంటున్నారు. తనను అమెరికా బలగాలు బంధించాయని, చిత్ర హింసలు పెట్టాయన ఆయన అన్నారు. ‘‘మమ్మల్ని ఇంకా వేధించొద్దు. మాకు పశ్చిమ దేశాల నుంచి ఎలాంటి సాయమూ అక్కర్లేదు’’అని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘ఎందుకు అన్ని విషయాల్లోనూ పశ్చిమ దేశాలు జోక్యం చేసుకుంటున్నాయి? మహిళలను మీ దేశంలో ఎలా గౌరవిస్తున్నారని మేం ఎప్పుడైనా అడిగామా?’’అని ఆయన అన్నారు. ఇక్కడున్న ఒక పాఠశాల, పోషకాహార లోప కేంద్రంలను కూడా మేం సందర్శించాం. మా వెనుకే దోస్త్ సిబ్బంది కూడా వచ్చారు.

 
‘‘అఫ్గానిస్తాన్‌ను ప్రపంచ దేశాలు పట్టించుకోవాలి’’అని తాలిబాన్ ఆరోగ్య విభాగం డైరెక్టర్ అబ్దుల్ సతార్ మఫాక్ చెప్పారు. ఆయన కాస్త మెరుగ్గా ఆలోచిస్తున్నారు. ‘‘మనం ప్రజల ప్రాణాలను కాపాడాలి. దీనిలో రాజకీయాలకు ఎలాంటి చోటూలేదు’’అని ఆయన అన్నారు. వెంటనే పొలంలో నూర్ మహమ్మద్ చెప్పిటన మాటలు గుర్తుకువచ్చాయి. ‘‘పేదరికం, కరవులతో పోరాటం కూడా యుద్ధమే. అయితే, ఇది తుపాకుల యుద్ధం కంటే పెద్దది’’అని ఆయన వ్యాఖ్యానించారు.

 
విద్యార్థులను ఇంటికి పంపేస్తున్నారు..
18ఏళ్ల సోహాలియా చాలా ఉత్సాహంగా కనిపించారు. హెరాత్‌లోని మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన ఒక మార్కెట్‌కు ఆమె నన్ను తీసుకెళ్లారు. ఇక్కడ మొదట్నుంచీ సంస్కృతీ, సైన్స్, సృజనాత్మకతకు చోటుంది. ఈ బజార్‌ను తెరచిన తొలి రోజే మేం ఇక్కడకు వచ్చాం. గత ఏడాది తాలిబాన్లు దీన్ని మూసివేశారు. అంతకుముదు కోవిడ్-19 వల్ల ఇది మూతపడింది. సోహాలియా కుటుంబానికి చెందిన బట్టల షాపులోకి మేం వెళ్లాం. దీనిలో ఒకచోట కుట్టు మెషీన్లు కనిపించాయి. పైకప్పుకు ఎర్ర బెలూన్లు కట్టారు. ‘‘పదేళ్ల క్రితం మా అక్కకు 18ఏళ్ల వయసున్నప్పుడు ఈ షాపును ఆమె మొదలుపెట్టింది’’అని సోహాలియా నాకు చెప్పారు. ఇక్కడ సంప్రదాయ కుచి వస్త్రాలను తన తల్లి, అమ్మమ్మ కుడుతుంటారని ఆమె అన్నారు. దగ్గర్లోనే ఒక ఇంటర్నెట్ క్లబ్, రెస్టారెంట్‌ను కూడా సోహాలియా అక్క తెరిచారు.

 
మహిళలకు ప్రత్యేకమైన ఈ బజార్‌ చాలా కళకళలాడుతోంది. చాలా మంది నగలు, బట్టలు కొనుక్కోవడానికి ఇక్కడకు వస్తున్నారు. అయితే, ఇక్కడ లైట్లు అంత గొప్పగా లేవు. కానీ, రోజంతా ఇంట్లోనే కూర్చొనే మహిళల్లో ఇవి కాస్త వెలుగులను విరజిమ్ముతున్నాయి. సోహాలియా దగ్గర మరో కథ కూడా ఉంది. ‘‘తాలిబాన్లు హైస్కూళ్లను మూసివేశారు’’అని ఆమె చెప్పారు. ముఖ్యంగా తనలాంటి బాగా చదువుకునే టీనేజీ అమ్మాయిలపై ఇది చాలా ప్రభావాన్ని చూపిస్తోందని ఆమె అన్నారు. చాలా సెకండరీ హైస్కూళ్లను ఇక్కడ మూసేశారు. అయితే, వీటిని మళ్లీ తెరవాలని కొందరు తాలిబాన్లు కూడా కోరుతున్నారు.

 
‘‘నేను 12వ తరగతిలో ఉండేదాన్ని. ఇందులో ఉత్తీర్ణత సాధించకపోతే, యూనివర్సిటీలో నేను అడుగుపెట్టలేను’’అని సోహాలియా చెప్పారు. అయితే, ఇప్పటికీ నువ్వు ఇక్కడే ఉండాలని అనుకుంటున్నావా? అని సోహాలియాను ప్రశ్నించాను. దీంతో.. ‘‘ఇది నా దేశం. దీన్ని వదిలిపెట్టి ఎక్కడికి పోను’’అని ఆమె సమాధానం ఇచ్చారు. అయితే, ఏడాదిపాటు స్కూలుకు వెళ్లకుండా ఉండిపోవడం చాలా కష్టం. ‘‘ఇది నా ఒక్కదాని పరిస్థితి కాదు. అఫ్గాన్‌లో అమ్మాయిలంతా ఇలానే బాధపడుతున్నారు’’అని ఆమె అన్నారు. ‘‘ఇది నిజంగా బాధాకరం. అవన్నీ గుర్తుచేసుకుంటే చాలా బాధగా అనిపిస్తుంది’’అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ఆ సమయంలో ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘‘నేను చాలా బాగా చదువుకునేదాన్ని’’అని కంటి నుంచి నీరు వస్తుండగా ఆమె చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డౌన్‌లోడ్‌కు సిద్ధంగా TSLPRB Police Constable Hall Ticket 2022