Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రైల్వే ఎగ్జామ్: వేడిపెనం మీద బొటనవేలు కాల్చుకుని ఆ చర్మం ఫ్రెండ్ చేతికి అతికించి పరీక్ష హాల్‌లోకి పంపించాడు, అయినా దొరికిపోయాడు

రైల్వే ఎగ్జామ్: వేడిపెనం మీద బొటనవేలు కాల్చుకుని ఆ చర్మం ఫ్రెండ్ చేతికి అతికించి పరీక్ష హాల్‌లోకి పంపించాడు, అయినా దొరికిపోయాడు
, శనివారం, 27 ఆగస్టు 2022 (14:53 IST)
వడోదరలో 'మున్నా భాయ్ ఎంబీబీఎస్' సినిమాలో హీరో పరీక్ష రాసిన తరహాను గుర్తు చేసే సంఘటన ఒకటి చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో ఆగస్టు 22న రైల్వే ఉద్యోగాల నియామకానికి సంబంధించిన ప్రవేశ పరీక్ష జరిగింది. వడోదరలోని లక్ష్మీపుర పరీక్ష కేంద్రంలో చోటు చేసుకున్న మోసం వెలుగులోకి వచ్చింది. ఇక్కడకు అభ్యర్థి తరుపున పరీక్ష రాసేందుకు ఒక నకిలీ అభ్యర్థి హాజరయ్యారు. నిర్వాహక సిబ్బంది ఈ నకిలీ అభ్యర్థిని పట్టుకోవడంతో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. బిహార్‌కు చెందిన రాజ్యగురు గుప్తా రైల్వే పరీక్ష రాయాల్సి ఉంది. అయితే, ఆయనకు బదులుగా ఈ పరీక్ష రాసేందుకు మనీష్ కుమార్ శంభు ప్రసాద్ హాజరయ్యారు.

 
పరీక్ష కేంద్రంలోకి ప్రవేశం ఎలా దొరికింది?
అసలు అభ్యర్థి బొటన వేలి చర్మాన్ని కట్ చేసి మనీష్ కుమార్ బొటనవేలికి అతికించుకున్నారు. ఈ విధంగా పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించగలిగారు. కానీ, హ్యాండ్ శానిటైజర్ ఆయన వ్యూహాన్ని దెబ్బ తీసింది. ఆయన హ్యాండ్ శానిటైజర్‌తో మూడు సార్లు చేతులను శుభ్రం చేసుకున్నారు. దాంతో, బొటనవేలికి అంటించుకున్న చర్మం ఊడిపోయింది. పరీక్ష కేంద్రంలో ఇన్విజిలేటర్లు వేలి ముద్రలు పరిశీలిస్తున్నప్పుడు ఈ మోసం బయటపడింది. ఈ వ్యక్తితో పాటు వడోదర పోలీసులు అసలు అభ్యర్థి రాజ్యగురును కూడా అరెస్టు చేశారు. ఇద్దరినీ కోర్టులో హాజరుపరిచి రిమాండుకు పంపించారు. వడోదర పోలీసులు రాజ్యగురు గుప్తా డీఎన్ఏ పరీక్ష చేయాలని నిర్ణయించారు. మనీష్ కుమార్ చర్మం శాంపిల్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.

 
ఈ పరీక్షను ఇండియన్ రైల్వే కోసం టాటా కన్సల్టన్సీ సర్వీస్ నిర్వహిస్తోంది. టీసీఎస్ సిబ్బంది నకిలీ అభ్యర్థిని కనిపెట్టి పోలీసులకు అప్పగించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అసలు, నకిలీ అభ్యర్థులిద్దరినీ అరెస్టు చేశారు. వీరిద్దరూ బిహార్‌కు చెందినవారే. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. టీసీఎస్ ఉద్యోగి అఖిలేంద్ర సింగ్ ఈ పరీక్ష సూపర్‌వైజర్‌గా వెళ్లారు. ఆయన ఫింగర్ ప్రింట్ స్కానింగ్ పరికరం ద్వారా అభ్యర్థులను వేలిముద్రలు చెక్ చేస్తున్నారు. కానీ, మనీష్ కుమార్ శంభు ప్రసాద్ వివరాలు మాత్రం ఎన్నిసార్లు ప్రయత్నించినా వేలిడేట్ కావడం లేదు. దీంతో, అనుమానం వచ్చి అఖిలేంద్ర సింగ్ బొటనవేలు పరిశీలించగా అసలు విషయం బయటపడింది.

 
ఆ తర్వాత జరిగిన విచారణలో రాజ్యగురు గుప్త స్థానంలో మనీష్ కుమార్ పరీక్షకు హాజరైనట్లు తేలింది. పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించగానే అభ్యర్థి అడ్మిట్ కార్డును చెక్ చేసినట్లు పోలీసులు చెప్పారు. భద్రతా సిబ్బంది అభ్యర్థుల స్కానింగ్ కూడా నిర్వహించారు. ఆ తర్వాత పరీక్ష రాసేందుకు ల్యాబ్ కు పంపించారు. అయితే, ల్యాబ్‌లోకి పంపే ముందు అభ్యర్థుల వేలిముద్రలను ఆధునిక పరికరాల సహాయంతో తనిఖీ చేశారు. మనీష్ కుమార్ మొదట ఇన్విజిలేటర్లను మోసం చేయాలని చూసారు. కానీ, శానిటైజర్‌తో మూడు సార్లు చేతులను శుభ్రం చేసుకోవడంతో బొటనవేలికి కృత్రిమంగా అంటించిన చర్మం ఊడి వచ్చేసింది. అప్పుడే అనుమానం వచ్చింది.. అలా బయటపడింది

 
మనీష్ కుమార్ వేలిముద్ర ఎన్నిసార్లు ప్రయత్నించినా వేలిడేట్ కాకపోవడంతో సూపర్‌వైజర్ ఆ విషయం అధికారులకు తెలిపారు. అరగంట ఆగి మరోసారి వేలిముద్రలను తనిఖీ చేయాలని చూశారు. కానీ, ఈ సారి కూడా విఫలం కావడంతో సూపర్‌వైజర్‌కు అనుమానం వచ్చింది. ఫింగర్ ప్రింట్ పనిచేయకపోవడంతో సూపర్‌వైజర్ పదేపదే చెక్ చేయడంతో.. మనీశ్ కుమార్ తన చేతులను ప్యాంట్ జేబులోనే పెట్టుకుని ఉంచేందుకు ప్రయత్నించారు. దీంతో సూపర్‌వైజర్ అనుమానానికి మరింత బలం చేకూరింది. దాంతో, ఆయన వేళ్లను శానిటైజర్‌తో శుభ్రం చేయించారు. దీంతో, వేలికి అంటుకున్న చర్మం ఊడి వచ్చేసింది.

 
అసలు బొటనవేలి చర్మం ఎలా తీశారు? ఎలా అతికించారు?
"రాజ్యగురు వేడి వేడి పెనం మీద బొటన వేలు పెట్టి కాల్చుకున్నారు. దీంతో వేలిపై బొబ్బ ఏర్పడింది. దానిని జాగ్రత్తగా తీసి వేరే వ్యక్తికి అంటించారు. ఈ వ్యవహారంలో వారు నిపుణులెవరి సహాయం తీసుకోలేదు" అని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎస్‌ఎం వరోతరియా బీబీసీకి చెప్పారు. లక్ష్మీపుర పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పూజా తివారీ బీబీసీతో మాట్లాడుతూ "నిందితులిద్దరూ బిహార్‌లోని ఒకే గ్రామానికి చెందినవారు. నకిలీ అభ్యర్థి పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించగలిగారు కానీ వివరాలను ధ్రువీకరించడంలో విఫలమయ్యారు. శానిటైజర్‌తో చేతిని శుభ్రం చేసేసరికి అంటించిన బొటనవేలి చర్మం ఊడి వచ్చేసింది. దీంతో, వ్యవహారం బయటపడింది" అని చెప్పారు. మనీష్ కుమార్, రాజ్యగురు గుప్తకు వ్యతిరేకంగా టీసీఎస్ ఉద్యోగి జాస్మిమ్ కుమార్ గజ్జర్ ఫిర్యాదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 419, 464, 465, 468, 120 (బి) కింద పోలీసులు కేసును నమోదు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మధుమేహం వ్యాధిగ్రస్థులకు గుడ్ న్యూస్.. ఆ ధరలు తగ్గాయట