Webdunia - Bharat's app for daily news and videos

Install App

Loan Scams: ‘నా భార్య న్యూడ్ ఫోటోలు రుణాలు ఇచ్చే వారి దగ్గరకు ఎలా వెళ్లాయి?’

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (13:05 IST)
గత మార్చిలో రాజ్ 110 డాలర్లు (సుమారు రూ.8,500) రుణం తీసుకున్నారు. దీనితో తన ఆర్థిక సమస్యలు తీరిపోతాయని ఆయన భావించారు. అయితే, ఆయన జీవితం మరింత దుర్భరంగా మారింది. పుణెకు చెందిన ఆయన భారత్‌లోని ఓ డిజిటల్ లోన్ స్కామ్‌లో చిక్కుకున్నారు. చాలా త్వరగా, తేలిగ్గా రుణమిస్తామని చెప్పడంతో ఓ లోన్ యాప్ పట్ల రాజ్ (పేరు మార్చాం) ఆకర్షితులయ్యారు. దీని కోసం ఆయన ఒక యాప్‌ను తన ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్నారు. దీనిలో తన ఐడెంటిటీ కార్డును అప్‌లోడ్ చేశారు.

 
ఆయనకు వేగంగానే డబ్బులు వచ్చాయి. అయితే, ఆయన ఆశించిన దానిలో సగం మాత్రమే డబ్బులు ఆయనకు అందాయి. కానీ, మూడు రోజుల్లోనే ఆయన తీసుకున్న డబ్బులకు మూడు రెట్లు కట్టాలని ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. ఆ అప్పును తీర్చేందుకు మరికొన్ని లోన్ యాప్స్‌లో రాజ్ రుణాలు తీసుకున్నారు. అలా మొత్తంగా 33 లోన్ యాప్‌లను ఆయన ఆశ్రయించారు. ఇప్పుడు ఆయన రుణం మొత్తంగా 6000 డాలర్లు (రూ. 4,66,170)కు పెరిగిపోయింది.

 
ఆ యాప్‌లను నడిపిస్తున్న చాలా మంది రాజ్‌ను డబ్బులు కట్టాలని బెదిరిస్తున్నారు. అయితే, పోలీసులను ఆశ్రయించేందుకు ఆయన భయపడుతున్నారు. రాజ్ ఫోన్‌లోని కాంటాక్టులు, ఫోటోలను ఆ యాప్‌లను నడిపించేవారు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆయన ఫోన్‌లో ఉన్న ఆయన భార్యకు చెందిన నగ్న చిత్రాలను అందరికీ పంపిస్తానని ఆయన్ను బెదిరిస్తున్నారు. ఆ అప్పులు చెల్లించేందుకు తన భార్య నగలన్నీ రాజ్ అమ్మేశారు. కానీ, ఇప్పటికీ ఆయన భయపడుతూనే ఉన్నారు. ‘‘వారు అంత తేలిగ్గా వదిలిపెట్టరు. నన్ను చంపేస్తారేమోనని భయమేస్తోంది. రోజూ బెదిరింపు కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయి’’అని ఆయన తెలిపారు.

 
ఇలాంటి 600 యాప్‌లు..
భారత్‌లో ఇలాంటి మొబైల్ ఫోన్ స్కామ్‌లు సాధారణమైపోతున్నాయి. 2020 జనవరి 1 నుంచి 2021 మార్చి 31 మధ్య ఇలాంటి అక్రమంగా రుణ వ్యాపారంచేసే 600 యాప్‌లను గుర్తించినట్లు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) నిర్వహించిన ఒక సర్వేలో వెల్లడైంది. ఆ సమయంలో మహారాష్ట్ర నుంచి ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. 572 మంది ఆ రాష్ట్రం నుంచి ఆర్బీఐకు ఫిర్యాదు చేశారు. ‘‘తేలిగ్గా, వేగంగా డబ్బులు ఇస్తామని ఆ యాప్‌లు చెబుతుంటాయి. అయితే, తమ ఫోన్లలోని డేటాను వారు దొంగతనంగా తీసుకుంటున్నారని బాధితులు తెలిసుకునేటప్పటికే పరిస్థితులు చేయిదాటిపోతుంటాయి’’ అని మహారాష్ట్ర సైబర్ విభాగం స్పెషల్ ఇన్‌స్పెక్టర్ జనరల్ యశస్వి యాదవ్ చెప్పారు.

 
‘‘ఇదొక స్కామ్ లాంటిది. భారత్‌లో చాలా మందికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు వెనకాడుతుంటాయి. దీంతో వీరు అక్రమంగా రుణాలు ఇచ్చే యాప్‌లను ఆశ్రయిస్తుంటారు’’ అని ఆయన వివరించారు. పెద్దగా చదువుకోనివారు, అవసరాలు ఎక్కువగా ఉండే ప్రజలను వెతికి పట్టుకొనేందుకు తమకు ప్రత్యేక శిక్షణ ఇస్తారని ఆ స్కామర్‌ బీబీసీతో చెప్పారు. రాజ్ విషయంలో ఇలానే మూడు రెట్లు ఎక్కువగా డబ్బులు చెల్లించాలని బెదిరించారు. ఒకవేళ సమయానికి డబ్బులు చెల్లించకపోతే, బాధితులపై మరింత ఒత్తిడి చేస్తారు. ‘‘మొదట పదేపదే ఫోన్ చేస్తాం. ఆ తర్వాత బెదిరిస్తాం. అప్పటికీ డబ్బులు రాకపోతే, బ్లాక్‌మెయిల్ చేస్తాం. ఎందుకంటే మా దగ్గర బాధితుల ఫోన్ నంబర్లు కూడా ఉంటాయి’’ అని ఆ స్కామర్ బీబీసీకి చెప్పారు. ‘‘చాలామంది పరువు పోతుందని, మరి కొందరు భయంతో పోలీసుల దగ్గరకు వెళ్లరు’’అని ఆయన తెలిపారు.

 
బెదిరింపులు ఇలా..
బాధితులకు స్కామర్లు పంపిన కొన్ని మెసేజ్‌లను బీబీసీ పరిశీలించింది. అప్పుల గురించి కుటుంబ సభ్యులకు, తోటి ఉద్యోగులకు చెబుతామని బెదిరించే సందేశాలు దీనిలో ఉన్నాయి. బాధితుల ఫోటోలతో అశ్లీల చిత్రాలు తయారుచేసి అందరికీ పంపిస్తామని కూడా బెదిరించారు. ఇలాంటి లోన్ స్కామర్ల వలలో ప్రజలు చిక్కుకోకుండా భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. గత ఏడాది మే నెలలో ప్లే స్టోర్‌లోని ఇలాంటి యాప్‌లను సమీక్షించాలని గూగుల్‌కు ప్రభుత్వం సూచించింది. చాలా యాప్‌లను గూగుల్‌కు చెందిన ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ నుంచే బాధితులు డౌన్‌లోడ్ చేసుకుంటారు.

 
అయితే, తమ యాప్‌లను ప్లే స్టోర్ నుంచి తొలగిస్తే, టెక్స్ట్ మెసేజ్‌ల సాయంతో స్కామర్లు రుణాలు ఇస్తున్నారు. దీంతో డిజిటల్ లెండింగ్‌పై ఆర్బీఐ అధ్యయనం చేపట్టింది. ఆ తర్వాత అక్రమ రుణ లావాదేవీలను అడ్డుకునేందుకు కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఆ యాప్‌లను ధ్రువీకరించేందుకు ఒక కేంద్ర ఏజెన్సీని కూడా ఏర్పాటు చేయాలని కోరింది.
 
త్వరలో చర్యలు..
ఈ అంశంపై రానున్న వారాల్లో ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశముంది.
 
అయితే, కొత్త నిబంధనలు వచ్చేసరికి కొంతమంది విషయంలో పరిస్థితి చేయిదాటిపోవచ్చు.
 
ఇలాంటి రుణ యాప్‌ల ఒత్తిడి వల్లే తమ కుమారుడు సందీప్ కోర్గాంకర్ మే 4న ఆత్మహత్య చేసుకున్నట్లు ఆయన తల్లిదండ్రులు వెల్లడించారు.
 
సందీప్ రుణం తీసుకోలేదని, కేవలం ఒక యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని ఆయన సోదరుడు దత్తాత్రేయ చెప్పారు.
 
‘‘ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకున్న కొన్ని రోజులకే రుణం తీసుకున్నామని ఆఫీస్‌లో అందరికీ చెప్పేస్తామని బెదిరించేవారు. ఆయన ఫోటోలతో అశ్లీల చిత్రాలు రూపొందించారు. ఆఫీసులో దాదాపు 50 మందికి వాటిని పంపించేశారు’’అని దత్తాత్రేయ వెల్లడించారు.
 
‘‘అక్కడితో వేధింపులు ఆగిపోలేదు. ఈ విషయంపై పోలీసులకు కూడా సందీప్ ఫిర్యాదు చేశాడు’’అని దత్తాత్రేయ తెలిపారు.
 
‘‘సందీప్ జీవితం నరకంగా మారిపోయింది. ఆయనకు నిద్ర ఉండేది కాదు. సరిగా తిండి కూడా తినేవాడు కాదు’’అని ఆయన చెప్పారు.
 
ఈ కేసును ప్రస్తుతం పోలీసులు విచారణ చేపడుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అల్లరి నరేశ్ కు బచ్చల మల్లి హిట్టా? ఫట్టా? బచ్చలమల్లి రివ్యూ

ముఫాసా ది లైన్ కింగ్ ఎలా వుందంటే... ముఫాసా రివ్యూ

Upasana: ఉపాసన కామినేని ఐస్లాండ్ పర్యటన రద్దు.. కారణం ఏంటంటే?

చంద్రహాస్ బరాబర్ ప్రేమిస్తా మూవీ టీజర్ రిలీజ్ చేసిన వి.వి.వినాయక్

శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్‌ లో కథే హీరో. స్క్రీన్ ప్లే ఊహకు అందదు : చిత్ర యూనిట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకోదగిన ఆహారం, ఏంటి?

భారతదేశంలో పెరుగుతున్న ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కేసులు: ముందస్తుగా గుర్తించడం ఎందుకు కీలకం

Winter Beauty Tips, చలి కాలంలో చర్మ సంరక్షణ చిట్కాలు

Acidity అసిడిటీ వున్నవారు ఏం తినకూడదు?

పీచు పదార్థం ఎందుకు తినాలి?

తర్వాతి కథనం