టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బోండా ఉమ ఏపీ సర్కారుపై మండిపడ్డారు. జిల్లాల విభజన నేపథ్యంలో అధికారం చేతిలో ఉందని జగన్ ప్రభుత్వం ఇష్టం వచ్చినట్లు జిల్లాల విభజన చేస్తోందని బోండా ఉమ మండిపడ్డారు. కొత్త జిల్లాలతో ఉపయోగం ఏంటని ఆయన ప్రశ్నించారు.
కొత్త ఉద్యోగం ఒక్కటైనా వస్తుందా అని ఉమ నిలదీశారు. అన్ని పార్టీలను కలుపుకొని రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం ఉధృతం చేస్తామని.. ప్రభుత్వం స్పందించకుంటే సీఎం జగన్ నివాసాన్ని ముట్టడిస్తామని బోండా ఉమ హెచ్చరించారు.
వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం కొత్త జిల్లాల ఏర్పాటు చేశారన్నారు. జిల్లాల విభజనపై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని, సీఎం జగన్ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.
జిల్లాల విభజన అవసరమా అంటూనే.. బోండా ఉమ తూర్పు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్, పశ్చిమ కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.
ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరు ఉన్న ప్రాంతానికి మచిలీపట్నం జిల్లా కేంద్రంగా ఎన్టీఆర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. పేదల సమస్యలపై పోరాడుతూ ప్రాణాలు అర్పించిన వంగవీటి రంగా పేరును విజయవాడ జిల్లాకు పెట్టాలన్నారు.