Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైఎస్ఆర్ సీపీ పాలనలో రైతులకు అన్యాయం జరగదు: మంత్రి మేకపాటి

Webdunia
మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (22:58 IST)
"ప్రభుత్వానికి రైతే ముందు..ఆ తర్వాతే ఏదైనా..ఎవరైనా"  అని  పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పునరుద్ఘాటించారు.  రైతు బాగుండటమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వానికి నిజమైన అభివృద్ధని ఆయన స్పష్టం చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ తో కలిసి  మంత్రి మేకపాటి ఆయన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగానే నెల్లూరు జిల్లాలో రైతులకు సమస్యగా మారిందన్నారు.

భవిష్యత్ లో అన్నదాతలకు రాష్ట్రవ్యాప్తంగా ఏ విధమైన సమస్యా రాకుండా చూసే దిశగా మార్గాలు అన్వేషిస్తున్నామని మంత్రి మేకపాటి వెల్లడించారు. రైతు పక్షపాత ప్రభుత్వం 'వైఎస్ఆర్'సీపీ ప్రభుత్వం ఉన్నంతవరకూ రైతులు గుండెలమీద చెయ్యేసుకుని భరోసాగా ఉండాలని ఆయన అన్నారు.

రైతులకు మంచి చేసే ఏ పనికైనా ప్రాధాన్యతనిచ్చే ప్రభుత్వం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ముందుకెళుతుందన్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం తీసుకువచ్చిన వ్యవసాయ  బిల్లుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు తెలిపినట్లు వెల్లడించారు.
 
అదే అసలు సమస్య..ఇలా చేస్తే పరిష్కారం : మంత్రి మేకపాటి
రాబోయే రోజుల్లో రైతులకు ఇబ్బంది రాకుండా ఉండేందుకు పౌరసరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబుతో నిన్న సమావేశమై కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి తెలిపారు. అందులో భాగంగా  పంటలు చేతికొచ్చే సమయంలో రైతులకు ప్రతి విషయంలో సహాయంగా ఉండేలా ఒక నోడల్ అధికారిని నియమించనున్నట్లు మంత్రి మేకపాటి వెల్లడించారు. 

ప్రభుత్వం నియమించిన జాయింట్ కలెక్టర్ స్థాయి నోడల్ అధికారి వ్యవసాయ శాఖ, పౌరసరఫరాల శాఖ, జలవనరుల శాఖను సమన్వయం చేస్తారన్నారు. ఇలా అధికారులు, రైతుల మధ్య కూడా సమన్వయం లేకపోవడం వల్లే చిన్న సమస్య పెద్దగా తయారవుతోందన్నారు. ఆ నోడల్ ఆఫీసర్ ప్రతి సంవత్సరం నవంబర్  లేదా డిసెంబర్ నెలలో మిల్లర్లందరినీ కలిసి అవసరమైన వివరాలు సేకరిస్తారన్నారు.  
 
రబీ సీజన్ లో పండిన పంట ఇప్పటికీ గో డౌన్ లలో ఉండడం రైతుల సమస్యలకు ప్రధాన కారణమని మంత్రి మేకపాటి తెలిపారు. వేరే జిల్లాలలో పండిన పంట కూడా నెల్లూరులోనే ఉంచడం మరింత సంకటంగా మారిందన్నారు. మిల్లర్లు మిల్లులో ఆడించిన కొత్త ధాన్యం ఎక్కడ ఉంచాలో తెలియని పరిస్థితి ఇందువల్లే దాపురించిందన్నారు.

ఈ సమస్య నుంచి రైతన్నను బయటపడేసేందుకు ధాన్యం నిల్వల సామర్థ్యంలో 30 వేల టన్నులను వెంటనే ఇతర జిల్లాలకు పంపిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.  ప్రతి కో-ఆపరేటివ్ సొసైటీకి పంటను వర్షం నుంచి కాపాడుకునేలా పట్టాలు (వర్షం నుంచి కాపాడుకునేందుకు ధాన్యంపై కప్పేది) ఇస్తామన్నారు. గోదావరి జిల్లాలకు పంటను తరలించేందుకు సమాయత్తమైనట్లు పేర్కొన్నారు. 
 
అవగాహన లేకపోవడం వల్లే 'సంగం' రైతుల నిరసన : మంత్రి మేకపాటి  
భగవంతుని దయ, ముఖ్యమంత్రి మంచి మనసు వల్ల వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాయని మంత్రి మేకపాటి వ్యాఖ్యనించారు. భగవంతుడి దయ, ముఖ్యమంత్రి చర్యల వల్ల నీరు పుష్కలంగా అంది పంట దిగుబడి ఖరీఫ్ లో మరింత ఎక్కువగా వచ్చిందన్నారు.

వరద పెరిగిపోయి సోమశిల ప్రాజెక్టు నిండి నీరు విడుదల చేయడం వల్ల తన సొంత  ఆత్మకూరు నియోజకవర్గంలో పంట నీట మునిగినందన్నారు. సంగం, చేజర్ల, కోవూరు ప్రాంతాలలో పంట మునక తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. టెక్నాలజీ వినియోగించుకుంటూ శాటిలైట్ ఫోటోల ద్వారా పంట విస్తీర్ణం నీటమునక వివరాలు తెలుసుకున్నట్లు తెలిపారు.

సంగం రైతులు సమస్య పరిష్కారం అయ్యాక అవగాహన లేక నిరసన తెలిపి ఉంటారని మంత్రి మేకపాటి పేర్కొన్నారు. ఆ మండలంలో తన నివేదికల ఆధారంగా ఎక్కువ ధాన్యాన్ని సేకరించినా ఎవరో వారిని నిరసనకు పురిగొల్పి ఉండొచ్చునని మంత్రి అనుమానం వ్యక్తం చేశారు. రైతులను అరెస్ట్ చేస్తే చూస్తూ కూర్చొనే ప్రభుత్వం కాదని మంత్రి వెల్లడించారు.
 
కేంద్ర విపత్తు శాఖ ప్రతినిధుల బృందం పర్యటన అనంతరం పరిహారం : మంత్రి గౌతమ్ రెడ్డి
వర్షాలు, ప్రాజెక్టులు పొంగి పొరలుతున్న కారణంగా నీట మునిగిన పంటలను కేంద్ర విపత్తుశాఖ ప్రతినిధుల బృందం పరిశీలిస్తుందని మంత్రి మేకపాటి తెలిపారు. వారి పర్యటన కాగానే నివేదికల ఆధారంగా ప్రతి పంటకు నష్టపరిహారం అందిస్తారన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు మాట్లాడుతూ...రైతులకు పంట బీమా, ఇన్ పుట్ సబ్సిటీ, పంట నష్టాలకు పరిహారాలను  వర్తింపజేస్తామని కలెక్టర్ చక్రధర్ బాబు స్పష్టం చేశారు. రాబోయే సంవత్సరం ధాన్యం సేకరణ, కొనుగోలు వంటి అంశాలపై ముందుగానే సమాచారం తీసుకుని  అప్రమత్తంగా ఉంటామన్నారు.
 
 రైతులకు ఏ కష్టం రానీయం : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
నెల్లూరులో 3 రకాల ధాన్యం పండుతుందని అందులో నెల్లూరు- 3354 రకం పండించడం జిల్లాలో  ఇదే తొలిసారని మంత్రి మేకపాటి వెల్లడించారు. ఈ రకం కొత్త ధాన్యం వాతావరణ మార్పులకు తట్టుకోలేకపోతుందని , తద్వారా ఎక్కువ నష్టం కలుగుతోందని మంత్రి అన్నారు. అందుకే రైతాంగానికి నష్టం కలగని విధంగా నెల్లూరు- 3354 రకం మొత్తాన్ని ప్రభుత్వం కొంటుందని హామీ ఇచ్చారు.

ఇంకా పంట బీమానూ సైతం వర్తింపజేస్తామన్నారు. నెల్లూరు జిల్లాలో గత కొన్నేళ్లుగా పంటకోతల సమయంలో రైతులకు ఎంతో ఇబ్బంది కలుగుతుందన్న విషయం తనకు తెలుసన్నారు మంత్రి మేకపాటి.  ఇక మీదట ఏ విధమైన ఇబ్బంది లేకుండా, రాకుండా వ్యవస్థను గాడిన పెడతామని మంత్రి స్పష్టం చేశారు.  రైతులు సాఫీగా పండించిన పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకునేలా కొన్ని కీలక మార్గాలను అన్వేషించి, పరిశోధించి ముఖ్యమంత్రికి పంపినట్లు మంత్రి తెలిపారు.
 
ఉపరాష్ట్రపతికి కృతజ్ఞతలు, జిల్లా పార్టీ అధ్యక్షులు కాకానికి అభినందనలు : మంత్రి గౌతమ్ రెడ్డి
రైతుల మేలుకోసం  ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీసుకున్న చొరవకి మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి  ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. రైతాంగం పండించిన మరింత ధాన్యం సేకరణకు, ధాన్యం కొనుగోలుకు ఉపరాష్ట్రపతి ఎఫ్ సీఐతో మాట్లాడడం వల్ల గడువు పెంపుకు వెసులుబాటు కలిగిందన్నారు.

ధాన్య సేకరణకు మరో నెల గడువు పెంచడం, వాతావరణ సమస్యలు, వర్షాలను తట్టుకుని రైతుల చేతికి వచ్చిన ధాన్యం సేకరణలో నాణ్యత ప్రమాణాలను కూడా తగ్గించేలా ఉపరాష్ట్రపతి స్పందించడంతో రైతులకు మరింత మేలు జగరనుందని గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు.

ఈ సందర్భంగా రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన జిల్లా పార్టీ అధ్యక్షులు, సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డికి మంత్రి మేకపాటి  అభినందనలు తెలిపారు. జిల్లా నాయకులంతా ప్రజల సమస్యలపై ఏకమవ్వాలని మంత్రి మేకపాటి పిలుపునిచ్చారు. ఎలాంటి సమస్య వచ్చినా కలిసి చర్చించి వెంటనే పరిష్కరించుకోవాలని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కిరణ్ అబ్బవరం కొత్త సినిమా కెఎ10 టైటిల్ అనౌన్స్ మెంట్

సంబరాల ఏటిగట్టు లో వారియర్ గా సాయి దుర్గతేజ్

హరికథ కు స్పందనతో టీంకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన టీజీ విశ్వ ప్రసాద్

అల్లు అర్జున్ అరెస్టు సబబు కాదు : నటుడు సుమన్

లైలా చిత్రంలో అమ్మాయి పాత్రలో విశ్వక్సేన్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ట్రెండ్స్ సీజన్ క్లోజింగ్ సేల్, ప్రత్యేకమైన తగ్గింపు ఆఫర్‌లు

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments