అమరావతి నుంచి రాజధానిని తరలించవద్దంటూ రైతులు, మహిళలు చేపట్టిన నిరసనలు 279వ రోజుకు చేరుకున్నాయి.
మందడం, తుళ్లూరు, వెలగపూడి, వెంకటపాలెం, కృష్ణాయపాలెం, ఎర్రబాలెం, ఐనవోలు, ఉద్దండరాయని పాలెం, పెడపరిమి, దొండపాడు, నెలపాడు, ఆనంతవరం, నీరుకొండ తదితర గ్రామాల్లోని శిబిరాల్లో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి.
కరోనా సూచనలు పాటిస్తూ అమరావతి ఉద్యమం సాగుతోంది. అమరావతిని ఆదుకోవాలని ఆ ప్రాంత రైతులు, మహిళలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజధాని అమరావతిపై విషం చిమ్మితే పాలకులు చరిత్ర హీనులుగా మిగులుతారన్నారు.
భూములు ఇచ్చిన వారిపై ప్రభుత్వాలు కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాయని వాపోయారు. అధికారంలోకి వచ్చాక అమరావతిని అందనంత అభివృద్ధి చేస్తామన్న వైసీపీ నాయకులు అధఃపాతాళానికి తీసుకెళ్తున్నారన్నారు. అమరావతిని అభివృద్ధి చేస్తే రాష్ట్ర అభివృద్ధికి అనేక మార్గాలు దొరుకుతాయన్నారు.