Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైతులను ఇబ్బంది పెట్టేలా చర్యలు వద్దు: జగన్‌

Advertiesment
రైతులను ఇబ్బంది పెట్టేలా చర్యలు వద్దు: జగన్‌
, బుధవారం, 16 సెప్టెంబరు 2020 (21:26 IST)
రాష్ట్రంలో చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో సకాలంలో పూర్తి చేయాలని సీఎం  వైయస్‌ జగన్‌ ఆదేశించారు.ఆ క్రమంలో నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, అవుకు సొరంగం–2, పూల సుబ్బయ్య వెలిగొండ–హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు, వంశధార–నాగావళి లింక్, బీఆర్‌ఆర్‌ వంశధార ప్రాజెక్టు స్టేజ్‌–2 రెండో దశ, పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యం లేకుండా కొనసాగించాలని ఆయన నిర్దేశించారు. భారీ వర్షాలతో పొటెత్తుతున్న వరదనీటిని ఒడిసి పట్టాలని కోరారు.
 
రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల పనుల పురోగతిపై సీఎం వైయస్‌ జగన్‌ క్యాంప్‌ కార్యాలయంలో సమీక్షించారు. పోలవరం, ఉత్తరాంధ్రతో పాటు, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగుతున్న ప్రాజెక్టుల పనుల పురోగతిని అధికారులు సమావేశంలో వివరించారు.
 
నీరు నింపాలి:
చిత్రావతి బాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 10 టీఎంసీలు, గండికోట రిజర్వాయర్‌లో ఈ ఏడాది కచ్చితంగా కనీసం 23 టీఎంసీల నీరు నిల్వ చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారు. ఆ మేరకు వెంటనే ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీలు ఇవ్వాలన్న ఆయన, గత ప్రభుత్వం రైతులకు ఎకరాకు కేవలం రూ.6.75 లక్షల పరిహారం ఇస్తే, ఇప్పుడు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నామని ఆయన వెల్లడించారు.

అందువల్ల రైతులకు అవగాహన కల్పించాలని, వారికి నచ్చచెప్పాలని  కోరారు. ఆ రెండు ప్రాజెక్టుల్లో నీరు నిండితే వారికే ప్రయోజనం కలుగుతుందన్న విషయంపై రైతులకు వివరించాలని అన్నారు. 
 
ప్రాజెక్టుల పురోగతి:
ఈ ఏడాది నవంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ పనులు వేగంగా జరుగుతున్నాయన్న అధికారులు, వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలనుకున్న అవుకు–2వ సొరంగం పనులు కూడా కొనసాగుతున్నాయని తెలిపారు. అయితే మధ్యలో సీపేజీ వల్ల సొరంగంలో మట్టి చేరిందని వారు పేర్కొనడంతో, నిపుణుల కమిటీ సలహా ప్రకారం అవసరమైన పనులు చేపట్టి పనులు పూర్తి చేయాలని సీఎం వైయస్‌ జగన్‌ నిర్దేశించారు.
 
పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు:
ప్రకాశం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు హెడ్‌ రెగ్యులేటరీ పనులకు సంబంధించి, ఈ ప్రాజెక్టులో మొదటి సొరంగం పనులు ఇప్పటికే పూర్తి కాగా, రెండో సొరంగం పనులను వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు వివరించారు. ఈ సీజన్‌లో నల్లమల అడవుల్లో కొండలపై నుంచి నీరు పడుతుండడంతో పనుల్లో జాప్యం జరుగుతోందని వారు తెలిపారు.
 
ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు:
ప్రాధాన్యతా క్రమంలో ఉత్తరాంధ్రలో చేపట్టిన సాగు నీటి ప్రాజెక్టుల పనులు కూడా వేగంగా కొనసాగుతున్నాయని సమావేశంలో అధికారులు వెల్లడించారు.
 
వంశధార–నాగావళి:
ఇక ఈ ఏడాది డిసెంబరు నాటికి వంశధార–నాగావళి అనుసంధానం పూర్తయ్యేలా పనులు వేగంగా జరుగుతున్నాయని సమీక్షలో అధికారులు వెల్లడించారు. మొత్తం 33.5 కి.మీ కు గానూ ఇంకా 8.5 కి.మీ పనులు పూర్తి కావాల్సి ఉంది. ఆ పనులన్నీ ఈ ఏడాది డిసెంబరు చివరి నాటికి పూర్తి చేస్తామని వారు తెలిపారు.
 
బీఆర్‌ఆర్‌ వంశధార స్టేజ్‌–2:
ఈ ప్రాజెక్టుకు సంబంధించి రెండో దశ పనులు వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాగా, వంశధార, జంఝావతి ప్రాజెక్టుకు సంబంధించి అంతర్‌రాష్ట్ర జల వివాదాల పరిష్కారానికి, ఒడిషా సీఎంతో సమావేశానికి లేఖ రాయగా, ఇంకా సమాధానం రావాల్సి ఉందని సమీక్షా సమావేశంలో జల వనరుల శాఖ ఉన్నతాధికారులు చెప్పారు.
 
మహేంద్రతనయ రిజర్వాయర్‌:
శ్రీకాకుళం జిల్లాలో మహేంద్రతనయ నదిపై ఆఫ్‌షోర్‌ రిజర్వాయర్‌ పూర్తైతే నందిగాం, మెలియాపుట్టి, పలాస, టెక్కలి మండలాల్లోని 108 గ్రామాలకు ప్రయోజనం కలుగుతుందని, 24,600 ఎకరాలకు నీరందుతుందని సీఎం వైయస్‌ జగన్‌ తెలిపారు. 
 
ఈ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.850 కోట్లు కాగా, ఇప్పటికే దాదాపు రూ.350 కోట్లు ఖర్చు చేసినట్లు ఆయన చెప్పారు. దీన్ని కూడా ప్రయారిటీ కింద పూర్తి చేయాలని ఆదేశించారు.
 
తారకరామ తీర్థ సాగర్:
తారకరామ తీర్థసాగర్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్టును 2022 డిసెంబరు నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా ఆ మేరకు పనులు కొనసాగిస్తున్నట్లు అధికారులు చెప్పారు.
 
తోటపల్లి ప్రాజెక్టు:
సర్దార్‌ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్‌ ప్రాజెక్టులోడిస్ట్రిబ్యూటరీ పనులు పూర్తైతే కొత్తగా 55 వేల ఎకరాల ఆయకట్టు అందుబాటులోకి వస్తుందని వారు వివరించారు. ప్రాజెక్టులోభాగమైన గజపతినగరం బ్రాంచ్‌ కాల్వ పనులు 43 శాతం పూర్తి కాగా, మిగిలిన పనులు, భూసేకరణ కోసం రూ.139 కోట్లు వ్యయం చేయాల్సి ఉందని అధికారులు చెప్పారు. 
 
పోలవరం:
పోలవరం ప్రాజెక్టు హెడ్‌ వర్క్స్, కాలువలకు సంబంధించి 71 శాతం పనులు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాలన్న లక్ష్యంలో ఏ మార్పు లేదని, ఆ దిశలోనే పనులు కొనసాగుతున్నాయని వారు తెలిపారు.
 
ప్రాజెక్టు గేట్ల ఫ్యాబ్రికేషన్‌ ఇప్పటికే పూర్తయిందన్న అధికారులు, వచ్చే ఏడాది ఏప్రిల్‌ చివరి నాటికి మొత్తం 48 గేట్ల బిగిస్తామని చెప్పారు. కొంత మంది కార్మికులకు కోవిడ్‌ రావడం వల్ల స్పిల్‌ వే కాంక్రీట్‌ పనుల్లో కాస్త జాప్యం జరిగిందని వారు వివరించారు.
 
మానవతా దృక్పథం:
ప్రాజెక్టుల నిర్మాణంలో భూసేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీల్లో ఆయా కుటుంబాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని, ముఖ్యంగా రైతుల పట్ల పూర్తి మానవతా దృక్పథంతో వ్యవహరించాలని సీఎం వైయస్‌ జగన్‌ నిర్దేశించారు.
 
ఉద్యోగుల సర్దుబాటు:
జల వనరుల శాఖలో పనులు కొనసాగుతున్న చోట్ల అవసరాలను బట్టి, అందుబాటులో ఉన్న అధికారులు, సిబ్బందిని సర్దుబాటు చేసుకోవాలని, డ్యామ్‌లు, కాల్వలు, వాటర్‌ రెగ్యులేషన్‌కు అవసరమైన లష్కర్‌ను ఔట్‌ సోర్సింగ్‌ ద్వారా నియమించుకోవాలని సమావేశంలో నిర్ణయించారు.  అదే విధంగా డ్యామ్‌లకు అవసరమైన మెకానికల్, ఎలక్ట్రికల్‌ సిబ్బంది నియామకానికి సీఎం అనుమతి ఇచ్చారు.
 
సమీక్షా సమావేశంలో మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.నారాయణరెడ్డితో పాటు, ఆ శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు  పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

19 నుంచి శ్రీ‌వారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు