దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మహిళలకు సంబంధించిన రూ.27 వేల కోట్ల రుణాలు మాఫీ చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను మహిళలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని, రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రతీ పథకం మహిళా సాధికారత కోసమేనని డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణి అభిప్రాయపడ్డారు.
వైయస్సార్ ఆసరా పథకం అమలు చేసిన రోజు రాష్ట్రంలోని డ్వాక్రా మహిలలందరికీ ఈరోజు పండుగ రోజు అని శుక్రవారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. వైయస్సార్ ఆసరా పథకం అమలు చేయడం ద్వారా సీఎం జగన్ మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని చెప్పారు.
27 వేల కోట్ల రుణమాఫీ చేసిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదని తెలిపారు. డ్వాక్రా మహిళలకు రుణాలను మాఫీ చేస్తామని అన్న మాట ప్రకారం సీఎం జగన్ 4 విడతల్లో ఆ మొత్తాన్ని చెల్లిస్తున్నారని వివరించారు. కరోనా మహమ్మారి ప్రబలిన ఈ కష్టకాలంలో వైయస్సార్ ఆసరా పథకాన్ని అమలు చేసి 88 లక్షల మంది మహిళల నమ్మకాన్ని సీఎం నిలబెట్టారని కితాబిచ్చారు.
రూ.1400 కోట్ల సున్నా వడ్డీ నిధులిచ్చి డ్వాక్రా సంఘాలకు ఊపిరి పోశారని పుష్ప శ్రీవాణి ప్రస్తావించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ప్రతీ పథకం సీఎం జగన్ మహిళా సాధికారత కోసమే తెస్తున్నారని చెప్పారు. రాష్ట్ర చరిత్రలో ఎవ్వరూ సీఎం జగన్ లా మహిళల సంక్షేమం కోసం పథకాలు చేయలేదని అభిప్రాయపడ్డారు.
అమ్మ ఒడి, జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాలతో పిల్లలను చదివించుకునే అవకాశాన్ని మహిళలకిచ్చారన్నారు. దిశ చట్టం తో మహిళా రక్షణకు దేశానికే దిశా నిర్దేశం చేశారని,30 లక్షల ఇళ్ల పట్టాలతో దేశానికే ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు.
మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు ఇచ్చి సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త చరిత్ర సృష్టించారని వివరించారు. ప్రతీ మహిళను తన తోబుట్టువులా భావిస్తూ సీఎం జగన్ అండగా నిలుస్తున్నారని తెలిపారు. వైఎస్సార్ చేయూత తో మహిళల స్వయం ఉపాదికి అవకాశం కల్పించారని మహిళా సాధికారతకు ఊతమిచ్చారని పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు.