Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దేశ రాజకీయాలను జగన్ శాసించడం ఖాయం: మంత్రి ధర్మాన కృష్ణదాస్

Advertiesment
దేశ రాజకీయాలను జగన్ శాసించడం ఖాయం: మంత్రి ధర్మాన కృష్ణదాస్
, బుధవారం, 2 సెప్టెంబరు 2020 (18:54 IST)
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆశయ సాధనకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే ప్రజల మనస్సులను గెలుచుకున్న సీఎం వైఎస్ జగన్ త్వరలో దేశ రాజకీయాలను శాసిస్తారని జోస్యం పలికారు.

సచివాలయంలోని   పబ్లిసిటీ సెల్‌లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 11వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ప్రజలు కులాలు, మతాలు, వర్గాలకతీతంగా ఘన నివాళులర్పించారన్నారు. జనం మెచ్చిన జన నేతగా పేరొందిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేశారన్నారు.

ఆయన హయాంలో తాను రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేశానని ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ గుర్తు చేశారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రజారంజకమైన పాలన అందించారన్నారు. రైతులకు, కౌలు రైతులకు, పేదలకు లబ్ధి కలిగేలా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు. 104, 108, రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఫీజు రియింబర్స్ మెంట్, ఉచిత విద్యుత్ వంటి పథకాలు దేశంలోనే పేరుగాంచాయన్నారు.

ముఖ్యంగా వ్యవసాయాధారితమైన ఆంధ్రప్రదేశ్ లో సాగుకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తివంతమైన రాజకీయనేత అని కొనియాడారు.
 
వైఎస్ ఆశయ సాధనకు జగన్ కృషి...
తమలాంటి నేతలకు దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్ఫూర్తిగా నిలిచారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కొనియాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తన తండ్రి ఆశయ సాధనకు కృషి చేస్తున్నారన్నారు.

అధికారంలోకి వచ్చిన ఏడాదన్నర కాలంలోనే ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. కరోనా కష్ట కాలంలోనూ ఎన్నో సంక్షేమ పథకాలు ప్రజలకు అందించారన్నారు. మరెన్నో పథకాలకు రూపకల్పన చేస్తున్నారన్నారు. ముఖ్యంగా జాతీయ స్థాయిలో ప్రశంసలు పొందిన దిశ లాంటి చట్టాలను తీసుకొచ్చారన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా లక్షల సంఖ్యలో ఉద్యోగాలను కల్పించారన్నారు.

ఏడాదిన్నర కాలంలోనే దేశంలో అత్యంత సమర్థులైన ముఖ్యమంత్రుల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడో స్థానంలో నిలిచారన్నారు. రాబోయే కాలంలో దేశంలోనే అత్యంత సమర్థుడైన ముఖ్యమంత్రిగా మొదటి స్థానంలో జగన్ నిలవడం ఖాయమన్నారు. 
 
జీవితాంతం జగన్ వెంటే నడుస్తా....
పదవుల కేటాయింపుల్లో బీసీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యతిచ్చారని డిప్యూటీ ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. మహిళలకు కూడా పదవుల కేటాయింపులో 50 శాతం మేర అవకాశమిస్తున్నారన్నారు. ఇద్దరు బీసీ మంత్రులను రాజ్యసభకు పంపారన్నారు. వారి స్థానంలో మరో ఇద్దరు బీసీలకు మంత్రులుగా అవకాశమిచ్చారన్నారు.

వెనుబడిన కులానికి చెందిన తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి గౌరవమిచ్చారని, ఆయన రుణం తీర్చుకోలేనిదని ధర్మాన కృష్ణదాస్ కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీకాకుళం అభివృద్ధికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో కృషి చేశారన్నారు. ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి వెనుకబడిన జిల్లా శ్రీకాకుళం అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించారన్నారు.

మొదటి నుంచి సీఎం జగన్ వెంటే నడుస్తున్నానని, తన జీవితకాలం పదవుల్లో ఉన్నా, లేకున్నా, కార్యకర్తగానైనా ఆయన అడుగుజాడల్లోనే ముందుకు సాగుతానన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో రాష్ట్రం మరింత అభివృద్ధి చెందడం ఖాయమన్నారు. కొత్త జిల్లాల ఏర్పాటులో శ్రీకాకుళం జిల్లాకు ఎటువంటి నష్టమూ కలుగకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించుకుంటామని ధ‌ర్మాన కృష్ణదాస్ వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీ‌వారి ఆల‌యంలో ఏకాంతంగా పౌర్ణమి గరుడసేవ