గ్యాస్ ధరల పెంపుతో రాష్ట్ర ప్రజలపై మరోసారి పన్నుల భారం మోపేందుకు జగన్మోహనరెడ్డి సర్కార్ సిద్ధమైందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు.
ఈ మేరకు రామకృష్ణ ఒక ప్రకటన విడుదల చేశారు. గ్యాస్‌పై గతంలో 14.5 శాతం ఉన్న వ్యాట్ ను 24.5 శాతానికి పెంచుతూ ప్రజలపై మరోసారి రాష్ట్ర ప్రభుత్వం బాదుడుకు సిద్ధమైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు ఆర్థిక భారంగా మారిందని ప్రభుత్వం ఆ జీవోలో తెలిపింది.
కరోనా కారణంగా ఖజానాకు ఆదాయం తగ్గిపోవడంతో ట్యాక్స్ పెంచినట్లు పేర్కొంటూ ప్రజలపై రూ.1500 కోట్ల గ్యాస్ భారం మోపింది. ఇప్పటికే పెట్రో ఉత్పత్తులపై రాష్ట్ర ప్రభుత్వం దేశంలోనే అధికంగా వ్యాట్ వసూలు చేస్తోంది. డీజిల్ పై 22.5% వ్యాట్ తోపాటు అదనంగా మరో రు.4లు; ముడి చమురుపై 5%, పెట్రోలుపై 31% వ్యాట్ తోపాటు అదనంగా మరో రు. 4లు వసూలు చేస్తోంది.
కరోనా విపత్కర కాలంలో పెట్రో ఉత్పత్తుల పై దేశంలో ఎక్కడా లేని విధంగా ఎపి ప్రభుత్వం పన్నుల భారాన్ని పెంచింది. గ్యాస్ పై మరో 10% అదనంగా వ్యాట్ ను పెంచుతున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి ప్రభుత్వం అధికారంలోకొచ్చిన తదుపరి ఈ 15 నెలల కాలంలో దాదాపు రు.1 లక్ష కోట్లు అప్పులు చేసి కుటుంబానికి రు.80 వేల చొప్పున భారం మోపింది.
కరోనా విపత్కర కాలంలో అష్టకష్టాలు పడుతున్న ప్రజలను ఆదుకోవాల్సిన ప్రభుత్వం పన్నులు పెంచుతూ గుదిబండలు వేస్తున్నది. రాష్ట్రంలో అభివృద్ధిని అటకెక్కించి, కేవలం సంక్షేమ పథకాల కోసం అప్పు చేసి పప్పు కూడు' అన్న చందంగా జగన్మోహనరెడ్డి పాలన సాగిస్తున్నారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్, మద్యం, విద్యుత్, ఆర్టీసీ ధరలతో పాటు ఆఖరికి చెత్తపన్ను పెంచడం ద్వారా సుమారు రూ.60 వేల కోట్లకు పైబడిన భారాన్ని ప్రజలపై మోపడం దుర్మార్గం. ఒకచేత్తో ఇచ్చి రెండు చేతులతో లాక్కుంటున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ చర్యలను నిరసిస్తున్నాం. గ్యాస్‌పై పెంచిన వ్యాట్‌ను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తున్నాం.