Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టిఆర్ఎస్ నేతల ఆశీస్సులతోనే ఆక్రమణలు: సిపిఐ నారాయణ

టిఆర్ఎస్ నేతల ఆశీస్సులతోనే ఆక్రమణలు: సిపిఐ నారాయణ
, శుక్రవారం, 21 ఆగస్టు 2020 (11:33 IST)
వరంగల్ నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలతో కొట్టుకుపోయిన రోడ్లను, కబ్జాలకు గురైన నాలాలను, లోతట్టు ప్రాంతాల్లో గల పేదల కాలనీలను సిపిఐ రాష్ట్ర, జిల్లా నాయకులతో కలసి సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ సందర్శించారు.

అనంతరం హన్మకొండ బాలసముద్రంలోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వరంగల్ నగరంలో టిఆర్ఎస్ నేతల ఆశీస్సులతోనే నాలాలు,చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. 

నాలాలపై అక్రమ నిర్మాణాల వల్లే వరంగల్ కు ఈ పరిస్థితి ఏర్పడిందని, చాలా చోట్ల కబ్జాలకు పాల్పడిన వారు టిఆర్ఎస్ నాయకులేనన్నారు. వరంగల్ చుట్టు దాదాపు 40 చెరువులు మాయమయ్యాయని, ప్రభుత్వ భూమిని భూ ఆక్రమణదారుల నుండి కాపాడేందుకే పలుచోట్ల కమ్యూనిస్టు పార్టీలు పేదల కాలనీలు ఏర్పాటు చేశాయన్నారు.

పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆఘమేఘాలపై వరంగల్ కు తాత్కాలిక చర్యలు తీసుకుంటామంటే సరికాదని, తక్షణమే వరంగల్ కు వెయ్యి కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. వరదల కారణంగా నిరాశ్రయులైన వారికి కుటుంబానికి 10వేల ఆర్థిక సహాయం, బియ్యం అందించాలని కోరారు. 

రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే ముఖ్యమంత్రి కేటిఆరే అన్నట్లుగా ఉందని, సిఎం కేసిఆర్ ఇక విశ్రాంతి తీసుకుని పామ్ హౌస్ కు పరిమితమైన మంచిదని సూచించారు.యువకునిగా ఉన్న కేటీఆర్ కు సిఎం కుర్చీ అప్పగించి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

మరోవైపు రాష్ట్రంలో కోవిడ్ రోజు రోజుకు విజృంభించి ప్రజల ప్రాణాలను హరిస్తున్నదని, కోవిడ్ ను నివారించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యము వహించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. చివరకు రాష్ట్ర గవర్నర్ కూడా ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారంటే ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టమవుతున్నదన్నారు.

గవర్నర్ జోక్యం చేసుకోవడం తెలంగాణ ప్రజల ఆత్మాభిమానాన్ని దెబ్బ తీయడమేనని, దీనికి  ప్రభుత్వ అసమర్దతే కారణమన్నారు.ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్ సౌకర్యాలు కల్పించలేదని, దాంతో ప్రజలు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి లక్షలు దారపోస్తున్నారన్నారు. ప్రైవేట్ ఆసుపత్రులను కంట్రోల్ చేసే శక్తి ఈ ప్రభుత్వానికి లేదని అన్నారు.

మరోవైపు కోవిడ్ లెక్కలు ఎక్కువ చూపకుండ ప్రైవేట్ ల్యాబ్ లపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్న ఖాళీలు భర్తీ చేయాలని, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.

ఈ విలేఖరుల సమావేశంలో సిపిఐ  కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు, రైతు సంఘం రాష్ట్ర ప్రదాన కార్యదర్శి పశ్యపద్మ, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, జిల్లా కార్యదర్శి మేకల రవి, నగర కార్యదర్శి షేక్ బాష్ మియా, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలి వుల్లా ఖాద్రి, నాయకులు దండు లక్ష్మణ్, తోట బిక్షపతి, గుండెబద్రి. నరేష్ ద్రవిడ్. పద్మా నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీకి కేంద్రం అవార్డులు