వింత కోతిలా జగన్ వ్యవహారం: సీపీఐ నారాయణ

సోమవారం, 17 ఫిబ్రవరి 2020 (08:27 IST)
ఏపీ రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వింత కోతిలా వ్యవహరిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మండిపడ్డారు.

మూడు ముక్కల రాజధాని పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసానికి పాల్పడుతున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును నాశనం చేయడానికి, రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురిచేసే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.

తెలంగాణలోని మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో నిర్వహించిన లౌకికవాదుల మహగర్జన సభలో నారాయణ ప్రసంగించారు. రాష్ట్ర అభివృద్ధి ముసుగులో తనపై ఉన్న కేసుల మాఫీ కోసమే ఢిల్లీ పెద్దలను జగన్‌ కలుసుకుంటున్నాడని ఆయన విమర్శించారు. 
 
మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఈజీఎస్‌ పథకానికి 30శాతం నిధులు తగ్గించిందని, సాల్వెన్సీస్‌ సర్టిఫికెట్‌లతో పారిశ్రామికవేత్తలు తీసుకున్న రుణాలను ఎగ్గొట్టేందుకు అనుకూలంగా ఉగ్ర ఆర్థిక బడ్జెట్‌ను తీసుకొచ్చిందని ఆరోపించారు.

రాజ్యాంగానికి వ్యతిరేకంగా సీఏఏ, ఎన్‌పీఆర్‌, ఎన్‌ఆర్‌సీ చట్టాలను తీసుకొస్తున్న నరేంద్రమోదీ, అమిత్‌షాలే దేశద్రోహులని నారాయణ అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం తిరుమలలో లైట్‌మెట్రో?