న్యూఢిల్లీ: రాజధాని నిర్మిస్తామని పిల్లల నుంచి వసూలు చేసిన చందాలు, ఇటుకలు ఏమయ్యాయని వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగాం సురేష్ చంద్రబాబును ప్రశ్నించారు. రాజధాని నిర్మాణం మాటున టీడీపీ భారీ భూకుంభకోణం చేసిందని ఆయన విమర్శించారు. రాజధాని మాటున బాబు బినామీలు భారీగా భూములు కొనుగోలు చేశారన్నారు.
న్యూఢిల్లీలో బుధవారం నందిగాం సురేష్ మీడియాతో మాట్లాడారు. తాత్కాలిక భవన నిర్మాణాలతో ఎక్కువ కమీషన్లు తీసుకోవచ్చని చంద్రబాబు భావించి అడ్డగోలుగా దోచుకున్నారని, అలాంటి అమరావతిలో మళ్లీ ఏ ముఖం పెట్టుకొని పరేడ్ చేస్తారని ప్రశ్నించారు. పర్మినెంట్ అంటే లెక్కలు చూపించాల్సి వస్తుందని తమ్ముళ్ల భయంతో తాత్కాలిక నిర్మాణాలు చేపట్టారన్నారు.
రాజధాని ప్రాంతంలో రెండే రెండు బిల్డింగ్‌లు కట్టారని, ఒకటి హైకోర్టు, తాత్కాలిక సచివాలయమన్నారు. చిన్న వర్షం కురిస్తే చాలు కారుతుందని, పెంకులు లేచిపోతున్నాయన్నారు.
శంకుస్థాపనకు లక్షల ఇటుకలు ఇచ్చారని, ఆ ఇటుకలు ఏమయ్యాయో తెలియదన్నారు. విద్యార్థులతో రూ.10 చొప్పున చందాలు వసూలు చేశారని, ఆ డబ్బులు ఏం చేశారో అర్థం కావడం లేదన్నారు. టీడీపీ నేతలు ఇప్పుడేమో రూ.9 వేల కోట్లు రాజధానికి ఖర్చు చేశామని చెబుతున్నారు. ఆ డబ్బులకు మాత్రం లెక్క చెప్పడం లేదన్నారు.
చంద్రబాబు 40 ఏళ్ల అనుభవమంతా కూడా కుట్రలు, మోసాలే అన్నారు. చంద్రబాబు అమరావతిలో పరేడ్ చేసేందుకు అనర్హులు అన్నారు. ఇష్టానుసారంగా పాలన చేసి ప్రజాధనాన్ని దోచుకున్నారన్నారు. ప్రతిపక్ష నేతగా హుందాగా వ్యవహరించి, రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటునందించాలని సూచించారు.
రాజధాని ఎలా నిర్మించాలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి తెలుసని అన్నారు.
మీలాంటి వ్యక్తితో చెప్పించుకోవాల్సిన అవసరం లేదన్నారు. వైఎస్ జగన్ విషయంలో ఎన్ని కుట్రలు పన్నినా కూడా ఏమీ చేయలేరన్నారు. వైఎస్ జగన్‌పై నమ్మకంతో ప్రజలు 151 సీట్లు ఇచ్చారన్నారు. చంద్రబాబు లేనిపోని ఆరోపణలు మాని, ప్రజలకు మేలు జరిగే విధంగా పని చేయాలని సూచించారు.
దళితులకు ప్యాకేజీ ఇచ్చే విషయంలో 1400 గజాలు ఇచ్చారని, మీ బినామీల భూములు కొనుగోలు చేసిన తరువాత ఫూలింగ్ విధానం నుంచి తప్పించారన్నారు. చంద్రబాబుకు వయసు పెరిగే కొద్ది చాదస్తం పెరుగుతుందని దుయ్యబట్టారు. చంద్రబాబు మాటల మాంత్రికుడని, మాటలతోనే ప్రజలను భ్రమల్లోకి నెట్టారన్నారు. ఆయన అమరావతిలో చేసింది ఏమీ లేదన్నారు.
బోండా ఉమా అసెంబ్లీలో ఎలా మాట్లాడారో ప్రజలందరికీ తెలుసని అన్నారు. ఆయన అమరావతిలో ఏమీ చూడలేదని, చంద్రబాబుకు బ్యాండ్ మేళం ఊదాలి కాబట్టి ఉమా మాట్లాడుతున్నారన్నారు.
రాజధాని విషయంలో బాబులాగా మాటలు చెప్పకుండా చేతల్లో చూపిస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని కచ్చితంగా చేపడుతుందని, అయితే చంద్రబాబు మాదిరిగా వేల కోట్లు వృథా చేయమని స్పష్టం చేశారు.