ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాపు రిజర్వేషన్ అంశం ఎల్లపుడూ హాట్ టాపిక్‌గానే ఉంటుంది. కావు సామాజిక వర్గం ప్రజలకు ప్రత్యేక రిజర్వేషన్లను అమలు చేయాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. తాజాగా బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మరోమారు రాజ్యసభలో కాపు రిజర్వేషన్ అంశాన్ని ప్రస్తావించారు. కాపులకు ఓబీసీ రిజర్వేషన్లను తక్షణం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఏపీలో కాపు సామాజిక వర్గ ప్రజలు, ఆర్థికంగా, విద్యాపరంగా, సమాజికంగా వెనుకబడివున్నారని, మూడు దశాబ్దాలుగా తమకు న్యాయం జరగాలని కాపులు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారని గుర్తుచేశారు. దీంతో కావు రిజర్వేషన్ బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో పాస్ చేసినప్పటికీ రిజర్వేషన్లు మాత్రం రాష్ట్రంలో ఇప్పటికీ అమలు కాలేదని, కానీ నిందను మాత్రం కేంద్రంపై నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇప్పటికైన ఏపీలో కాపులకు రిజర్వేషన్లను అమలు చేయాలని ఆయన కోరారు.