ఏపీలోని అధికార వైకాపాకు బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు కొత్త అర్థం చెప్పారు. వైకాపా అంటే "యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ" కాదని "ఏమీ చేతకాని ప్రభుత్వం" అంటూ కొత్త భాష్యం చెప్పారు. ఆర్థిక వైఫల్యం అనే అంశంపై ఎవరైన పరిశోధన చేయాల్సి వస్తే అందుకు ఏపీనే సరైన రాష్ట్రం అని వ్యాఖ్యానించారు. తాజాగా వన్ టైమ్ సెటిల్‌మెంట్ పేరుతో కొత్త దోపిడీకి శ్రీకారం చుట్టిందని జీవీఎల్ ఆరోపించారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, కేంద్ర పథకాలు అమలు చేయాల్సివస్తే కేంద్ర రాష్ట్రాలు రెండూ నిధులు విడుదల చేయాల్సివుంటుందన్నారు. కానీ, కేంద్రం నిధులను విడుదల చేసినప్పటికీ రాష్ట్రం నుంచి పైసా విడుదల కావడం లేదన్నారు. దాంతో కేంద్రం నిధులు కూడా ఆగిపోయాయని, వైకాపా అసమర్థతతో అభివృద్ధికి ఏపీ ఆమడదూరంలో నిలిచిందన్నారు.