తిరుపతి పట్టణంలోని లీలామహల్ సమీపంలో దారుణం జరిగింది. కొందరు కిరాతకులు ఓ కుక్కను అతి కిరాతకంగా చంపేసారు. కుక్క తల నరికి చంపేశారు. ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కుక్కను చంపిన వారిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన కుక్క యజమానురాలికి పోలీసుల నుంచి మరో అవమానం ఎదురైంది. కుక్క తండ్రి ఎవరు అంటూ హేళనగా మాట్లాడారు. మనుషులను చంపితేనే దిక్కులేదు.. ఇక కుక్కను చంపితే ఏంటి అంటూ ఖాకీలు ప్రశ్నించారు. దీంతో కుక్క యజమాని బోరున విలపిస్తూ మీడియాతో మాట్లాడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పక్కింటి పెంపుడు కుక్క అరుస్తుందన కారణంతో ఇద్దరు యువకులు పైశాచికంగా ప్రవర్తించారు. ఆ కుక్కను కత్తితో పొడిచి, తల తెగనరికి చంపేశారు. ఇంటి ముందు రాళ్లు విసురుకుంటే కుక్క అరిచింది. కోపంతో కుక్కను కత్తితో పొడిచి, తల నరికి కిరాతకులు చంపేశారు. తిరుపతిలోని లీలామహల్ సమీపంలో చేపల మార్కెట్ వద్ద ఘటన చోటు చేసుకుంది.
దీనిపై ఫిర్యాదు చేసేందుకు వెళ్తే పోలీసులు ఎగతాళి చేశారని కుక్క యజమాని లావణ్య ఆరోపించారు. కుక్క తండ్రి ఎవరు..? మనుషులను చంపితేనే దిక్కులేదు.. కుక్కను చంపడమేంటి అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని పేర్కొన్నారు. గత నాలుగేళ్లుగా ఎంతో అల్లారుముద్దుగా తమ కుక్కను పెంచుకున్నామని లావణ్య తీవ్ర మనోవేదనతో అన్నారు.