Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫెంజల్ తుపాను: కడపలో ఫ్లాష్ ఫ్లడ్స్ హెచ్చరిక, తిరుపతి నుంచి వెళ్లాల్సిన 4 విమానాలు రద్దు

cyclone

బిబిసి

, శనివారం, 30 నవంబరు 2024 (13:18 IST)
ఫెంజల్ తుపాను కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ రావొచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తిరుపతి ఎయిర్‌పోర్ట్ నుంచి రాకపోకలు సాగించే విమాన సర్వీసులపై తుపాను ప్రభావం పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శుక్రవారం మధ్యాహ్నానికి 13 కిలోమీటర్ల వేగంతో కదులుతూ 'ఫెంజల్‌' తుపానుగా బలపడింది. శనివారం తెల్లవారుజాము నుంచి గంటకు 7 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయువ్య దిశగా కదులుతున్న ఈ తుపాను శనివారం మధ్యాహ్నానికి, లేదా సాయంత్రానికి పుదుచ్చేరి సమీపంలోని కారైకల్- మహాబలిపురం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
 
ప్రస్తుతం పుదుచ్చేరికి 180 కి.మీ, చెన్నైకి 190 కి.మీ. దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని దక్షిణ కోస్తాతో పాటు, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది. కొన్నిచోట్ల ఫ్లాష్‌ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. మిగిలినచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది.
 
ఏయే జిల్లాల్లో..
తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోణంకి కూర్మనాథ్‌ బీబీసీతో చెప్పారు. ప్రకాశం జిల్లా తీరం వెంబడి 70-90 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని కడప జిల్లాలో ఫ్లాష్‌ ఫ్లడ్స్‌కు అవకాశం ఉందని వెల్లడించారు.
 
కృష్ణపట్నం పోర్టులో డేంజర్‌ సిగ్నల్‌- 6
ఫెంజల్‌ తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని పోర్టులనూ అధికారులు అప్రమత్తం చేశారు. కృష్ణపట్నం పోర్టులో డేంజర్‌ 6వ నంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేయగా.. గంగవరం, విశాఖపట్నం, మచిలీపట్నం నిజాంపట్నం, కాకినాడ పోర్టుల్లో ‘డిస్టెన్స్‌ వార్నింగ్‌ సిగ్నల్‌’ 2 జారీ చేశారు. కళింగపట్నం, భీమునిపట్నం పోర్టుల్లో అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు
 
మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు..
తుపాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, ఆదివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలలు మూడు మీటర్ల వరకూ ఎగసిపడే అవకాశం ఉన్నందున సందర్శకులు సముద్ర తీరానికి వెళ్లొద్దని సూచించారు. దక్షిణ కోస్తాలో తీరం వెంబడి గంటకు 80 కిలోమీటర్ల వేగంతోనూ, ఉత్తర కోస్తాలో 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని తెలిపారు. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్‌ సూచించారు.
 
తిరుపతిలో విమాన సర్వీసులు రద్దు
తుపాను కారణంగా తిరుపతి జిల్లాలో శుక్రవారి రాత్రి నుంచి ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. తిరుపతి ఎయిర్‌పోర్టులో 4 విమాన సర్వీసులు రద్దు చేశారు. ఇక్కడి నుంచి హైదరాబాద్, విశాఖ, బెంగళూరు వెళ్లాల్సిన 4 విమానాలను విమానాలను ఎయిర్ లైన్స్ రద్దు చేసింది.
 
తమిళనాడులో రెడ్ అలర్ట్
ఫెంజల్ తుపాను తీరం దాటనుండడంతో తమిళనాడులో రెడ్ అలర్ట్ ప్రకటించారు. చెన్నై, తిరువళ్లూర్, కాంచీపురం, చెంగల్పట్లు, విల్లుపురం, కడలూర్, కళ్లకురిచ్చి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాల్లో 21 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు తెలిపారు. తుపాను పశ్చిమ, వాయువ్య దిశగా పయనించి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరందాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఫెంజల్ తుపాను కారణంగా చెన్నై, తిరువళ్లూర్, కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం, కళ్లకురిచ్చి, కడలూర్ జిల్లాలతో పాటు పుదువాయిలోని కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నైలోని జోనల్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. దీంతో చెన్నై సహా తిరువళ్లూర్, కాంచీపురం, చెంగల్పట్లు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అదానీ కంపెనీలో ఒప్పందాలు జగన్‌కు తెలియవా? పురంధేశ్వరి ప్రశ్న