Webdunia - Bharat's app for daily news and videos

Install App

పేదరికం నుంచి బయటపడాలంటే గొప్పచదువులు ఒక్కటే మార్గం : జగన్‌

Webdunia
శనివారం, 14 డిశెంబరు 2019 (10:25 IST)
పాఠశాల విద్యతో మొదలు పెట్టి, ఉన్నత విద్యా రంగంలోనూ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. ఉద్యోగ, ఉపాధ కల్పనకు దోహదపడేలా ఉన్నత విద్యా కోర్సులలో మార్పు చేస్తామని ఆయన ప్రకటించారు.

ప్రతి డిగ్రీని హానర్స్‌ డిగ్రీగా మార్చడంతో పాటు, ఒక ఏడాది తప్పనిసరిగా శిక్షణనిస్తామని తెలిపారు. ఆ విధంగా సాధారణ డిగ్రీ కోర్సులు నాలుగేళ్లు, ఇంజనీరింగ్‌ డిగ్రీ కోర్సులు 5 ఏళ్లు ఉంటాయని చెప్పారు. అదే విధంగా కరికులమ్‌లోనూ అవసరమైన మార్పులు చేస్తామని అన్నారు.

వీటన్నింటి ద్వారా నిరుద్యోగ సమస్యను పరిష్కరించవచ్చని, ఆ దిశలో ప్రభుత్వం చురుకుగా పరిశీలిస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఈ కార్యక్రమం జరిగింది.
 
‘ఏయూ’ ది ఘన చరిత్ర
సర్‌ సీఆర్‌ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన ఆంధ్ర విశ్వవిద్యాలయం ఒక్క రాష్ట్రమే కాకుండా, దేశం, ప్రపంచంలోనే గొప్ప మేధావులను అందించిందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ గుర్తు చేశారు. అక్కడ చదువుకున్న వారిలో మన దగ్గరే ఎందరో మహానుభావులున్నారంటూ ప్రముఖ పారిశ్రామికవేత్త గ్రంథి మల్లికార్జునరావును ఉదహరించారు. దేశంలో పేరెన్నికగన్న పారిశ్రామికవేత్తల్లో ఆయన ఒకరన్న సీఎం, ఇంకా ఎందరో గొప్ప వ్యక్తులను ఆంధ్రా యూనివర్సిటీ అందించిందని చెప్పారు.
 
ఎంత చెప్పినా తక్కువే
ఇదే యూనివర్సిటీ వీసీలుగా గొప్ప గొప్ప వ్యక్తులను చూశామన్న సీఎం, భారత రాష్ట్రపతి అయిన డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్, ప్రొఫెసర్‌ కట్టమంచి రామలింగారెడ్డి, ప్రొఫెసర్‌ శ్రీనివాస అయ్యంగార్‌ వంటి ఎందరో గొప్ప వ్యక్తులు ఈ యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్లుగా పని చేశారని గుర్తు చేశారు. అలాంటి గొప్ప చరిత్ర ఈ ఆంధ్ర యూనివర్సిటీకి ఉందని, అందుకే యూనివర్సిటీ గొప్పతనం, చరిత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని అన్నారు.
 
ఆంధ్ర రాష్ట్రానికే ఇది ఒక గర్వకారణం అన్న ఆయన, దేశంలోని అత్యుత్తమ 5 యూనివర్సిటీల్లో ఒకటిగా ఎదిగే సామర్థ్యం ఆంధ్రా  యూనివర్సిటీకి ఉందని చెప్పారు. కానీ మనం 14వ స్థానంలో ఉన్నామని, అసలు ఎందుకీ పరిస్థితి అని ప్రస్తావించారు. మనకు టాప్‌ ఫైవ్‌లో ఉండే సామర్థ్యం లేదా? ఇంత గొప్ప యూనివర్సిటీగా ఉన్న మనం ఎందుకు ఆ గమ్యం చేరుకోలేక పోతున్నామని ప్రశ్నించారు.
 
ఇన్ని ఖాళీలా?
ఆంధ్ర యూనివర్సిటీలో 459 అధ్యాపక ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్న సీఎం వైయస్‌ జగన్, ఇదీ ఈ వర్సిటీ దుస్థితి అని ఆవేదన వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వచ్చి కేవలం 6 నెలలే అయిందని గుర్తు చేసిన సీఎం, దేశానికే గర్వకారణమైన ఈ యూనివర్సిటీలో ఈ పరిస్థితిపై ప్రభుత్వంగా తల దించుకోవాలని అన్నారు. ఇవన్నీ కూడా మార్పులు జరగాలని ఆకాంక్షించారు.
 
బ్రిక్స్‌లో మనం ఎక్కడ?
‘మనం బ్రిక్స్‌ దేశాలతో పోల్చుకుంటాం. బ్రిక్స్‌ అంటే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా. ఈ దేశాలన్నింటిదీ దాదాపు ఒకే విధమైన ఆర్థిక వ్యవస్థ. మన దేశం మాదిరిగానే వాటివి కూడా ఒకే విధమైన ఆర్థిక పరిస్థితి. అందుకే ఆయా దేశాలతో పోల్చుకుంటాం. ఇక్కడ గ్రాస్‌ ఎన్‌రోల్‌మెంట్‌ నిష్పత్తి (జీఈఆర్‌) చూస్తే..జీఈఆర్‌ అంటే.. 18 నుంచి 23 ఏళ్ల వయసులో ఉన్న పిల్లలు ఎందరు కాలేజీలకు వెళ్తున్నారు?

ఎంత మంది కళాశాలల్లో చేరుతున్నారు? అన్నది జీఈఆర్‌. ఇందులో బ్రెజిల్‌లో 51 శాతం ఉంటే, రష్యాలో 80 శాతం, చైనా 48 శాతం ఉంటే, భారత్‌లో కేవలం 23 శాతం మాత్రమే ఉంది. అంటే మన పిల్లల్లో 77 శాతం ఇంటర్‌ తర్వాత చదవడం లేదు. ఇది మన పిల్లల దుస్థితి’ అని సీఎం పేర్కొన్నారు. 
 
భావి తరానికి ఇవ్వగలిగిన ఆస్తి
‘నేను ఇంతకు ముందు చెప్పాను. ఒక దీపం ఒక గదికి వెలుగు ఇస్తుంది. కానీ ఒక చదువుల దీపం ఒక కుటుంబం రూపురేఖలే మార్చేస్తుంది. భావి తరానికి మనం ఇవ్వగలిగిన ఆస్తి ఏదైనా ఉందంటే అది చదువులు మాత్రమే. చదువు ఉంటేనే ఒక కుటుంబం దారిద్య్ర రేఖ దిగువ నుంచి ఎదుగుతుంది. ఆ కుటుంబం నుంచి ఒక్కరైనా ఇంజనీర్, డాక్టర్‌ కాగలిగితే ఆ కుటుంబం రూపురేఖలు మారిపోతాయి’ అని ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌ స్పష్టం చేశారు.
 
ఆయనే ఒక ఉదాహరణ
ఈ సందర్భంగా విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ను ప్రస్తావించిన సీఎం, ఆయన మన కళ్ల ఎదుటే కనిపిస్తున్నారని చెప్పారు. దళితుడైన విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ఒక ఐఆర్‌ఎస్‌ అధికారి అని గుర్తు చేశారు. ఆయనను విద్యా మంత్రిగా చేయడానికి కారణం, ఆయన ఒక జీవితం చూశాడని చెప్పారు. 7వ తరగతి వరకు ఆయన తెలుగు మీడియమ్‌లో చదివారని, ఆ తర్వాత ఇంగ్లిష్‌ మీడియమ్‌కు మారారని, అందుకే ఆ స్థాయికి ఎదిగారని అన్నారు. 
 
విద్యా వ్యవస్థలో మార్పులు
‘మన విద్యా వ్యవస్థలో చాలా మార్పులు తీసుకురావాలని చెప్పి కలలు కన్నాం. అది లేకపోతే సాధించలేము. విద్యా వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలనుకుంటున్నాము. ప్రతి అడుగు ఆ దిశలోనే వేస్తున్నాం. అందుకే మొట్టమొదటగా ప్రభుత్వ పాఠశాలలపై దృష్టి పెట్టాము. మేము అధికారంలోకి వచ్చి 6 నెలలే అయింది. రాష్ట్రంలో 45 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వాటిలో ఏ మాత్రం కనీస సదుపాయాలు లేవు. ఒక్క వసతి కూడా సక్రమంగా లేదు. అందుకే వాటిని మార్చడంతో మొదలు పెడుతున్నాము.

నాడు–నేడు అన్న కార్యక్రమం చేపట్టాము’.
‘బాత్‌రూమ్‌లు, మంచినీరు, ప్రహరీ, ఫ్యాన్లు, లైట్లు, పెయింటింగ్, ఇంగ్లిష్‌ ల్యాబ్‌ వంటి 9 రకాల సదుపాయాలు కల్పిస్తున్నాము. తొలి దశలో 15 వేలకు పైగా స్కూళ్లను సమగ్రంగా మార్చబోతున్నాము. ఇందుకోసం దాదాపు రూ.3600 కోట్లు ఖర్చు చేస్తున్నాము. మూడు దశల్లో అన్ని 45 వేల స్కూళ్లను మార్చడానికి దాదాపు 12 వేల కోట్ల

రూపాయలు ఖర్చవుతాయని అంచనా’. 
‘నాడు–నేడులో భాగంగా ప్రతి స్కూల్‌ ప్రస్తుత పరిస్థితి ఫోటో తీస్తాము. వాటిలో సదుపాయాలు కల్పించాక మళ్లీ ఫోటో తీస్తాము. రెండింటినీ చూపి ఆ స్కూల్‌లో ఎలాంటి మార్పు తీసుకువచ్చామన్నది వివరిస్తాము’ అని సీఎం వివరించారు.
 
ఇంగ్లిష్‌ మీడియమ్‌
అదే విధంగా వచ్చే ఏడాది జూన్‌ నుంచి 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియమ్‌ ప్రవేశపెడుతున్నామని, ఆ మరుసటి ఏడాది 7వ తరగతి, ఆ తర్వాత 8వ తరగతి, అనంతరం 9వ తరగతి, ఆ తర్వాత 10వ తరగతిలోనూ ఇంగ్లిష్‌ మీడియమ్‌ ప్రవేశపెడతామని ముఖ్యమంత్రి చెప్పారు. ఆ విధంగా వచ్చే 4 ఏళ్లలో అన్ని స్కూళ్లలో కేవలం ఇంగ్లిష్‌ మీడియమ్‌ మాత్రమే ఉంటుందని, 4 ఏళ్లలో మన పిల్లలు 10వ తరగతి బోర్డు పరీక్ష ఇంగ్లిష్‌ మీడియమ్‌లో రాస్తారని తెలిపారు.
 
ఈ ప్రక్రియలో సవాళ్లు కూడా ఉన్నాయన్న సీఎం, అందుకే ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమాలు, పిల్లలకు బ్రిడ్జి కోర్సులు, కరికులమ్‌లో మార్పులు చేస్తున్నామని, ఆ విధంగా విప్లవాత్మకమైన మార్పులు రాబోతున్నాయని వివరించారు.
 
ఉన్నత విద్యా రంగం
‘ఇక ఆ తర్వాత ఉన్నత విద్యా రంగం. ఇవాళ అవి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఉన్నాయా? అన్నది ఆలోచించాలి. అందుకే ఏ కోర్సు చదివినా, ఆ తర్వాత ఉద్యోగం వచ్చే మాదిరిగా ఉండాలి. ప్రతి కోర్సు ఒక జాబ్‌ ఓరియెంట్‌గా ఉండాలి. ఇందులో భాగంగా నేను చెప్పాను. డిగ్రీ మూడేళ్లు కాకుండా నాలుగేళ్లు పెడితే ఏమవుతుంది. నాలుగో ఏడాది అప్రెంటిస్‌షిప్‌ పెట్టి, తగిన శిక్షణ ఇచ్చి, ఆ డిగ్రీని హానర్స్‌గా మార్చవచ్చు కదా.

అప్పుడు బికామ్‌ బదులు బికామ్‌ హానర్స్‌ అవుతుంది. ఆ విధంగా ఒక ఏడాది కోర్సు తీసుకురావాలని ఆలోచన. ఇంజనీరింగ్‌లోనూ అదే విధంగా బీఈ హానర్స్‌. 5 ఏళ్లు ఆ కోర్సు చేయాలని యోచిస్తున్నాము. ఆ విధంగా మార్పులు చేయబోతున్నాము’ అని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ వివరించారు.
 
విద్యా దీవెన
అదే విధంగా విద్యార్థులు బాగా చదువుకునేలా పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేయడంతో పాటు, ఆ విద్యార్థులకు హాస్టల్, మెస్‌ ఛార్జీల కింద ‘విద్యా దీవెన’ కింద ఏటా రెండు దఫాల్లో ఏటా రూ.20 వేలు ఇవ్వబోతున్నామని వెల్లడించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి విద్యను ఒక ఆస్తిగా ఇచ్చే విధంగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
 
పూర్వ విద్యార్థులు–పాత్ర
వీటన్నింటి సాధనలో పూర్వ విద్యార్థుల పాత్ర ఎంతో గొప్పదన్న సీఎం, కొందరు జీఎంఆర్‌ మాదిరిగా అత్యున్నత స్థాయిలో ఉన్నారని,  ఇంకా ఎందరో ఎక్కడెక్కడో చక్కగా స్థిరపడ్డారని గుర్తు చేశారు. ‘మీకు మీ ఉద్యోగంతో పాటు, జీవితంలో స్థిర పడడానికి ఈ కోర్సులు ఏ విధంగా ఉపయోగపడ్డాయన్నది ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఏం చేస్తే అది సాధ్యమవుతుందన్నది కూడా యోచించండి.

పూర్వ విద్యార్థుల బోర్డు అన్నది ఇప్పటి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఉండాలి. అదే విధంగా కరికులమ్‌లో ఏ మార్పు చేస్తే పిల్లలకు మేలు జరుగుతుంది? వారికి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్న దానిపై సూచనలు, సలహాలు ఇవ్వాలని కోరుతున్నాను’ అని సీఎం పేర్కొన్నారు.
 
ఇది స్థిరంగా జరగాలని జీఎంఆర్‌ కోరారని, ప్రభుత్వం రూ.50 కోట్లు ఇస్తే, తాము మరో రూ.50 కోట్లు సేకరిస్తామని ఆయన చెప్పారని ముఖ్యమంత్రి తెలిపారు. ఇందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్న సీఎం శ్రీ వైయస్‌ జగన్, వాళ్ల తరుపు నుంచి రూ.50 కోట్లు సిద్ధం చేసుకుని వస్తే, నెల రోజుల్లో ప్రభుత్వం తన వాటా ఇస్తుందని వివరించారు.
 
మంత్రులు కురసాల కన్నబాబు, ఆదిమూలపు సురేష్‌తో పాటు, పలువురు పారిశ్రామికవేత్తలు, విద్యావేత్తలు, వర్సిటీ అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కాంటెస్ట్ ద్వారా డ్రింకర్ సాయి 31న మంచి పార్టీ ఇస్తాడు

నింద చిత్రానికి అంతర్జాతీయ స్ట్రీమింగ్ కి ఆమోదం

మ్యాడ్ స్క్వేర్ చిత్రం నుండి స్వాతి రెడ్డి.. గీతం విడుదల

అమెరికా, ఆస్ట్రేలియా లో కూడా రిలీజ్ కాబోతున్న పా.. పా.. మూవీ

ట్రెండింగ్‌లో సంక్రాంతికి వస్తున్నాం.. వెంకీ ఫన్నీ వీడియో వైరల్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలోవెరా-ఉసిరి రసం ఉదయాన్నే తాగితే?

steps to control diabetes మధుమేహం అదుపుకి జాగ్రత్తలు ఇవే

తెలుగు పారిశ్రామికవేత్త శ్రీ మోటపర్తి శివ రామ వర ప్రసాద్ ప్రయాణాన్ని అందంగా వివరించిన “అమీబా”

Herbal Tea హెర్బల్ టీ హెల్త్ బెనిఫిట్స్

winter heart attack చలికాలంలో గుండెపోటుకి కారణాలు, అడ్డుకునే మార్గాలు

తర్వాతి కథనం
Show comments