Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మసీదులు, గురుద్వారాల్లో ఇలానే ప్రవర్తిస్తాడా?: జగన్‌ పై వ‌ర్ల ఆగ్రహం

మసీదులు, గురుద్వారాల్లో ఇలానే ప్రవర్తిస్తాడా?: జగన్‌ పై వ‌ర్ల ఆగ్రహం
, శుక్రవారం, 22 నవంబరు 2019 (08:03 IST)
ప్రపంచవ్యాప్తంగా ప్రాశస్త్యమైన, పవిత్రమైన తిరుమల వేంకటేశ్వరస్వామివారి దర్శనానికి వెళ్లి, డిక్లరేషన్‌ ఇవ్వకుండా, ఆలయ సాంప్రదాయాలను మంటగలిపిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వైఖరిని సమర్థిస్తూ, మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలను చూసి రాష్ట్ర ప్రజలంతా అసహ్యంతో ఈసడించుకుంటున్నారని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య మండిపడ్డారు.

ఆయన గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ వేమూరి ఆనంద్‌ సూర్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. కొడాలి నాని ఎలాంటి వ్యక్తో, అతని ప్రవర్తనేమిటో తెలుసుకోకుండా మంత్రిపదవి ఇచ్చిన జగన్‌, తిరుమల ఆలయం గురించి మంత్రి హోదాలో నాని వాడిన బూతు పురాణంపై ఎందుకు స్పందించడం లేదని రామయ్య నిలదీశారు.

తన కేబినెట్‌ సహచరుల్ని ఎంచుకోవడంలో ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రి, వారు చేసే వ్యాఖ్యలతో ఏంచేయాలో పాలుపోక, దిక్కుతోచని స్థితిలో పడిపోయాడని, చివరకు నదిలో కొట్టుకుపోయేవాడు ప్రాణరక్షణ కోసం గడ్డిపోచపట్టుకున్నట్లుగా ముఖ్యమంత్రి పరిస్థితి తయారైందన్నారు.

నాని వ్యాఖ్యలతో ప్రభుత్వ గౌరవం దెబ్బతినడంతో, దాన్ని కప్పిపుచ్చుకునే క్రమంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై దుష్ప్రచారానికి వైసీపీ, జ‌గ‌న్ సొంత మీడియా తెరతీసిందని రామయ్య తెలిపారు. ప్రభుత్వ విధానాలపై, ప్రజల కష్టాలపై  చంద్రబాబు మాట్లాడుతూ తిరుమల ప్రసాదమైన లడ్డూ ధరలు పెంచారని, అదేవిధంగా మద్యం ధరలు కూడా ఇష్టానుసారం పెంచి ప్రజల్ని దోచుకుంటున్నారని చెబితే, ఆయన  తిరుమల లడ్డూప్రసాదాన్ని, మద్యంతో పోల్చాడంటూ విషప్రచారం చేయడం దుర్మార్గం కాదా అని రామయ్య ధ్వజమెత్తారు.

బూతుపంచాంగం పఠించేవాడికి మంత్రిపదవి ఇచ్చిన జగన్మోహన్‌రెడ్డి, డిక్లరేషన్‌ ఇవ్వకుండా తిరుమల పవిత్రతను మంటగలిపింది గాక, మంత్రితో ఇష్టానుసారం మాట్లాడిస్తూ తన చర్యను సమర్థించుకోవాలని చూడటం దారుణ మన్నారు. తిరుమల ఆలయ గురించి మంత్రి వాడిన భాషపై, కొందరు ఫిర్యాదు చేస్తే, దానికి ప్రతిగా చంద్రబాబుపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వర్ల స్పష్టంచేశారు.

తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్లే అన్యమతాల వారందరూ వేంకటేశ్వరస్వామిపై తమకు నమ్మక ముందని డిక్లరేషన్‌ ఇచ్చాకే ఆయన్ని దర్శించుకుంటారని, అందుకు పూర్తివిరుద్ధంగా ప్రవర్తించిన జగన్మోహన్‌రెడ్డి తాను చేసింది తప్పని ఒప్పుకొని, ఇకముందు ఇలాంటి పొరపాట్లు చేయనని బహిరంగంగా రాష్ట్రప్రజలకు క్షమాపణ చెప్పాలని రామయ్య డిమాండ్‌ చేశారు.

డిక్లరేషన్‌ ఇవ్వని జగన్మోహన్‌రెడ్డిని, బంధుప్రీతితో, ముఖ్యమంత్రనే సాకుతో నిబంధనలకు విరుద్ధంగా స్వామివారి దర్శనానికి అనుమతించిన టీటీడీ చైర్మన్‌ వై.వీ.సుబ్బారెడ్డి కూడా తక్షణమే తనపదవికి రాజీనామా చేయాలన్నారు.

తిరుమలలో డిక్లరేషన్‌ ఇవ్వకుండా ముఖ్యమంత్రి చట్టాన్ని అతిక్రమిస్తే, అన్యమతస్తుడి నుంచి డిక్లరేషన్‌ తీసుకోనందుకు సుబ్బారెడ్డి, జగన్‌ని వెనకేసుకొస్తూ మాట్లాడినందుకు మంత్రి కొడాలినాని, తమ తప్పులు తెలుసుకొని వేంకటేశ్వరస్వామిని క్షమాపణ వేడుకోవాలని రామయ్య డిమాండ్‌చేశారు.

జగన్‌ చర్యని ప్రశ్నించే హక్కు ప్రతి హిందువుకి ఉంటుందని, హైందవుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడిన మంత్రి నానీని తక్షణమే కేబినెట్‌నుంచి ముఖ్యమంత్రి బర్తరఫ్‌ చేయాలని వర్ల సూచించారు. చేసిన తప్పుని తెలుసుకొని, క్షమాపణ కోరడం విజ్ఞుల లక్షణమని, ముఖ్యమంత్రిజగన్‌, వై.వీ.సుబ్బారెడ్డి, కొడాలినాని విజ్ఞతేమిటో వారి విచక్షణకే వదిలేస్తున్నట్లు రామయ్య తెలిపారు.
 
మసీదులు, గురుద్వారాల్లో ఇలానే ప్రవర్తిస్తారా..?: ఆనంద్‌సూర్య
తన చర్యలతో, అహంకారంతో హిందువుల మనోభావాలు దెబ్బతీసిన రాష్ట్రముఖ్యమంత్రి, మసీదుల్లో, గురుద్వారాల్లో కూడా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించి, ఆయామత సంప్రదాయాలను ఉల్లంఘించగలరా అని రాష్ట్రబ్రాహ్మణ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ వేమూరి ఆనంద్‌సూర్య నిలదీశారు.

సుమారు 138 ఏళ్ల క్రితమే, 1890లో ఆనాటి బ్రిటీష్‌ రాజకీయవేత్త విలియం కేన్స్‌ తను రాసిన పుస్తకంలో తిరుమల వేంకటేశ్వరస్వామి మహిమను ప్రస్తావించాడన్నారు. అధికారంలో ఉన్నామని, ఇష్టానుసారం ప్రవర్తిస్తామంటే సమాజం చూస్తూ ఊరుకోదనే విషయాన్ని జగన్మోహన్‌రెడ్డి గ్రహించాలని ఆనంద్‌సూర్య హితవు పలికారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో తీరిన ఇసుక కొరత