Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెరుకు రైతుల బకాయిల చెల్లింపునకు జగన్‌ ఆదేశం

చెరుకు రైతుల బకాయిల చెల్లింపునకు జగన్‌ ఆదేశం
, బుధవారం, 20 నవంబరు 2019 (07:42 IST)
రాష్ట్రంలో సహకార చక్కెర కర్మాగారాల పునర్‌ వైభవానికి  సమగ్రప్రణాళిక తయారు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. ప్రస్తుతం పనిచేస్తున్న కర్మాగారాలు, తిరిగి తెరవాల్సిన కర్మాగారాల విషయంలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలన్నారు.

ఇప్పుడున్న పోటీని తట్టుకోవడానికి, లాభదాయకంగా నడపడానికి అవసరమైన  చర్యలను అందులో పొందుపరచాలన్నారు. కర్మాగారాలను తాజా సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధిచేయడంతోపాటు ఉప ఉత్పత్తులు ద్వారా అవి సొంతకాళ్లమీద నిలబడ్డానికి అవసరమైన అన్ని ఆలోచనలు చేయాలని నిర్దేశించారు.

చక్కెర సరఫరా చేసినందుకు రైతులకు చెల్లించాల్సిన బకాయిలను వీలైనంత త్వరలో చెల్లించడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రణాళికలో నిర్దేశించిన విధంగా సహకార డెయిరీలకు పాలుపోస్తున్నందుకు ప్రతిలీటరుకూ రూ.4ల బోనస్‌ అమలుపైనా ప్రతిపాదనలు సిద్ధంచేయాలన్నారు. సహకార డెయిరీల బలోపేతం, రైతులకు మరింత లబ్ధి చేకూర్చే అన్నిరకాల చర్యలపైనా వీలైనంత త్వరగా ప్రతిపాదనలు సిద్ధంచేయాలని సీఎం ఆదేశించారు.

సహకార చక్కెర కర్మాగారాలు, సహకార డెయిరీలపై సీఎం వైయస్‌.జగన్‌ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, పశుసంవర్థకం, మత్స్య, మార్కెటింగ్‌  శాఖల మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఆయా శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

రాష్ట్రంలో చెరుకుపంట సాగు, సహకార చక్కెర కర్మాగారాలు, మూతపడ్డ సుగర్‌ ఫ్యాక్టరీలపై అధికారులు సీఎంకు వివరాలు అందించారు. చక్కెర పరిశ్రమల పరంగా దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపైనా ప్రజంటేషన్‌ ఇచ్చారు.  
 
1.  దేశంలో 330.7లక్షల మెట్రిక్‌ టన్నుల పంచదార ఉత్పత్తి ఉంటే
యూపీలో అత్యధికంగా 116.7 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉత్పత్తి చేస్తున్నారు.  107.2 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తితో రెండోస్థానంలో మహారాష్ట్ర నిలవగా, పదోస్థానంలో ఏపీ ఉంది. రాష్ట్రంలో ఉత్పత్తి 5.02 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే. 
 
2. ఒక్కో హెక్టారుకు చెరుకు ఉత్పత్తిలో 105 మెట్రిక్‌ టన్నులతో తమిళనాడు ప్రథమ స్థానంలో ఉండగా, 95 మెట్రిక్‌ టన్నులతో కర్ణాటక ఉంది. 78 మెట్రిక్‌ టన్నులతో ఏపీ దేశంలో ఏడో స్థానంలో ఉంది. 
 
3. సగటున చక్కెర రికవరీ శాతం యూపీలో 11.5 శాతం, మహారాష్ట్ర 11.3 శాతం, ఏపీ 9.3 శాతంతో దేశంలో 11వ స్థానంలో ఉంది. 
 
4. రాష్ట్రంలో చక్కెర డిమాండు 10.23 లక్షల మెట్రిక్‌ టన్నులు అయితే ఉత్పత్తి  5.02 మెట్రిక్‌ టన్నులు మాత్రమే.
 
5. రాష్ట్రంలో 29 చక్కెర కర్మాగారాలు ఉంటే అందులో 18 మాత్రమే పనిచేస్తున్నాయి. మహారాష్ట్రలో 264 ఉంటే 195 పనిచేస్తున్నాయి, 
యూపీలో 158 ఉంటే 119 మాత్రమే పనిచేస్తున్నాయి. 
 
6. 2006–07 నాటికి రాష్ట్రంలో 102.3 లక్షల టన్నుల చెరుకు ఉత్పత్తి ఉంటే 100.91 లక్షల మెట్రిక్‌ టన్నులు క్రషింగ్‌ అయ్యేది. 
2018–19 నాటికి 58.04 లక్షల మెట్రిక్‌ టన్నులకు పడిపోగా, ఇందులో 54.05 లక్షల టన్నులు క్రషింగ్‌కు వస్తోంది. 
 
7. రాష్ట్రంలో మొత్తం సహకార చక్కెర కర్మాగారాలు 10 ఉండగా అందులో 6 మూతబడ్డాయి. 
విజయనగరం జిల్లా భీమసింగిలో ఉన్న విజయరామగజపతి, విశాఖపట్నం జిల్లా చోడవరం , ఏటికొప్పాక, తాండవ సహకార చక్కెర కర్మాగారాలు ప్రస్తుతం పనిచేస్తున్నాయి. 
మూతపడ్డవాటిలో అనకాపల్లి, గుంటూరు జిల్లా జంపని, నెల్లూరు జిల్లా కోవూరు, చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర, చిత్తూరు సహకార చక్కెర ఫ్యాక్టరీ, కడప సమీపంలోని చెన్నూరు సగర్‌ ఫ్యాక్టరీ ఉన్నాయి. 
ఎన్నికలకు ముందు అనకాపల్లి సుగర్‌ ఫ్యాక్టరీ ప్రారంభం అయినా ఆ తర్వాత కొద్దికాలానికే నిలిచిపోయిందని అధికారులు సీఎం దృష్టికి తీసుకు వచ్చారు. 

ఫ్యాక్టరీల వారీగా ఉన్న పరిస్థితులనుకూడా సీఎం తెలుసుకున్నారు. రైతుల బకాయిలు, ఫ్యాక్టరీల వారీగా ఉన్న రుణాలు తదితర అంశాలపై క్షుణ్నంగా అధికారులతో చర్చించారు. 

పేరుకుపోయిన పంచదార నిల్వలతో కలుపుకుని ఇప్పటివరకూ 10 సహకార సుగర్‌ ఫ్యాక్టరీలపై భారం రూ. 891.13 కోట్ల రూపాయలు ఉందని అధికారులకు నివేదించారు. 

ప్రజంటేషన్‌ పూర్తయ్యాక సీఎం అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. సహకార ఫ్యాక్టరీల నుంచి రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించడానికి తగిన చర్యలు తీసుకోమని చెప్పారు. వీలైనంత త్వరలో వీటిని విడుదల చేయలాని ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రావత్‌కు సీఎం ఆదేశాలు జారీ చేశారు. 

వీటితోపాటు ప్రస్తుతం నడుస్తున్న 4 సహకార చక్కెర కర్మారాగారాలను పూర్తిస్థాయిలో ఆధునీకరించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో తగిన కార్యాచరణ ప్రణాళికను తయారుచేయాలన్నారు. వీటిపై పెట్టే ప్రతి పైసా సద్వినియోగం కావాలని, ఫ్యాక్టరీ తన సొంత కాళ్లమీద నిలబడ్డమే కాకుండా, రైతులు ఆనందంగా ఉండాలని ముఖ్యమంత్రి అన్నారు.

అప్పుడు కొంత, ఇప్పుడు కొంత ఇచ్చి.. అటూఇటూ కాకుండా ఫ్యాక్టరీని, రైతులను ఇబ్బంది పెట్టే పద్ధతులు వద్దని, వచ్చే 2 –3 సంవత్సరాల్లో ఆ ఫ్యాక్టరీలను అత్యంత ఆధునిక పరిశ్రమలుగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు. మొలాసిస్‌ లాంటి ఉప ఉత్పత్తుల వల్ల ఆర్థిక ప్రయోజనం సమకూరే మార్గాలపైనా దృష్టిపెట్టాలని ఆదేశించారు. 
 
వీటితోపాటు అనకాపల్లి, కడపలోని చెన్నూరు, చిత్తూరు జిల్లాలోని రేణిగుంట వద్దనున్న గాజుల మాండ్యం సుగర్‌ ఫ్యాక్టరీలను తిరిగి తెరవాలంటూ రైతులనుంచి, ప్రజా ప్రతినిధుల నుంచి పెద్ద ఎత్తున విజ్ఞప్తులు వచ్చిన విషయాన్ని సీఎం అధికారులకు సూచించారు. దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై కార్యాచరణ ప్రణాళిక సిద్ధంచేయాలన్నారు. 

ఆయా ప్రాంతాల్లో చెరుకు ఉత్పత్తి తగ్గుతున్నందున వాటిని పరిమిత స్థాయిలో నడుపుకుని అదనపు విలువ జోడించి చక్కెరను ఉత్పతి ్తచేయాలన్నదానిపై అధికారులు కొన్ని ప్రతిపాదనలు ఉంచగా, అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. సహకార చక్కెర కర్మాగారా రివైవల్‌ ప్లాన్‌ భాగంగానే ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు ఇతరత్రా అంశాలపై దృష్టిసారించాలని సీఎం అధికారులకు చెప్పారు. 
 
ఇక తెరవడానికి అవకాశం లేని సహకార చక్కెర కర్మాగారాల విషయంలో ఉన్న బకాయిలను తీర్చడానికి ఏం చేయాలన్నదానిపై ఒక ప్రణాళిక సిద్ధంచేయాలని సీఎం ఆదేశించారు. 
 
ఫ్యాక్టరీలు నడుస్తున్న చోట ప్రస్తుతం ఉన్న చెరుకు సాగుకోసం టన్నుకు రూ.800 నుంచి రూ.1200లు, కటింగ్‌ సమయంలో రూ.250 నుంచి 300లు ఖర్చు అవుతున్న విషయాన్ని అధికారులు నివేదించారు.

ఈ ప్రాంతాల్లో సాగు తగ్గకుండా మరింత పెరిగేలా, దిగబడులు గణనీయంగా ఉండేలా వ్యవసాయశాఖ కూడా తగిన చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. చెరుకు నాటడానికి, కటింగ్‌కూ ఫ్యాక్టరీ ద్వారా అత్యాధునిక పరికరాలను రైతులకు అందించడంపై దృష్టిపెట్టాలన్నారు. తమిళనాడు రాష్ట్రంలో అధిక దిగుబడులకు అనుసరిస్తున్న విధానాలపై దృష్టిపెట్టాలన్నారు. 
 
సహకార డెయిరీలపై సీఎం సమీక్ష:
రాష్ట్రంలో సహకార డెయిరీల స్థితిగతులపైనా సీఎం సమీక్ష చేశారు. సహకార రంగంలోని డెయిరీలకు పాలుపోసే ప్రతి రైతుకూ లీటరుకు రూ.4లు బోనస్‌ కింద ఇస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీని అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సహకార డెయిరీలను మరింత బలోపేతం చేయడంతోపాటు, తద్వారా రైతులకు మరింత లబ్ధి చేకూర్చాలని ప్రభుత్వ ఉద్దేశమని ఆమేరకు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నామని సీఎం వివరించారు. రైతులకు మేలు చేకూర్చేలా ప్రముఖ బాండ్లతో భాగస్వామ్యంపైకూడా ఆలోచనలు చేస్తున్నట్టు చెప్పారు. సహకార రంగంలో ప్రస్తుతం డెయిరీలు, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ సెంటర్ల స్థితిగతులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

వీటిని పటిష్టం చేయడం ద్వారా రైతులకు అందుబాటులోకి తీసుకు రావచ్చని తెలిపారు. ఈమేరకు తీసుకోవాల్సిన చర్యలపై నిర్మాణాత్మక ఆలోచనలు చేయాలని సీఎం సూచించారు. ఇప్పుడున్న సహకార డెయిరీలు తమ సామర్థ్యాన్ని పెంచుకోవడంతోపాటు, మార్కెట్లో అవకాశాలను అందిపుచ్చుకునేలా కొత్త వ్యూహాలు దిశగా అడుగులు వేయాలని, అందుకనే పెద్దబ్రాండ్ల భాగస్వామ్యం దిశగా ఆలోచన చేస్తున్నామని సీఎం చెప్పారు.

చేయూత ద్వారా మహిళలకు  ఆర్ధిక సహాయం చేస్తామని,  వచ్చే నాలుగేళ్లలో పెద్ద ఎత్తున ఆర్థిక లబ్ధి చేకూరుస్తున్నామని, డెయిరీ కార్యక్రమాల ద్వారా వారి ఆదాయాలు పెంచే ఆలోచనలు కూడా చేస్తున్నామస సీఎం చెప్పారు. రానున్న రోజుల్లో సహకార డెయిరీల బలోపేతం, డెయిరీ రంగంలో మహిళల భాగస్వామ్యం, పాడి పశువులను గణనీయంగా పెంచడమనే మూడే కోణాల్లో కార్యక్రమాలు విస్తృతం చేస్తామని సీఎం చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శాసనసభ్యులా... శాడిస్టు సభ్యులా...?: టీడీపీ