Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సాగునీటి పనుల బిల్లులు సకాలంలో చెల్లింపు.. మంత్రి పెద్దిరెడ్డి

Advertiesment
సాగునీటి పనుల బిల్లులు సకాలంలో చెల్లింపు.. మంత్రి పెద్దిరెడ్డి
, సోమవారం, 21 అక్టోబరు 2019 (19:11 IST)
అనంతపురం, చిత్తూరుజిల్లాల్లోని సాగునీటి సమస్యలపై అధికారులు తక్షణం స్పందించాలని రెండు జిల్లాలకు చెందిన ప్రజాప్రతినిధులు కోరారు. పెండింగ్‌లో వున్న సాగునీటి ప్రాజెక్ట్ లు, డిస్ట్రిబ్యూటరీ కాలువ పనులను సత్వరం పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.

నియోకవర్గాల వారీగా వున్న సాగు, తాగునీటి సమస్యలను మంత్రులు, అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. విజయవాడలోని ఇరిగేషన్‌ కార్యాలయంలో సోమవారం అనంతపురం, చిత్తూరు జిల్లాలకు సంబంధించిన సాగునీటి ప్రాజెక్ట్ లపై సోమవారం ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.

రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖా మంత్రి అనీల్‌కుమార్‌ యాదవ్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, శంకర్‌ నారాయణ, చీఫ్‌విప్‌ జి.శ్రీకాంత్‌ రెడ్డి పాల్గొన్నారు. రెండు జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఈ సమావేశంకు హాజరయ్యారు. ఇరిగేషన్‌ అధికారుల సమక్షంలో తమ నియోజకవర్గంలోని సాగునీటి అవసరాలు, చేపట్టాల్సిన పనులపై ప్రజాప్రతినిధులు వివరించారు.

ప్రధానంగా అనంతపురం జిల్లాలో చెరువులపైనే ఆధారపడాల్సిన పరిస్థితి వుందని, ఈ నేపథ్యంలో చెరువులకు నీటిని అందించాలని, అదే సమయంలో డిస్ట్రిబ్యూటరీ కాలువలకు కూడా నీరు విడుదల చేయడం ద్వారా ఆయకట్టును కాపాడాలని ప్రజాప్రతినిధులు కోరారు.

ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అనంతపురం జిల్లాలో పర్యటించిన సందర్బంగా హంద్రీనీవా కాలువను వెడల్పు చేస్తామని, ఇప్పుడు వున్న కాలువను ఆరువేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచుతానంటూ ఇచ్చిన హామీ మేరకు అధికారులు ప్రణాళికలు సిద్దం చేయాలని పలువురు విజ్ఞప్తి చేశారు.

అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ  జిల్లాలో 3.45 లక్షల ఎకరాల ఆయకట్టుకు, నాలుగు వందల చెరువులకు నీటిని ఇవ్వాలని దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రతిపాదించారని గుర్తు చేశారు. అయితే డిస్ట్రిబ్యూటరీ విధానం సిద్దం కాకపోవడం వల్ల ఈ మేరకు  ఆయకట్టుకు నీరు ఇవ్వలేకపోతున్నామని అన్నారు.

దీనిని దృష్టిలో పెట్టుకుని ఒక వైపు చెరువులకు నీరు ఇస్తూనే... ఆయకట్టుకు కూడానీరు ఇవ్వాలని కోరారు. చిత్రావతి నుంచి నేరుగా చిత్తూరు జిల్లాకు నీటిని తీసుకుపోతే, జిల్లాలోని శివారు భూములకు నీరు అందుతుందని సూచించారు.

సింగనమల్ల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ తమ జిల్లాకు గతంలో 32.5 టిఎంసిల నీరు తుంగభద్ర నుంచి అలాట్ చేశారని, ఇది ఇప్పుడు పది టిఎంసిలు తగ్గిపోయిందని అన్నారు. ప్రస్తుతం కేటాయించిన 22 టిఎంసిల్లో పది టిఎంసిలు జిల్లాలో మంచినీటికి కేటాయిస్తున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో హంద్రీనీవానుంచి అయిదు టిఎంసిలను తాగునీటి కోసం ప్రత్యేకంగా కేటాయించాలని కోరారు.

కదిరి ఎమ్ఎల్యే పివి సిద్దారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో వున్న మొత్తం 380 చెరువులను నింపేందుకు సాగునీరు విడుదల చేయాలని కోరారు. పుంగనూరు బ్రాంచి కెనాల్‌ కు నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రారంభించిన టన్నెల్‌ ను సత్వరం పూర్తి చేయాలని కోరారు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ చిత్రావతి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్‌ ద్వారా నియోజకవర్గంలోని చెరువులను నింపాలని కోరారు.

దీనివల్ల అయిదు కిలోమీటర్ల మేర మూడు మండలాల రైతులకు మేలు జరుగుతుందని మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. యోగి వేమన రిజర్వాయర్‌ ను హంద్రీనీవా ద్వారా నింపాలని గతంలో జీఓ ఇచ్చారని, దీనివల్ల ములుగుబ్బ ప్రాంతంలోని చెరువులకు నీరు నింపేందుకు అవకాశం వుందని అన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా సిబిఆర్‌ కు నీటిని తరలించేందుకు వున్న ప్రతిపాదనలను పరిశీలించాలని కోరారు.

అనంతపురం ఎంపి తలారి రంగయ్య మాట్లాడుతూ నియోజకవర్గాలకు వచ్చే నీటిని లెక్కించే ప్రక్రియ చేపట్టాలని, దాని ద్వారా వాటర్‌ మేనేజ్‌మెంట్‌ చేయవచ్చని అన్నారు. అలాగే కెనాల్స్ నుంచి పంపే నీరు అధికశాతం ఆవిరిగా మారుతోందని, రాజస్థాన్‌ వంటి రాష్ట్రాల్లో మాదిరిగా కాలువలపై సోలార్‌ ప్యానళ్లు ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలించాలని కోరారు.

అలాగే జిల్లాలోని 1468 చెరువులను ఆధునీకరించాల్సిన అవసరం వుందని, తద్వారా ఇరవై ఏడు టిఎంసిల నీటిని వినియోగించుకునే వీలు కలుగుతుందని అన్నారు. పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్‌ రెడ్డి మాట్లాడుతూ  నియోజకవర్గంలోని 201 చెరువులకు మూడు టిఎంసీల నీరు అవసరమని అన్నారు. అలాగే గతంలో ప్రతిపాదించిన మూడు కొత్త రిజర్వాయర్‌ లను కూడా ప్రారంభించాలని కోరారు.

కళ్యాణదుర్గం నియోజకవర్గం కెవి ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ జిడిపల్లి రిజర్వాయర్‌ నుంచి కళ్యాణదర్గంకు పన్నెండు కిలోమీటర్ల దూరం వుందని, అయినా తమకు రిజర్వాయర్‌ నుంచి సాగునీరు అందడం లేదని అన్నారు. తమ నియోజకవర్గం లోని 114  చెరువులను నింపితే పదిహేను వేల ఎకరాలు నేరుగా,  భూగర్భ జలాల ద్వారా మరో అరవై వేల ఎకరాల్లో సాగు జరుగుతుందని వివరించారు.

రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాశ్‌ రెడ్డి మాట్లాడుతూ  డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ కు వెంటనే టెండర్లు పిలవాలని కోరారు. చెరువులకు నీటిని అందించే చానెల్స్ పై సర్వే చేయాలన్నారు. అవసరమైన చోట్ల రిజర్వాయర్‌ లను నిర్మించాలని కోరారు. మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి మాట్లాడుతూ సముద్రమట్టానికి ఏడు వందల మీటర్ల ఎత్తులో తమ ప్రాంతం వుందని, సాగునీటి కోసం తామ ప్రాంత రైతులు ఎదురుచూస్తున్నారని అన్నారు.

మడకశిర బ్రాంచికెనాల్ ద్వారా తమకు నీరు ఇస్తామని 2004లో దివంగత నేత వైఎస్ఆర్‌ హామీ ఇచ్చారని, దానిలో భాగంగా 2005లో కెనాల్‌ పనులు ప్రారంభించినా... నేటికీ అవి పూర్తి కాలేదని గుర్తు చేశారు. అయిదు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే మూడు మండలాలకు సాగునీరు అందుతుందని, వెంటనే ఈ నిధులను కేటాయించాలని కోరారు.

ముదిగుబ్బ రిజర్వాయర్‌ ను గత ప్రభుత్వం మంజూరు చేసిందని, దీనిని కూడా ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా మంత్రి శంకర్‌ నారాయణ మాట్లాడుతూ పెనుగొండ నియోజకవర్గంలో హెచ్‌ఎన్‌ఎస్‌ కింద కేవలం ముప్పైవేల ఎకరాల ఆయకట్టు మాత్రమే వుందని, దీనిని పెంచాలని కోరారు. పందిపర్తి వద్ద ఒక రిజర్వాయర్‌ ను గతంలో ప్రతిపాదించారని, దీనిని కూడా తక్షణమే ప్రారంభించాలని కోరారు.
 
చెర్లోపల్లి రిజర్వాయర్‌ నుంచి సాగునీరు: మంత్రి పెద్దిరెడ్డి
సాగునీటి ప్రాజెక్ట్ లపై జరిగిన సమీక్షాసమావేశంలో చిత్తూరుజిల్లాకు సంబంధించి రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ది శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పలు సూచనలు చేశారు. చెర్లోపల్లి రిజర్వాయర్‌ నుంచి చిత్తూరుజిల్లా సాగునీటి అవసరాలకు నీటిని అందించాలని కోరారు.

ఇప్పటివరకు పెండింగ్‌లో వున్న సాగనీటి పనులకు సంబంధించిన బిల్లులను కూడా సకాలంలో చెల్లిస్తామని, వచ్చే జనవరి నాటికి చెర్లోపల్లి రిజర్వాయర్‌ నుంచి పుంగనూరు బ్రాంచి కెనాల్‌కు నీటిని అందించాలని ఆదేశించారు. గాలేరు, నగరి నుంచి పన్నెండు టిఎంసిలు చిత్తూరు జిల్లాకు కేటాయించారని తెలిపారు.

జిల్లాలో మొత్తం పదహారు లక్షల ఎకరాల ఆయకట్టుకు బోర్ల ద్వారా నీటిని అందించేందుకు ఇబ్బందులు వున్నాయని, దీనికి ప్రత్యామ్నాయంగా జిల్లాలోని నదుల నుంచి వచ్చే నీటిని చెరువులకు మళ్లించే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. అలాగే జిల్లాలో ఎనిమిది వేల చెరువులు, అయిదు వేల చెక్‌ డ్యాంలు వున్నప్పటికీ సాగునీటికి ఇబ్బందులు తప్పడం లేదని అన్నారు.

రాష్ట్రంలో ఈ ఏడాది వర్షాలు బాగా కురిసినప్పటికీ కేవలం వంద చెరువులు మాత్రమే నిండాయని, మరో 1900 చెరువులు డెబ్బై శాతం మాత్రమే నిండాయని అన్నారు. జిల్లాలో అయిదు మైనర్‌ నదులు ప్రవహిస్తున్నాయని, వాటి ద్వారా వచ్చే నీటిని సద్వినియోగం చేసుకునేందుకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని కోరారు.

అలాగే కొత్తగా మూడు లక్షల ఎకరాల ఆయకట్టుకు, మైనర్‌ ఇరిగేషన్‌ కింద మరో లక్ష ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని అనుకుంటున్నామని, దీనిని సాకారం చేసేందుకు జల వనరుల లభ్యతను గుర్తించాలని సూచించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూ.4988 కోట్లతో ఎస్టీ సబ్ ప్లాన్ పనులు.. ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి