Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ.4988 కోట్లతో ఎస్టీ సబ్ ప్లాన్ పనులు.. ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి

Advertiesment
రూ.4988 కోట్లతో ఎస్టీ సబ్ ప్లాన్ పనులు.. ఉపముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి
, సోమవారం, 21 అక్టోబరు 2019 (19:05 IST)
గిరిజనాభివృద్ధిలో భాగంగా ఈ ఏడాది ఎస్టీ సబ్ ప్లాన్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.4988 కోట్లను కేటాయించిందని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి తెలిపారు. ఇది గత ఏడాది కేటాయించిన బడ్జెట్ కంటే రూ.812 కోట్లు అధికమని వివరించారు.

ఎస్టీ సబ్ ప్లాన్‌లో కేటాయించిన నిధుల్లో ప్రతి రూపాయీ కూడా గిరిజనాభివృద్ధి కోసమే ఉపయోగపడేలా చూడాలని కోరారు. రాష్ట్ర సచివాలయంలో సోమవారం జరిగిన ఎస్టీ సబ్ ప్లాన్ రాష్ట్ర నోడల్ ఏజెన్సీ సమావేశంలో ఉప ముఖ్యమంత్రితో పాటు గిరిజన సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి ఆర్.పి.సిసోడియా, డైరెక్టర్ ఆర్.రంజిత్ బాషా తో పాటుగా సుమారు 45 ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు హాజరయ్యారు.

ఈ సందర్భంగానే పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి గిరిజనులపై ఆదరాభిమానాలు ఉన్నాయని ఈ కారణంగానే గతేడాది ఎస్టీ సబ్ ప్లాన్ కు రూ. 4176 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ.4988 కోట్లను కేటాయించారని చెప్పారు.

గత ప్రభుత్వ హయాంలో ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను కూడా దుర్వినియోగం చేసిన సంఘటనలను చూసామన్నారు. అయితే తమ ప్రభుత్వ హయాంలో ఆ విధంగా కాకుండా ఎస్టీ సబ్ ప్లాన్ కు కేటాయించిన ప్రతి రూపాయిని కూడా కేవలం గిరిజనుల కోసమే ఖర్చు చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

గత ఏడాదిలో మొదలుపెట్టిన పనుల్లో ప్రారంభం కాని వాటిని రద్దు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, అన్ని పనులను మరోసారి సమీక్షించుకొని, ఏది అవసరమో, ఏది అనవసరమో నిర్ణయించాలని సూచించారు. అందుబాటులో ఉన్న నిధులతో కొత్త పనులను చేపట్టడానికి కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కోరారు. గిరిజన ప్రాంతాల్లో గిరి సేవాకేంద్రాలను ఏర్పాటు చేస్తున్న చోట కూడా గ్రామ సచివాలయాలను కట్టాల్సిందేనని ముఖ్యమంత్రి ఇది వరకే స్పష్టం చేసారని గుర్తు చేసారు.

గ్రామ సచివాలయాల్లో ఒక భాగాన్ని గిరి సేవా కేంద్రాలకు ఉపయోగించుకుంటారని చెప్పారు. అటవీ ప్రాంతంలో ఆర్.ఓ.ఎఫ్.ఆర్. పట్టాలు ఇవ్వడానికి కూడా చర్యలను తీసుకోవాలని, పెండింగ్ లో ఉన్న గిరిజన రైతులందరికీ ఉగాది రోజునే పట్టాలను ఇవ్వడానికి కూడా ప్రయత్నించాలని పుష్ప శ్రీవాణి ఆదేశించారు.

అటవీ ప్రాంతాల్లో నిరంతరం నీటితో నిండి ఉండే చెరువులు కుంటలు ఎక్కువగా ఉన్నప్పటికీ గిరిజనులకు చేపల పెంపకం, రొయ్యల పెంపకంలో ఇప్పటిదాకా శిక్షణలు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. అయితే ఈ ఏడాది నుంచి ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో గిరిజన రైతులను అక్వా కల్చర్ లోనూ ప్రోత్సహించేలా చూడాలని, దీని కోసం అవసరమైన గిరిజన మత్స్యకార సొసైటీలను ఏర్పాటు చేసే విషయాన్ని కూడా పరిశీలించాలని కోరారు.

రంపచోడవరం ప్రాంతంలో గిరిజన రైతులు సాగు చేస్తున్న టస్సార్ సిల్క్ ను ఇతర ప్రాంతాల్లో అభివృద్ధి చేసే అవకాశాలను కూడా పరిశీలించాలని కూడా కోరారు. వైద్య విభాగానికి సంబంధించిన సేవలను గిరిజన ప్రాంతాల్లో మరింతగా మెరుగుపర్చాలని, దీని కోసం అవసరమైన వైద్య సిబ్బందిని నియమించడంతో పాటుగా ఇప్పటికే పని చేస్తున్న వారికి డిప్యుటేషన్ల మీద ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఇవ్వకూడదని అభిప్రాయపడ్డారు.

ఫీడర్ అంబులెన్స్‌ల పనితీరు మరింతగా మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనులకు ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాన్ని సక్రమంగా అందించేలా చూడాలని ఉపముఖ్యమంత్రి  కోరారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శాంసంగ్ గెలాక్సీ ఎస్9పై రూ.32 వేల డిస్కౌంట్ ఆఫర్