Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఎం జగన్ మరో డెసిషన్, మద్యం ప్రియులకు మరో చేదు వార్త

Advertiesment
సీఎం జగన్ మరో డెసిషన్, మద్యం ప్రియులకు మరో చేదు వార్త
, మంగళవారం, 19 నవంబరు 2019 (18:20 IST)
మద్యం ప్రియులకు ఇది చేదు వార్తే.. ఇప్పటికే ప్రైవేటు మద్యం షాపులను మూసివేసి ప్రభుత్వ ఆధ్వర్యంలో షాపులు నడుపుతూ వాటిని కుదించి.. సమయాన్ని మార్చి మద్యం షాపులను విడతలవారీగా ఎత్తివేసే కార్యక్రమానికి రాష్ట్రప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే ఎపి సిఎం మరో కీలక నిర్ణయాన్ని కూడా తీసుకున్నారు. అది కూడా మద్యం విక్రమ సమయాన్ని మరింత తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 
 
అక్కచెల్లెమ్మల కన్నీళ్లు తుడిచే కార్యక్రమంలో భాగంగా, కుటుంబాల్లో ఆప్యాయతలను పెంచడానికి మద్యపాన నియంత్రణ, నిషేధ కార్యక్రమాలను అమలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మద్య నిషేధం కోసం దశలవారీగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి ఇప్పుడున్న బార్ల సంఖ్యలో 40 శాతం తగ్గించాలని నిశ్చయించారు. 
 
మద్యం పాలసీ తదుపరి చర్యల్లో ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌ క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఇప్పటివరకు తీసుకుంటున్న చర్యలను, ఇకపై తీసుకోవాల్సిన చర్యలపై ఆయన అధికారులతో సమగ్రంగా చర్చించారు. బార్ల సంఖ్యను కుదించడంపై సమావేశంలో విస్తృతంగా చర్చ జరిగింది. రాష్ట్రంలో 38 స్టార్‌ హోటళ్లలో, 4 పబ్బుల సహా మొత్తం 839 మంది బార్ల నిర్వహణకు లైసెన్స్‌లు తీసుకున్నారని వివరించారు. ఆతిథ్యరంగానికి సంబంధించిన స్టార్‌ హోటళ్లు, పబ్బులు మినహాయిస్తే 797 చోట్ల బార్లు ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. వీటిలో సగానికిపైగా బార్లు తగ్గించాలని సీఎం సూచించారు. 
 
దీనిపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. మద్యంపాలసీలో భాగంగా ఇప్పటికే 20 శాతం దుకాణాలను తగ్గించామని, 4380 దుకాణాలను, 3500కు కుదించామన్నారు. మద్య నియంత్రణ కార్యక్రమాన్ని దశలవారీగా చేపడుతున్నందున బార్ల సంఖ్యను కూడా దశలవారీగా కుదించుకుంటూ వద్దామంటూ ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై సమీక్షా సమావేశంలో చాలాసేపు చర్చ జరిగింది. చివరకు 797 బార్లలో 40 శాతం తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. వీటికి కొత్తగా లైసెన్స్‌లు జారీచేయడంతోపాటు, లాటరీ పద్ధతిలో బార్లను కేటాయించాలని నిశ్చయించారు. 
 
మద్యం ముట్టుకుంటే షాక్‌ కొడుతుందన్న భావన ఉండాలని, అప్పుడే చాలామంది దానికి దూరం అవుతారని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఆ మేరకు అప్లికేషన్‌ ఫీజులు, లైసెన్స్‌ ఫీజులు ఉండాలని అధికారులను ఆదేశించారు. అంతిమంగా మద్య నిషేధం దిశగా అడుగులు వేయాలన్న మౌలిక లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకుని  తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలని సీఎం ఆదేశించారు. 
 
బార్ల సంఖ్యను కుదించడంతోపాటు మద్యం సరఫరా వేళలను కూడా కుదించాలని సమావేశంలో నిర్ణయించారు. గత సమీక్షా సమావేశాల్లో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలను దృష్టిలో ఉంచుకుని బార్లలో ఉదయం 11 నుంచి రాత్రి 10 వరకూ మద్యం సరఫరాను అనుమతిస్తామని, రాత్రి 11 గంటల వరకూ ఆహారాన్ని అనుమతిస్తామని అధికారులు స్పష్టంచేశారు. స్టార్‌ హోటళ్లలో ఉదయం 11 నుంచి రాత్రి 11 వరకూ మద్యాన్ని విక్రయించడానికి అనుమతి ఉంటుందని వెల్లడించారు. అలాగే బార్లలో అమ్మే మద్యం ధరలను పెంచడంపైనా సమావేశంలో చర్చ జరిగింది. ఇందులో భాగంగా బార్లలో అమ్మే మద్యం ధరలను పెంచాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 
 
నాటు సారా తయారుచేసినా, మద్యాన్ని స్మగ్లింగ్‌ చేసినా, కల్తీ చేసినా కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఇలాంటి నేరాలకు పాల్పడితే నాన్‌బెయిల్‌బుల్‌ కేసులు పెట్టాలన్నారు. ఆరు నెలల జైలు శిక్ష విధించేలా చట్టంలో సవరణలు తీసుకురావాలన్నారు. బార్‌ యజమానులు నియమాలను ఉల్లంఘిస్తే లైసెన్స్‌ ఫీజుకు 5 రెట్లు జరిమానా విధించాలన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే దీనికి సంబంధించి బిల్లును తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు. 
 
ఇసుక అక్రమాలకు పాల్పడితే రూ.2 లక్షల జరిమానా తోపాటు 2ఏళ్ల జైలు శిక్ష విధించే నిర్ణయంపై చట్ట సవరణకు బిల్లు తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఈ అసెంబ్లీలో సమావేశాల్లోనే మద్యం, ఇసుక అక్రమాల నిరోధాలకు సంబంధించిన రెండు బిల్లులనూ ప్రవేశపెట్టి సంబంధిత చట్టాలకు సవరణ చేయాలని సీఎం వైయస్‌.జగన్‌ అధికారులకు స్పష్టం చేశారు. వీటితోపాటు మద్యం, ఇసుక స్మగ్లింగ్‌లను అరికట్టడానికి చెక్‌పోస్టుల వద్ద గట్టి నిఘాను ఏర్పాటుచేయాలన్నారు. నైట్‌విజన్‌ సీసీ కెమెరాలను ఏర్పాటుచేయాలని, అలాగే ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాల వద్దకూడా సీసీ కెమెరాలు ఉండాలని సీఎం ఆదేశించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తాగిన మైకంలో కన్నతల్లి, సోదరి, తమ్ముడి భార్యపై అత్యాచారం.. వాళ్లే చంపేశారు..