ప్రేమించలేదనే కారణంతో బాలికపై బాలుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలిక మృతిచెందింది. బాలుడికి కూడా మంటలు అంటుకోవడంతో గాయాలయ్యాయి. ఏపీలోని నంద్యాల జిల్లా నందికొట్కూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. వెల్దుర్తి మండలం సామర్లకోటకు చెందిన బాలిక, కలుగొట్లకు చెందిన బాలుడు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. అయితే, బాలుడు కొంతకాలంగా బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ విషయం బాలిక తన పేరెంట్స్‌కు చెప్పింది. దాంతో వారు బాలికను ఆమె అమ్మమ్మ ఉండే నందికొట్కూరుకు పంపించారు.
అయినా బాలుడి వేధింపులు ఆగలేదు. అక్కడికెళ్లి వేధింపులకు గురిచేశాడు. ఆదివారం అర్ధరాత్రి దాటాక ఆ బాలుడు ఆమె ఉంటున్న ఇంటికి మళ్లీ వెళ్లాడు. బాలిక నిద్రిస్తున్న గదికి వెళ్లి తలుపు కొట్టాడు. దాంతో బాలిక డోర్ తెరిచింది. వెంటనే లోపలికి వెళ్లిన బాలుడు గడియ పెట్టేశాడు. ఆ తర్వాత కాసేపటికే బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
దాంతో బాలిక గట్టిగా కేకలు పెడుతూ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. బాలుడికి కూడా నిప్పు అంటుకోవడంతో గడియ తీసి బయటకు పరుగులు పెట్టాడు. అతడు పారిపోతుండగా కుటుంబ సభ్యులు, స్థానికులు పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కాలిన గాయాలతో ఉన్న అతడిని 108 వాహనంలో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.