భార్యతో జరిగిన గొడవలో భర్త ఆమెను హతమార్చాడు. దీంతో జైలుపాలైన భర్త ఆరు నెలల తర్వాత బెయిల్‌పై వచ్చి..భార్య సమాధి వద్దే ఉరి వేసుకుని చనిపోయాడు. ఈ చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రామకుప్పం మండలం బైపరెడ్లపల్లికి చెందిన గంగిరెడ్డి, సుజాత దంపతులు బెంగళూరుకు వలస వెళ్లారు. కూరగాయల వ్యాపారం చేసుకుంటూ అక్కడే స్థిరపడ్డారు.
మనస్పర్థల కారణంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ గొడవల్లో భర్త చేతిలో భార్య హతమైంది. అటుపై పోలీసులకు లొంగిపోయిన గంగిరెడ్డిని కోర్టు జైలుకు పంపించింది.
ఆరు నెలల పాటు జైలులో గడిపిన గంగిరెడ్డి ఇటీవలే బెయిల్ పై విడుదలయ్యాడు. శనివారం సుజాత సమాధి వద్ద ఓ చెట్టుకు వేలాడుతున్న గంగిరెడ్డి మృతదేహం కనిపించింది. భార్యను చంపేసినందుకు పశ్చాత్తపంతో గంగిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు.