ఆస్కార్ విజేత అయిన 'ఆర్ఆర్ఆర్' చిత్రాన్ని నిర్మించిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మాణంలో ఒక భారీ యాక్షన్ డ్రామా కోసం యువ ప్రతిభావంతుడు, దర్శకుడు సుజీత్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జత కట్టారు. దేశంలోని ప్రముఖ నటీనటులతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తుండగా, ప్రముఖ హిందీ నటుడు ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.
OG 3rd schdule teamphoto
హైదరాబాద్‌లో తాజా షెడ్యూల్ పూర్తి కావడంతో, ఈ చిత్రం 50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. "యాక్షన్, ఎపిక్‌నెస్ మరియు డ్రామా... మూడు అద్భుతమైన షెడ్యూల్‌లు పూర్తయ్యాయి, దుమ్ము రేపాయి. ఓజీ చిత్రీకరణ 50 శాతం పూర్తయింది. రాబోయే షెడ్యూల్స్ మరింత ఆసక్తికరంగా ఉండనున్నాయి" అంటూ ఈ విషయాన్ని డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ఈరోజు సోషల్ మీడియా ద్వారా తెలిపింది. తాజాగా పూర్తయిన షెడ్యూల్ పట్ల చిత్ర బృందమంతా ఎంతో ఆనందంగా ఉంది.
చిత్రీకరణ సమయంలో సుజీత్ అద్భుతమైన ప్రణాళిక మరియు సమన్వయంతో, పాన్-ఇండియన్ తారాగణం నటిస్తున్న సంక్లిష్టమైన సన్నివేశాలను కూడా సులభంగా చిత్రీకరిస్తూ ఉత్తమమైన అవుట్ పుట్ రాబడుతుండటం పట్ల మేకర్స్ సంతోషంగా ఉన్నారు. జూలై, ఆగస్ట్ లో జరగనున్న షెడ్యూల్స్‌తో, మొత్తం షూటింగ్‌ను త్వరగా ముగించాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు వచ్చిన అవుట్‌పుట్ పట్ల టీమ్ చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా థియేటర్‌లలో ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని అందిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది.
ఇటీవల ఓజీ యొక్క కొన్ని రష్‌లను చూసిన అర్జున్ దాస్, విజువల్స్ మరియు పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ చూసి తాను ఫిదా అయ్యాయని, ఇది నిజమైన 'అగ్ని తుఫాను' అని పేర్కొన్నారు. అలాగే శ్రియా రెడ్డి మరియు ఇమ్రాన్ హష్మీ ఇద్దరూ కూడా తాము ఓజీ కథని ఎంతలా ఇష్టపడ్డారో ఇప్పటికే చెప్పారు. పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జోడిని తెరపై చూడాలని సినీప్రియులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.
దర్శకుడు సుజీత్ అద్భుతమైన యాక్షన్ చిత్రాన్ని అందించాలని ఎక్కడా రాజీ పడకుండా తెరకెక్కిస్తున్నారు. అత్యంత భారీ స్థాయిలో రూపొందుతోన్న ఈ చిత్రానికి రవి కె చంద్రన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తుండగా, ఎస్ థమన్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర ఆసక్తికరమైన వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.