వచ్చే ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని ఆయన అభిమానులు ఏ విధంగా కోరుకుంటున్నారో అదే విధంగా తాను కూడా కోరుకుంటున్నట్టు వైకాపా మంత్రి, కోనసీమ జిల్లా నేత విశ్వరూప్ అన్నారు. ఆయన శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారి మూలమూర్తిని ఆయన దర్శించున్నారు.
ఆ తర్వాత ఆయన ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ పార్టీ నాయకుడైనా పాదయాత్ర, వారాహి యాత్ర, బస్సుయాత్ర చేసుకోవచ్చని, ఇందులో తప్పేమి లేదన్నారు. పవన్ సీఎం కావాలంటే రాష్ట్రంలోని ఆ పార్టీ 175 స్థానాల్లో పోటీచేసి 88 సీట్లు సాధించాలని, లేనిపక్షంలో వంద స్థానాల్లో పోటీచేసైనా 50 సీట్లలో గెలిచి సీఎం కావడానికి ప్రయత్నించాలని సూచించారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగుతోందని, నాలుగేళ్లలో ఒక్క మండలాన్నీ కరవు ప్రాంతంగా ప్రకటించలేదని ఆయన గుర్తు చేశారు. నవరత్నాలతో పేదల సంక్షేమమే లక్ష్యంగా సీఎం పనిచేస్తున్నారని, మున్ముందు కూడా మరింతగా అభివృద్ధి చేసేందుకు ఆయన కృషిచ చేస్తున్నారని తెలిపారు.