ఏపీలో వచ్చే యేడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఇందుకోసం అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. అధికార వైకాపా కూడా వచ్చే ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతుంది. ఇందులోభాగంగా, ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ పార్టీ ఎమ్మెల్యేలతో వర్క్‌షాప్ నిర్వహిస్తూ వారి పనితీరును ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తున్నారు.
తాజాగా నిర్వహించిన వర్క్‌షాపులో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు చర్చనీయాంశంగా మారాయి. పనితీరు మెరుగుపరుచుకోలేని వారికి టిక్కెట్ ఇవ్వలేనని తెగేసి చెప్పారు. ముఖ్యంగా 18 మంది ఎమ్మెల్యేల పనితీరు ఏమాత్రం బాగోలేదని, వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ రాకుంటే వారు తనను నిందించవద్దని ముఖాన్నే చెప్పేశారు. ఆ 18 మందిని తాను వ్యక్తిగతంగా పిలిచి మాట్లాడుతానని తెలిపారు. అయితే, ఆ 18 మంది ఎమ్మెల్యేలు ఎవరన్నది ఇపుడు చర్చనీయాశంగా మారింది. మరోవైపు ఆ 18 మంది ఎమ్మెల్యేలు వీరేనంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
జగన్ అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది "గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం"లో పాల్గొనలేని వారే ఉన్నారని, వీరిలో పినిపె విశ్వరూప్, గుడివాడ అమర్నాథ్, కొట్టు సత్యనారాయణ, జోగి రమేశ్, తానేటి వనిత, ఆర్కే రోజా, అనిల్ కుమార్ యాదవ్, అవంతి శ్రీనివాస్, కొడాలి నాని, మేకతోటి సుచరిత, పాముల పుష్ప శ్రీవాణి, కారుమూరి నాగేశ్వరరావు, బాలినేని శ్రీనివాసరెడ్డి, వసంత కృష్ణ ప్రసాద్, కోలగట్ల వీరభద్ర స్వామి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, రెడ్డి శాంతి, గ్రంథి శ్రీనివాసరావులు ఉన్నట్టు పెద్ద ప్రచారమే సాగుతోంది. అయితే, ఈ జాబితా నిజమో కాదో సీఎం జగన్ అధికారికంగా స్పష్టం చేయాల్సివుంది.