గానకోకిలమ్మ ఎస్. జానకి ఇక పాడరు. మైసూరులో చివరి సంగీత విభావరిలో పాల్గొన్నారు. తన సుస్వర ప్రస్థానానికి ఎక్కడైతే శ్రీకారం చుట్టారో అక్కడే ముగింపు పలకడం గమనార్హం.
గానకోకిలమ్మ ఎస్. జానకి ఇక పాడరు. మైసూరులో చివరి సంగీత విభావరిలో పాల్గొన్నారు. తన సుస్వర ప్రస్థానానికి ఎక్కడైతే శ్రీకారం చుట్టారో అక్కడే ముగింపు పలకడం గమనార్హం. దివంగత గాయకుడు పి.బి.శ్రీనివాస్‌తో కలిసి జానకి 1952లో ఇక్కడి నుంచే పాటలను ఆలపించారు.
పలు చిత్రాలకు నేపథ్యగానాన్ని అందించిన ఆమె గత కొంతకాలంగా వేదికలపై పాటల్ని పాడటాన్ని నిలిపివేసిన విషయం విదితమే. ఒక సంస్థకు విరాళాలను సమకూర్చేందుకు ఆమె రాచనగరి మైసూరులో శనివారం రాత్రి జరిగిన తన చివరి సంగీత విభావరిలో పాల్గొన్నారు.
తన సంగీత రవళులకు జన్మనిచ్చిన మైసూరులోనే ఈ ప్రస్థానానికి ముగింపు పలకడం ద్వారా ఈ పట్టణంపై మమకారాన్ని, కృతజ్ఞతను చాటుకున్నారు. ఆమెకు వీరాభిమానులు ప్రవీణ్, పవన్, నవీన్‌ల విన్నపం మేరకు ఒక స్వచ్ఛంద సంస్థకు సహాయాన్ని అందించేందుకు చివరిసారిగా ఈ వేదికపై పాడేందుకు ఆమె అంగీకరించారని నిర్వాహకులు తెలిపారు.
ఎక్కువ మంది సంగీతాభిమానులు తరలివచ్చి ప్రత్యక్షంగా ఆమె పాటలను విని పులకించారు. ఈ సందర్భంగా రాజవంశస్తురాలు ప్రమోదా దేవి ఒడయారు, అలనాటి నాయికలు జయంతి, భారతీ విష్ణువర్ధన్‌లు ఆమెను ఘనంగా ఈ సందర్భంగా సత్కరించారు.