Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జగడం' రీమేక్ చెయ్యాలని ఉందిః సుకుమార్

Webdunia
మంగళవారం, 16 మార్చి 2021 (08:03 IST)
Ram, Sukumar
పదిహేడేళ్ల కుర్రాడు కొత్తగా గ్యాంగ్‌లో జాయిన్ అయ్యాడు. కొట్లాటకు గ్యాంగ్ సభ్యులతో కలిసి వెళ్ళాడు. ఎదురుగా పెద్ద గ్యాంగ్ ఉంది. వాళ్ళను చూసి కుర్రాడి గ్యాంగ్ లీడర్ భయపడ్డాడు. వెనకడుగు వేశాడు. కానీ, కుర్రాడు వేయలేదు. చురకత్తుల్లాంటి చూపులతో తనకంటే బలవంతుడిని ఢీ కొట్టాడు. ధైర్యంగా నిలబడ్డాడు. ఈ సీన్‌కి రాజమౌళి కూడా ఫ్యాన్.
 
గ్యాంగ్‌కి కుర్రాడు కొత్త. కాని సినిమా ఇండస్ట్రీకి, ప్రేక్షకులకు కాదు. అప్పటికి 'దేవదాసు'తో అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు. అయితే, ఈ సీన్‌తో మాస్ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. యాక్షన్ హీరోకి కావాల్సిన లక్షణాలు ఇతడిలో ఉన్నాయని పేరు తెచ్చుకున్నాడు. పైన చెప్పినది 'జగడం'లో సీన్ అని గుర్తొచ్చి ఉంటుంది కదూ! ఆ ఎనర్జిటిక్ హీరోయే మన ఉస్తాద్ రామ్. 
 
హీరోగా రామ్‌కి, దర్శకుడిగా సుకుమార్‌కీ 'జగడం' ఎంతో పేరు తెచ్చింది. రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా పైన చెప్పిన సీన్ గురించి ప్రస్తావించారంటే అందులో స్ట్రెంగ్త్ అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ 'జగడం (వయలెన్స్) ఈజ్ ఫ్యాషన్', '5 ఫీట్ 8 ఇంచెస్ కింగు లాంటి శీనుగాడు' పాటలు యూత్ ప్లే లిస్టులో ఉంటున్నాయి. ఓవర్ ద ఇయర్స్ ప్రేక్షకులలో అభిమానులను పెంచుకుంటూ వస్తున్న 'జగడం' సినిమా విడుదలై మార్చి 16కి 14 వసంతాలు పూర్తి చేసుకుని 15వ ఏట ప్రవేశిస్తోంది.ఈ సందర్భంగా సినిమా విశేషాలను, అప్పటి సంగతులను దర్శకుడు సుకుమార్ మరోసారి గుర్తు చేసుకున్నారు.
 
ఆ ఆలోచన నుంచి. 'జగడం
చిన్నప్పటి నుంచి ఒక విషయం నాకు ఇన్స్పిరేషన్ గా ఉండేది. ఎక్కడైనా గొడవ జరుగుతుంటే... నేను వెళ్ళేసరికి ఆగిపోతుండేది. కొట్టుకుంటారేమో, కొట్టుకుంటే ఎలా ఉంటుందో చూడాలని ఉండేది. నేను ఎదుగుతున్న క్రమంలోనూ ఆ ఆలోచన పోలేదు. ఎక్కడైనా కొట్లాటలో వాళ్ళు కొట్టుకోలేదంటే డిజప్పాయింట్ అయ్యేవాడిని. నా స్నేహితులైనా అరుచుకుంటుంటే బాధ అనిపించేది. వీళ్ళు కొట్టుకోవడం లేదేంటి? అని! ఎక్కడో మనలో వయలెన్స్ ఉంది. వయలెన్స్ చూడాలని తపన ఉంది. ఉదాహరణకు, అడవిని తీసుకుంటే అందులో ప్రతిదీ వయలెంట్ గా ఉంటుంది. పులి-జింక తరహాలో ఒకదాని మీద మరొకటి ఆధారపడి ఉంటాయి. ఎక్కడ చూసినా బ్లడ్ ఉంటుంది. 'ఆహారాన్ని సాధించే దారి అంతా వయలెన్స్ తో ఉంటుంది. అలాగే, సెక్స్ ను సాధించే దారి ప్రేమతో ఉంటుంది.' - ఇలా ఎదో అనుకున్నాను. దాని నుంచి మొదలైన ఆలోచనే జగడం. మన చుట్టుపక్కల చూస్తే... చిన్నపిల్లలు ఎవరైనా పడిపోతే, దెబ్బ తగిలితే... 'నిన్ను కొట్టింది ఇదే నాన్నా' అని రెండుసార్లు కొట్టి చూపిస్తాం. ఇటువంటి విషయాలు నాలో కనెక్ట్ అయ్యి ఓ సినిమా సినిమా చేద్దామని అనుకున్నా. రివెంజ్ ఫార్ములాలో.
 
Ram jagadam
ఆర్య' కంటే ముందే.
నిజాయతీగా చెప్పాలంటే... 'ఆర్య' కంటే ముందు 'జగడం' చేద్దామనుకున్నా. నా దగ్గర చాలా ప్రేమకథలు ఉన్నాయి. 'ఆర్య' తర్వాత వాటిలో ఏదైనా చేయవచ్చు. వయలెన్స్ నేపథ్యంలో కొత్తగా ఏదైనా చేద్దామని అనుకున్నా. అప్పటికి నాలో ఆలోచనలు రకరకాలుగా మారి 'జగడం' కథ రూపొందింది. 
 
రామ్... అంత షార్ప్
'జగడం' కథ పూర్తయిన సమయానికి 'దేవదాసు' విడుదలై ఏడు రోజులు అయినట్టు ఉంది. నేను సినిమా చూశా. రామ్ చాలా ఉత్సాహంగా ఉన్నాడు. హుషారుగా చేస్తున్నాడు. ఎఫ‌ర్ట్‌లెస్‌గా పెర్ఫార్మన్స్ చేస్తున్నాడని అనిపించింది. రామ్‌తో 'జగడం' చేయాలని 'స్రవంతి' రవికిశోర్ గారిని అప్రోచ్ అయ్యాం. ఆయన సరే అన్నారు. అలా 'జగడం' మొదలైంది. అప్పుడు రామ్‌కి పదిహేడేళ్లు అనుకుంట. ఆ టైమ్‌లో ఏం చెప్పినా చేసేసేవాడు. 'నాకు రాదు. రాలేదు. చేయలేను' అనే మాటలు ఉండేవి కావు. చేత్తో కాయిన్ తిప్పమని అడిగితే... పక్కకి వెళ్లి పది నిమిషాల్లో ప్రాక్టీస్ చేసి వచ్చి చేసేవాడు. అంత షార్ప్. నాకు తెలిసి... ఇప్పటికీ రామ్‌ని ఆ బ్రిలియన్స్ కాపాడుతుంది. దానివల్లే తను సక్సెస్ అవుతుంది. తన పెర్ఫార్మన్స్ ఇంప్రూవ్ అవుతూ వస్తుంది.
 
రామ్ మంచి స్థాయికి వస్తాడని అప్పుడే అనుకున్నా
నేను ప్రతిక్షణం రామ్‌ను చూసి షాక్ అవుతూ ఉండేవాడిని. అంటే... చిన్న వయసులో ప్రతిదీ ఈజీగా చేయగలుగుతున్నాడు. వెంటనే పట్టుకుని పెర్ఫార్మన్స్ చేయగలుగుతున్నాడు. ఈ సన్నివేశంలో ఇలా కాకుండా వేరేలా చేస్తే బావుంటుందని అడిగితే... మనం కోరుకున్న దానికి తగ్గట్టు ఎక్స్‌ప్రెష‌న్స్‌ వెంటనే మార్చి చేసేవాడు. అన్ని రియాక్షన్స్ ఉండాలంటే ఎక్కువ లైఫ్ ఎక్స్‌పీరియ‌న్స్‌లు ఉండాలి. అప్పటికి తనకు ఎటువంటి లైఫ్ ఎక్స్‌పీరియ‌న్స్‌లు ఉన్నాయో తెలియదు కానీ... ఎటువంటి రియాక్షన్ అడిగినా చేసి చూపించేవాడు. 'జగడం' చేసే సమయానికి రామ్‌ను చూస్తే వండర్ బాయ్ అనిపించాడు. ఇండస్ట్రీలో రామ్ మంచి స్థాయికి వస్తాడని అప్పుడే అనుకున్నాను. ఈ రోజు అదే ప్రూవ్ అయ్యింది.
 
ప్రతి పాట హిట్టే
'ఆర్య'తో దేవిశ్రీ ప్రసాద్‌తో నాకు అనుబంధం ఉంది. 'జగడం' చిత్రానికీ తనను సంగీత దర్శకుడిగా తీసుకున్నాను. ఇద్దరి మనుషుల మధ్య ప్రేమ కాకుండా రెండు వస్తువుల మధ్య ప్రేమ ఉంటే ఎలా ఉంటుంది? - ఈ కాన్సెప్ట్ నుంచి వచ్చిందే '5 ఫీట్ 8 ఇంచెస్' సాంగ్. చంద్రబోస్ గారికి నేను ఈ కథ అనుకున్నాని చెబితే వెంటనే పాట రాసిచ్చారు. దానికి దేవి ట్యూన్ చేశారు. అదే 'వయలెన్స్ ఈజ్ ప్యాషన్'. సినిమాలో ప్రతి పాట హిట్టే. అప్పట్లో 'జగడం' ఆల్బమ్ సెన్సేషన్. సినిమాకి తగ్గట్టు దేవి మౌల్డ్ అవుతాడు. మంచి నేపథ్య సంగీతం ఇస్తాడు. 'జగడం' పతాక సన్నివేశాల్లో నేపథ్య సంగీతాన్ని నేను ఇప్పటికీ హమ్ చేస్తూ ఉంటాను.
 
వయలెన్స్' ఎందుకు 'జగడం'గా మారిందంటే
వయలెన్స్ ను ఎక్కువ ఎగ్జాగరేట్ చేస్తున్నారని, గ్లామరస్ గా చూపిస్తున్నారని సెన్సార్ సభ్యులు అభ్యంతరం చెప్పారు. అందువల్ల 'వయలెన్స్ ఈజ్ ప్యాషన్' పాటలో వయలెన్స్ బదులు 'జగడం' అని పెట్టాల్సి వచ్చింది. అప్పట్లో సెన్సార్ లో చాలా పోయాయి. సినిమా కథనమే మిస్ అయింది. అప్పట్లో నాకు సెన్సార్ ప్రాసెస్ గురించి పూర్తిగా తేలికపోవడం వల్ల చాలా కట్స్ వచ్చాయి. కట్స్ లేకుండా సినిమా ఉంటే ఇంకా బావుండేది. సినిమాకు సరైన అప్రిసియేష‌న్‌ రాలేదేమో అని నాలో చిన్న బాధ ఉంది.
 
స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్‌... సూపర్35... సినిమాటోగ్రఫీ
సినిమాటోగ్రాఫర్ రత్నవేలుగారు ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ది బెస్ట్ 'జగడం' అని చెప్పొచ్చు. ఎందుకంటే... అప్పుడే chooke s4 లెన్స్ వచ్చాయి. అప్పట్లో స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్‌ తన సినిమాలకు ఏ కెమెరా ఎక్విప్‌మెంట్ ఉపయోగించారో, మేమూ అదే ఎక్విప్‌మెంట్ ఉపయోగించాం. సూపర్ 35 ఫార్మాట్ లో షూట్ చేశాం. అప్పటివరకు మన దగ్గర ఎవరూ ఆ ఫార్మాట్ లో ఎవరూ చేయలేదు.  కెమెరా యాంగిల్, లైటింగ్ మూడ్... రత్నవేలు ప్రతిదీ డిస్కస్ చేసి చేసేవారు. ప్రతిదీ పర్ఫెక్ట్ షాట్ అని చెప్పొచ్చు. ఇండియాలో సినిమాటోగ్రఫీ పరంగా చూస్తుంటే... వన్నాఫ్ ది బెస్ట్ 'జగడం' అని చెప్పొచ్చు. ఆ క్రెడిట్ మొత్తం రత్నవేలుగారిదే. సినిమాటోగ్రఫీనీ అప్రిషియేట్ చేయలేదు. ఆ సినిమా ఫొటోగ్రఫీ నాకు ఎంతో ఇష్టం. 
 
ముంబైలో దర్శకుల దగ్గర... లైబ్రరీల్లో 'జగడం
ఎడిటింగ్ కూడా సూపర్. ఆ సినిమాకి శ్రీకర్ ప్రసాద్ గారు ఎడిటింగ్ చేశారు. సినిమా విడుదలైన కొన్నాళ్లకు ఒకసారి మేమిద్దరం ఫ్లైట్‌లో కలిశాం. మాటల మధ్యలో 'జగడం' గురించి వచ్చింది. 'ప్లాప్ సినిమా కదా. మాట్లాడుకోవడం ఎందుకు అండీ' అన్నాను. అందుకు 'అలా అనుకోవద్దు. నేను ముంబై నుంచి వస్తున్నాను. చాలామంది దర్శకుల దగ్గర, వాళ్ళ లైబ్రరీల్లో జగడం సినిమా ఉంది. నీకు అంతకన్నా ఏం కావాలి? చాలామంది నీకు ఫోనులు చేయలేకపోవచ్చు. నిన్ను కలవడం వాళ్ళకు కుదరకపోవచ్చు. కానీ, చాలా అప్రిసియేషన్ పొందిన సినిమా ఇది. టెక్నీషియన్స్ దానిని రిఫరెన్స్ గా పెట్టుకున్నారు' అని శ్రీకర్ ప్రసాద్ గారు చెప్పారు.      
 
నిర్మాత గురించి
చిత్రనిర్మాణంలో చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ జేడీ సోంపల్లిగారు ఎంతో మద్దతుగా నిలిచారు. వాళ్ళ అబ్బాయి ఆదిత్యబాబు తరపున ఆయన సినిమా నిర్మించారు. ఆదిత్య ఇప్పటికీ నాతో టచ్ లో ఉంటాడు. నా ఫంక్షన్లకు తనను కూడా పిలుస్తాను.
 
ఆరు నెలలు ఆడిషన్స్ చేశాం
అప్పట్లో ఆర్టిస్టులు చాలా తక్కువ మంది. ఇప్పుడు షార్ట్ ఫిలిమ్స్ వస్తున్నాయి. వెబ్ సిరీస్ లు వచ్చాయి. చాలామంది ఆర్టిస్టులు దొరుకుతున్నారు. అప్పుడు అలా కాదు కాబట్టి ఎక్కువ ఆడిషన్స్ చేశాం. సుమారు ఆరు నెలలు 'జగడం' ఆడిషన్స్ జరిగి ఉంటాయి. తాగుబోతు రమేష్, వేణు, ధనరాజ్... ఇలా ఆ సినిమా నుంచి చాలామంది ఆర్టిస్టులు వచ్చారు. ఇప్పటికి వాళ్ళు అదే గౌరవం, ప్రేమతో చూస్తారు. 
 
త్వరలో రామ్‌తో సినిమా చేస్తా
రామ్‌తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. త్వరలో మళ్ళీ తప్పకుండా చేస్తా. మరో మంచి సినిమా చేయాలి. యాక్చువల్లీ... ఇప్పటి రామ్‌తో మళ్ళీ 'జగడం' రీమేక్ చేయాలని ఉంది. మళ్ళీ ఇప్పటి రామ్‌తో మళ్ళీ జగడం చూసుకోవాలని ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గుజరాత్ గిఫ్ట్ సిటీ తరహాలో అమరావతి... తొలి పైప్ గ్యాస్ సిటీగా...

మరింతగా బలపడిన అల్పపీడనం.. నేడు ఉత్తరాంధ్రలో అతి భారీ వర్షాలు

వృద్ధుడిని వెయిట్ చేయించిన ఉద్యోగులు.. నిల్చునే ఉండాలని సీఈఓ పనిష్​మెంట్... (Video)

వన్ నేషన్-వన్ ఎలక్షన్: దేశమంతా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా

కేటీఆర్‌ను కలవలేదు.. కనీసం ఫేస్ టు ఫేస్ చూడలేదు.. దువ్వాడ మాధురి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter drinks శీతాకాలంలో ఆరోగ్యాన్నిచ్చే డ్రింక్స్

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

తర్వాతి కథనం