కామమంటే ఏదో కావాలనే కోరికే కదా.. దాన్ని కొంచెం పక్కకు మళ్లించి భగవంతుడు కావాలని కోరుకో సరిపోతుంది.. అన్నారు.. రామకృష్ణ పరమ హంస. ఆత్మ సాక్షాత్కారము ఒక కోరికే. భగవతానుభూతి పొందినప్పుడు సాధకుడు సకల కోరికల నుంచి ముక్తుడవుతాడు. సాధకుడు కోరుకునే మోక్షనం జ్ఞాన వైరాగ్యాల వల్లనే సంప్రాప్తిస్తుంది. జ్ఞాన వైరాగ్యాలు పొందిన మహనీయుడికి కోరికల చిట్టా వుండదు.
భగవంతుడిపై ప్రేమను ఎంతగా పెంచుకుంటే.. అంతగా ప్రాపంచిక కోరికల ఉధృతి తగ్గించుకోవడం సాధ్యమవుతుంది. ఆ దిశగా సాధన చేయడమే సాధకుడి కర్తవ్యం అన్నారు.. రామకృష్ణగారు.. ఇక ఈ రోజు రామకృష్ణ పరమహంస జయంతి. ఆధ్యాత్మిక గురువు అయిన ఆయన జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం. విభిన్న మతాలు భగవంతుడిని చేరడానికి విభిన్న మార్గాలు అని అనుభవపూర్వకంగా మొట్టమొదటిసారిగా ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తి. 19వ శతాబ్దపు "బెంగాల్ సాంస్కృతిక పునరుజ్జీవనం"లో ఈయన ప్రభావము చాలా ఉంది.
భారతదేశములో మతగురువుల బోధనలకు ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇచ్చి, తేదీలు, ఇతర విషయాలకు తక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు. కాని రామకృష్ణుని జీవితములోని చాలా విషయములకు ఎన్నో ఆధారాలున్నాయి. రామకృష్ణులకు తల్లిదండ్రులు పెట్టిన పేరు గదాధరుడు. గదాధర్ క్రీ.శ 1836, ఫిబ్రవరి 18 న పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లాలోని కామార్పుకూర్ అనే కుగ్రామంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు క్షుదీరామ్, చంద్రమణిదేవి.
వీరు చాలా పేదబ్రాహ్మణులైనప్పటికీ ధార్మికులు. గదాధరుడు అందగాడు, బాల్యం నుండే ఇతనికి లలితకళలు, చిత్రలేఖనములో గల ప్రవేశము వలన వారి గ్రామంలో ఇతనికి మంచిపేరు ఉండేది. అయితే చదువు మీద కానీ, ధన సంపాదన మీద కానీ ఆసక్తి చూపించేవాడు కాదు.
ప్రకృతిని ప్రేమిస్తూ, గ్రామం బయట పండ్ల తోటలలో స్నేహితులతో కలసి సమయాన్ని గడిపేవాడు. దానివలన చదువు అబ్బలేదు. పూరీకి వెళ్ళు సాధువులు వీరి గ్రామం గుండా వెళ్ళేవారు. వారు ఆ గ్రామంలో ఆగి ప్రసంగిచేటప్పుడు రామకృష్ణుడు ఎంతో శ్రద్ధగా వినేవాడు. వారికి సేవలు చేసి వారి మత వాగ్యుద్ధాలను ఆసక్తితో వినేవాడు.
మొదట తిరస్కరించినా తర్వాత అన్నగారికి సహాయంగా రామకృష్ణులు దక్షిణేశ్వర కాళికాలయములో పూజలో సేవచేసేవాడు. గుడిలో ఉన్నది నిజంగా రాతి విగ్రహమేనా లేక సజీవమూర్తా అని అది తెలుసుకోవడానికి ప్రయత్నించాడు. ఒకవేళ సజీవ దేవతను పూజిస్తే కనుక ఆ దేవత ఎందుకు సమాధానము ఇవ్వడము లేదు? అనుకొనేవాడు. ఈ ప్రశ్న ఆతనిని రాత్రి, పగలు కలచివేసింది.
ఇక కాళికా దేవిపై తీవ్ర భక్తిభావంలో నిమగ్నమయ్యి రేయింబవళ్ళు అమ్మవారి ధ్యాసలోనే ఉండేవాడు. రాత్రిళ్ళు అడవిలో కూర్చొని ప్రార్థించేవాడు. ఒకనాడు అమ్మవారి దర్శనము పొందాడు. అప్పటి నుండి నిరంతరమూ అమ్మవారి దర్శనభాగ్యం పొందేవాడు. నిజంగా ఒక మనిషికి చేసే సేవలలాగానే అమ్మవారి విగ్రహాన్ని పూజించేవాడు.
ఇంకా తృప్తి పొందక ఇతర మతములలో పరమ సత్యమును తెలిసికొనుటకై ప్రార్థించేవాడు. కొంతమంది గురువులు ఆతని దగ్గరకు వచ్చి అన్ని మతములలో పరమ సత్యము సాక్షాత్కరించుకున్నాడని గ్రహించారు. ఈ మాట అన్ని ఊళ్ళలో వ్యాప్తి చెంది అన్ని మతముల వారు రామకృష్ణుని దర్శనానికి వచ్చేవారు. ఈ విధంగా భగవత్, ఆత్మ సాక్షాత్కారం పొందిన తర్వాత ఇస్లాం, క్రైస్తవ మార్గాలలో కూడా సాధన చేసి ఆ మార్గాలలోకూడా ఫలితం పొందారు. అలా అన్నిమతాల సారాంశం ఒక్కటే అని అనుభవపూర్వకంగా గ్రహించారు.
ఇక ఐదు ఏళ్ళ శారదా దేవితో ఆతని పెళ్ళి నిశ్చయమైనది. శారద రామకృష్ణుని మొదటి శిష్యురాలు. తాను గురువుల వద్ద నేర్చుకున్న విద్యలన్నీ ఆమెకు నేర్పారు. ఆమె గ్రహణ శక్తికి మెచ్చి ఆమెను త్రిపుర సుందరి శక్తిగా పూజించడము మొదలు పెట్టాడు. ఆమెను సాక్షాత్ కాళికాదేవిలా భావించి పూజించారు. ఆమెను కూడా తనంతటి వారిగా తీర్చిదిద్దారు. ఆధ్యాత్మిక గురువుల జీవితాల్లో స్త్రీ, పురుషుల మధ్య ఇలా జీవితకాలమంతా ఆధ్యాత్మిక సంబంధము ఉండడము ఇంకెక్కడా కానరాదు. రామకృష్ణుని మరణానంతరము శారదా దేవి ఆధ్యాత్మిక దీక్షలు ఇవ్వసాగారు.
స్వామి వివేకానంద, స్వామి బ్రహ్మానంద, స్వామి ప్రేమానంద, స్వామి శివానంద, స్వామి త్రిగుణాతీతానంద, స్వామి అభేదానంద, స్వామి తురీయాతీతానంద, స్వామి శారదానంద, స్వామి అద్భుతానంద, స్వామి అద్వైతానంద, స్వామి సుభోదానంద, స్వామి విజ్ఞానానంద, స్వామి రామకృష్ణానంద, స్వామి అఖండానంద, స్వామి యోగానంద, స్వామి నిరంజనానంద. వీరి ద్వారా రామకృష్ణమిషన్ స్థాపించబడి నేటికీ ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తోంది. వీరు సన్యాస శిష్యులు. గృహస్థ శిష్యులలో నాగమహాశయులు, మహేంద్రనాథ్ గుప్తా, పూర్ణుడు, గిరీష్ ఘోష్ మొదలగువారు ప్రముఖులు.
వీరు కాలక్రమంలో క్యాన్సర్ వ్యాధితో బాధపడ్డారు. తన నివాసాన్ని ఆరోగ్యరీత్యా దక్షిణేశ్వరం నుండి కాశిపూర్‌కు మార్చారు. అప్పుడు శిష్యులు అందరూ ఎంతో సేవచేశారు. చనిపోవడానికి మునుపు ఒకరోజు తన ఆధ్యాత్మిక శక్తులన్నిటినీ స్వామి వివేకానందునికి ధారపోసారు. 1886 ఆగష్టు 16న మహాసమాధిని పొందాడు.
అయన వదిలి వెళ్ళిన పదహారు మంది శిష్య సమ్మేళనమునకు స్వామీ వివేకానంద సారథ్యము వహించాడు. వివేకానంద ఆ తరువాత తత్త్వవేత్త, ఉపన్యాసకుడుగా ప్రసిద్ధి పొందాడు. రామకృష్ణుని సమకాలికులలో కేశవ చంద్ర సేన్, పండిట్ ఈశ్వర చంద్ర విద్యాసాగర్ ఆతని ఆరాధకులు.
అలాగే స్వామీ వివేకానందుని బోధనలలో చాలా భాగం రామకృష్ణులవే.
సృష్టిలో ఏకత్వము
అన్ని జీవులలో దైవత్వము
ఒక్కడే భగవంతుడు, సర్వమత ఐకమత్యము. అన్నిమతాల సారాంశం ఒక్కటే.
ఒక గమ్యానికి ఎన్నోమార్గాలున్నట్లే భగవంతున్ని చేరడానికి మతాలు కూడా మార్గాలే.
మానవ జీవితములో దాస్య కారకాలు కామము, స్వార్థము. కామకాంచనాలనుండి విడివడితే భగవంతున్ని పొందవచ్చు.