తితిదే ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర గోసంరక్షణశాలలో దేశవాళీ గోజాతి అభివృద్ధి కోసం ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి దూరదృష్టితో చేసిన ఆదేశం మేరకు అధికారులు పిండమార్పిడి విధానానికి శ్రీకారం చుట్టారు. తద్వారా అధిక పాల ఉత్పత్తి దిశగా గోశాల అడుగులు వేస్తోంది.
గోశాలలో సంతానోత్పత్తి సామర్థ్యం గల గోవులకు మేలుజాతి దేశవాలి గోజాతుల పిండాలను మార్పిడి చేసి కృత్రిమ గర్భధారణ కలిగించి, ఆశించిన ఫలితాలు పొందేందుకు పిండమార్పిడి విధానం దోహదపడుతుంది. దీనివల్ల అంతరించిపోతున్న భారతీయ గోజాతుల పరిరక్షణ, అభివృద్ధి సాధ్యమవుతుంది.
లక్ష్యాలు...
వివిధ రకాల దేశవాళీ గోజాతులను సంరక్షించి, అభివృద్ధి చేయవచ్చు. గోశాలలో దేశవాళీ గోవుల ఉత్పత్తులను పెంచవచ్చు. గోశాలను ఎక్కువ పాలదిగుబడినిచ్చే గోవులు కలిగిన గోశాలగా తీర్చిదిద్దవచ్చు. దేవస్థానానికి ప్రతిరోజూ అవసరమయ్యే పాలు మొత్తం ఇక్కడే ఉత్పత్తి చేయవచ్చు.
ప్రతిపాదిత ప్రాజెక్టు...
ప్రస్తుతం గోశాలలో ఉన్న పునరుత్పత్తి సామర్థ్యం కలిగిన గోవులలో పిండమార్పిడి విధానంలో గర్భధారణ చేసి త్వరితగతిన, వేగవంతమైన జన్యుపర లాభాలను పొందేందుకు వీలుగా ఈ ప్రాజెక్టును ప్రతిపాదించారు.
ఈ విధానం ద్వారా కృత్రిమ గర్భధారణ చేయించి పెయ్య దూడలనిచ్చే పిండాలను మార్పిడి చేసి తద్వారా ఉత్పన్నమయ్యే గిర్, ఒంగోలు మేలురకం జాతులతో తిరుపతి మరియు పలమనేరులోని గోశాలలను మెరుగుపరచడమే టిటిడి ఉద్దేశం.
పిండ మార్పిడి విధానం వల్ల ఫలితాలు...
సంవత్సరానికి ఒక గోవు ద్వారా ఒక దూడను పొందవచ్చు. ఈ విధానం వల్ల మందలో త్వరితగతిన జన్యుపరమైన మేలుజాతి పెయ్య దూడలు పుడతాయి. ఎక్కువ గోవులు ఉన్నతమైన బీజద్రవ్యం కలిగిన దూడలకు జన్మనిస్తాయి.
ప్రతిగోవు యొక్క ఈతల సంఖ్య పెరుగుతుంది. గోవుల రవాణా అవసరం తగ్గి వ్యాధి సంక్రమణ ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది. అరుదైన జన్యుపరమైన గోజాతిని పరిరక్షించి, విస్తరించవచ్చు.
టిటిడి మేలుజాతి జన్యుపరమైన లక్షణాలు కలిగిన దేశవాళీ గోవులను సంరక్షించి, పరిరక్షించి దేవస్థానం అవసరాలు తీర్చేందుకు దేశవాళీ గోవుపాలను విరివిగా ఉత్పత్తి చేయవచ్చు.