తిరుపతిలో పూర్తిస్థాయిలో చిన్నపిల్లల ఆసుపత్రి నిర్మాణానికి అనువైన 5 ఎకరాల స్థలాన్ని గుర్తించాలని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో సీనియర్ అధికారులతో ఈవో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులకు పార్కింగ్ సమస్య తలెత్తకుండా తిరుపతిలోని అలిపిరిలో, తిరుమలలోని అనువైన ప్రాంతంలో మల్టీలెవల్ కార్ పార్కింగ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తిరుమలలో భక్తులకు కనువిందు చేసేలా ముఖ్య కూడళ్లలో ఎత్తుగా పెరిగే బంతి పూల మొక్కలు పెంచాలన్నారు.
అలిపిరి నడకమార్గంలో భక్తులు ఇబ్బందులు పడకుండా పైకప్పు నిర్మాణ పనులు కొనసాగించాలని సూచించారు. టిటిడి పరిధిలోకి తీసుకున్న ఆలయాల్లో రోజువారీ పాలనా వ్యవహారాలు నిర్వహించేందుకు సమగ్రమైన మార్గదర్శకాలు రూపొందించాలన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో ధర్మప్రచారం చేసేందుకు వీలుగా నిర్దేశిత వ్యవధిలో ధర్మప్రచార రథాలు సిద్ధం చేయాలని సూచించారు. టిటిడి విద్యాసంస్థల్లో బయోమెట్రిక్ అటెండెన్స్ అమలుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఎస్వీబీసీలో ఒక సంవత్సర కాలానికి అవసరమైన కార్యక్రమాలతో కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని ఎండిని కోరారు. టిటిడిలోని పాత రికార్డులను డిజిటైజేషన్ చేయాలన్నారు. సప్తగిరి మాసపత్రిక పాఠకాసక్తి పెంచేందుకు వీలుగా మంచి పండితులు, రచయితలతో వ్యాసాలు రాయించాలని సూచించారు.