ప్రముఖ సినీ కళా దర్శకుడు తోట తరణిపై జనసేన పార్టీ అధినేత, సినీ హీరో, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. దీనికి కారణం లేకపోలేదు. తోట తరణికి ఫ్రాన్స్ ప్రభుత్వం అత్యున్నత పురస్కారమైన 'చెవాలియర్ డె లా లీజియన్ డి హానర్'ను ప్రకటించింది. దీనిపై పవన్ హర్షం వ్యక్తం చేస్తూ ఈ విశిష్ట గౌవరం అందుకున్న తోట తరణికి ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఇదే అంశంపై పవన్ ట్వీట్ చేస్తూ, 'భారత చిత్రపరిశ్రమ గర్వించదగ్గ అత్యుత్తమ కళా దర్శకులలో తోట తరణి ముందు వరుసలో ఉంటారు. కథాంశం ఏదైనా సరే, సహజత్వం ఉట్టిపడేలా సెట్స్ రూపొందించడం ఆయనకే చెల్లింది అని పేర్కొన్నారు. సామాజిక, చారిత్రక, పౌరాణికం అనే తేడా లేకుండా ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేసి అద్భుతమైన డ్రాయింగ్స్‌తో సృజనాత్మక సెట్స్‌ను ఆయన తీర్చిదిద్దుతారని కొనియాడారు.
తాను నటించిన ''హరిహర వీరమల్లు'' చిత్రానికి తోట తరణి కళా దర్శకత్వం వహించారని పవన్ గుర్తుచేశారు. ఆయన అపారమైన సృజనాత్మకత, పనిపట్ల నిబద్ధత భవిష్యత్ తరాలకు గొప్ప స్ఫూర్తినిస్తాయని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తోట తరణి సంపూర్ణ ఆరోగ్యంతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్టు తన సందేశంలో పేర్కొన్నారు.