విక్రాంత్, చాందిని చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “సంతాన ప్రాప్తిరస్తు”. ఈ చిత్రాన్ని మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. “ఏబీసీడీ మూవీ, ” అహ నా పెళ్లంట” వెబ్ సిరీస్ లను తెరకెక్కించిన యంగ్ డైరెక్టర్ సంజీవ్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు.
ఆయన రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి గారితో తెలంగాణ ప్రభుత్వానికి చెందిన యాంటీ డ్రగ్స్ యాడ్ ను రూపొందించి ప్రశంసలు అందుకున్నారు. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్, ఏక్ మినీ కథ, ఎక్స్ ప్రెస్ రాజా వంటి సూపర్ హిట్ సినిమాలకు స్క్రీన్ ప్లే అందించిన రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే రాస్తున్నారు. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రూపొందుతోంది.
ఈ రోజు హీరోయిన్ చాందిని చౌదరి పుట్టిన రోజు సందర్భంగా ఆమె క్యారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాలో చాందినీ చౌదరి కల్యాణి ఓరుగంటి అనే పాత్రలో నటిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగి తన జీవిత భాగస్వామిగా కావాలని, సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ వద్దని ఆమె కోరుకుంటున్నట్లు పోస్టర్ ద్వారా రివీల్ చేశారు.
ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న సమస్య సంతానలేమి. ఆ సమస్యను “సంతాన ప్రాప్తిరస్తు” సినిమాలో వినోదాత్మకంగా చూపించబోతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటోంది.