Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మ్యూజిక్ షాప్ మూర్తి కుటుంబంతో చూసేలా ఉంటుంది : దర్శకుడు శివ పాలడుగు

Music Shop Murthy Director Siva Paladugu

డీవీ

, బుధవారం, 12 జూన్ 2024 (16:55 IST)
Music Shop Murthy Director Siva Paladugu
పాతికేళ్ల వయసులో సాధించలేనిది.. యాభై ఏళ్ల వయసు వచ్చాక సాధించాలనుకుంటే.. ఆ సాధన కోసం చేసే ప్రయత్నం ఎలా ఉంటుంది? ఎంత ఎమోషనల్‌గా ఉంటుందని ఆడియెన్స్‌కు చెప్పాలనే మ్యూజిక్ షాప్ మూర్తి’ కథను రాసుకున్నానని చిత్ర దర్శకుడు శివ పాలడుగు అన్నారు. 
 
అజయ్ ఘోష్, చాందినీ చౌదరి ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. ఫ్లై హై సినిమాస్‌ బ్యానర్ పై హర్ష గారపాటి, రంగారావు గారపాటి ఈ మూవీని నిర్మించారు. శివ పాలడుగు ఈ సినిమాకి కథ, కథనాన్ని అందించి దర్శకత్వం వహించారు. ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ జూన్ 14న విడుదల కానుంది. ఈ క్రమంలో దర్శకుడు శివ పాలడుగు మీడియాతో ముచ్చటించారు. ఆయన చెప్పిన సంగతులివే..
 
 మీ నేపథ్యం, సినిమా ప్రయాణం గురించి చెప్పండి? 
మాది విజయవాడ. అమెరికాలో ఉద్యోగం చేశాను. అక్కడే నాకు ఫ్రెండ్‌గా హర్ష పరిచయమయ్యాడు. అమెరికాలోనే డైరెక్షన్ కోర్సులో డిప్లోమా చేశాను. నాకు మొదటి సినిమా అవకాశం చాలా సులభంగానే వచ్చింది. నా ఫ్రెండ్స్ నిర్మాతలు కావడంతో అంతా చాలా ఈజీగా జరిగిపోయింది.
 
 ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ కథకు అజయ్ ఘోష్‌నే ఎందుకు అనుకున్నారు? 
పాతికేళ్ల కుర్రాడి కథ చెబితే మళ్లీ రొటీన్ అవుతుందని, కాస్త కొత్తగా ఉండాలనే ఈ మ్యూజిక్ షాప్ మూర్తి కథను రాసుకున్నాను. ఈ కథకు అజయ్ ఘోష్ అయితే బాగుంటుందని అనుకున్నాను. కాస్త కొత్తగా ఉంటుందనే ఆయనతో ఈ కారెక్టర్ వేయించాను. ఆయన అద్భుతంగా ఎమోషన్స్ పండిస్తారని నాకు తెలుసు. ఈ సినిమా అనుకుంటున్న టైంలో ఇంకా పుష్ప రాలేదు. కానీ ఆయన ఈ పాత్రను పోషించగలరని అనుకున్నాను.
 
 చాందినీ చౌదరి పాత్రకు ఉండే ప్రాముఖ్యత ఏంటి? 
చాందినీ చౌదరి పాత్రతోనే సినిమా ప్రారంభం అవుతుంది. ఆమె పాత్ర చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. మూర్తి జీవితంలో అంజన వల్ల వచ్చిన మార్పులు సినిమాని ముందుకు తీసుకెళ్తాయి. అంజన కారెక్టర్‌లో చాందినీ చౌదరి అద్భుతంగా నటించారు. ఆమెకు ఇందులో తగిన ప్రాధాన్యం లభించింది.
 
 ఈ సినిమా కోసం మ్యూజిక్ మీద ఏమైనా రీసెర్చ్ చేశారా? 
మ్యూజిక్ మీద చాలానే రీసెర్చ్ చేశాం. అప్పటి తరం సంగీతం, నేటి ట్రెండీ మ్యూజిక్ ఇలా అన్నింటిపై పరిశోధించాం. పవన్ మంచి సంగీతాన్ని ఇచ్చారు. ప్రతీ పాట సందర్భానుసారంగానే వస్తుంది. ఎక్కడా ఇరికించినట్టుగా అనిపించదు.
 
 బడ్జెట్ పరంగా ఏమైనా సమస్యలు వచ్చాయా? 
ఈ సినిమా ప్రయాణంలో నాకు బడ్జెట్ పరంగా ఎలాంటి సమస్యలు రాలేదు. నా స్నేహితులే నిర్మాతలు కావడంతో, వారు నా మీద నమ్మకంతో ఖర్చుకి వెనుకాడలేదు. అనుకున్నదానికంటే కాస్త ఎక్కువే ఖర్చు అయినా.. ఎక్కడా వృథాగా ఖర్చు పెట్టలేదు.
 
 మొదటి సినిమా కదా?.. తెరకెక్కించడంలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? 
నాకు మంచి టీం దొరికింది. ఆ టీం సహాయంతోనే సినిమాను ఇంత వరకు తీసుకు రాగలిగాను. అయితే సినిమా తీయడం కంటే.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్, రిలీజ్ చేయడం, ప్రమోషన్స్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. మొత్తానికి మా సినిమా జూన్ 14న రాబోతోంది. చాలా ఆనందంగా ఉంది.
 
 ప్రస్తుతం పెద్ద సినిమాలే సరిగ్గా ఆడటం లేదు.. మీకు మీ చిత్రంపై ఉన్న నమ్మకం ఏంటి? 
చిన్న సినిమా, పెద్ద సినిమా అన్న తేడా ఇప్పుడు లేదు. చిన్న చిత్రాలకు ఓపెనింగ్స్ అంతగా రాకపోవచ్చు. కానీ కంటెంట్ ఉంటే.. ఎమోషన్స్ ఉంటే.. ఆడియెన్స్‌కు కనెక్ట్ అయితే చిన్న చిత్రాలే పెద్ద విజయాలను సాధిస్తాయి. మా సినిమా కంటెంట్, మా చిత్రంలోని ఎమోషన్స్ మీద మాకు చాలా నమ్మకం ఉంది. ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది.
 
 చాందినీ చౌదరి రెండు చిత్రాలు ఒకే రోజున వస్తున్నాయి కదా? 
చాందినీ చౌదరి గారు నటించిన యేవమ్ సినిమా కూడా జూన్ 14వ తేదీనే రిలీజ్ అవుతోంది. అయితే మా జానర్ వేరు.. ఆ సినిమా జానర్ వేరు.. వారికి సపరేట్ ఆడియెన్స్ ఉంటారు.. మాకు సపరేట్ ఆడియెన్స్ ఉంటారు. మా చిత్రం ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఉంటుంది.. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం అవుతుంది.
 
 మీ తదుపరి చిత్రాల గురించి చెప్పండి? 
ఈ సినిమా సక్సెస్‌తోనే నా ఫ్యూచర్ కూడా డిసైడ్ అవుతుంది. ఈ సినిమా ఫలితంతోనే నా నెక్ట్స్ ప్రాజెక్ట్‌లను అనౌన్స్ చేస్తాను.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహేష్ బాబు లెవంత్ మైల్ అయితే నేను ట్వెల్త్ మైల్ కి గురి పెట్టా : సుధీర్ బాబు