ప్రస్తుత పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తే మరో రెండేళ్ల వరకు సినీ ఇండస్ట్రీకి కష్టకాలం తప్పదని ప్రముఖ నిర్మాత, గీతా అర్ట్స్ అధినేత అల్లు అరవింద్ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే.. వచ్చే రెండేళ్ళ వరకు సినిమా థియేటర్లు ప్రేక్షకులతో హౌస్‌ఫుల్ కావడం అసాధ్యమని ఆయన అంచనా వేశారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్‌కు మందు లేదా వ్యాక్సిన్ కనిపెట్టేంత వరకు ప్రేక్షకులు థియేటర్‌కు వచ్చి సినిమా చూసే ప్రసక్తే లేదన్నారు. అప్పటివరకు ప్రేక్షకులు ఇంట్లోనే వివిధ ప్లాట్‌ఫ్లామ్స్‌పై సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తారని తెలిపారు.
ముఖ్యంగా, ఈ పరిస్థితి చిన్న నిర్మాతలకు చాలా కష్టంగా ఉంటుందన్నారు. చిన్న నిర్మాతలు ఈ పరిస్థితుల్లో నిలదొక్కుకోవడం, సినిమాలు నిర్మించడం అసాధ్యంగా ఉంటుందన్నారు. ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా సద్దుమణిగి తిరిగి పాత రోజులు రావాలంటే కనీసం రెండేళ్ల సమయం పడుతుందని అల్లు అరవింద్ అభిప్రాయపడ్డారు.